logo

అభివృద్ధి కోరుకుంటే భారాసకు ఓటేయండి

అన్ని వర్గాల ప్రజలు, రైతులపట్ల కాంగ్రెస్‌ అనాలోచితంగా వ్యవహరిస్తోందని కరీంనగర్‌ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 08 May 2024 04:57 IST

ప్రసంగిస్తున్న భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌, వేదికపై ఎమ్మెల్యే కమలాకర్‌, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు

రాంపూర్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: అన్ని వర్గాల ప్రజలు, రైతులపట్ల కాంగ్రెస్‌ అనాలోచితంగా వ్యవహరిస్తోందని కరీంనగర్‌ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. 56వ డివిజన్‌ భాగ్యనగర్‌ కమ్యూనిటీ హాల్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి మంగళవారం డివిజన్‌వాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పెట్టడం కాంగ్రెస్‌ కుట్ర. చంద్రబాబు ఆంధ్రలో గెలిస్తే ఆయన శిష్యుడైన సీఎం రేవంత్‌రెడ్డిలు మోదీ దగ్గరికి వెళ్లి దాన్ని కొనసాగించే ప్రయత్నాలు చేస్తారు. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును పెట్టగా, దానిపై ఆనాడు పార్లమెంటులో వ్యతిరేకించి కొట్లాడి హైకోర్టు విభజన జరిపించి అప్పటి వరకు ఉన్న జడ్జిలను 24 నుంచి 42 పెంచేలా కృషి చేశా. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా కేసులు సత్వర పరిష్కారం అవుతున్నాయి. కరీంనగర్‌ అభివృద్ధిపై బండి సంజయ్‌ కేంద్రంతో, పార్లమెంటులో ఏనాడూ మాట్లాడలేదు. టిప్పర్‌ లోడ్‌ ఉత్తరాలు రాశారు. కానీ టిప్పర్‌ మట్టి కూడా తీయలేదు. మానేరు రివర్‌ ఫ్రంట్‌, తీగల వంతెనలు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అందవిహీనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డి వైఫల్యంతోనే రైతాంగానికి కష్టాలు వచ్చాయి. కరీంనగర్‌ అభివృద్ధి కోసం నన్ను గెలిపించండి’’ అని కోరారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారిందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎల్‌.రమణ, భానుప్రసాద్‌రావు, మేయర్‌ వై.సునీల్‌రావు, కార్పొరేటర్‌ రాజేందర్‌రావు, కోఆప్షన్‌ సభ్యుడు అజిత్‌రావు, భారాస నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ, కరీంనగర్‌ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి మంగళవారం నగరంలోని సవరన్‌ స్ట్రీట్‌ 43, 45 డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నగర భారాస అధ్యక్షుడు హరిశంకర్‌, భారాస మైనారిటీ నాయకులు అక్బర్‌ హుస్సేన్‌, జమీలొద్దీన్‌, వాజీద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు