logo

ఆ పార్టీలకు మాట్లాడే అర్హత లేదు

వేములవాడ ఆలయ అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇవ్వలేదని భారాస ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేసిన విమర్శలను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ ఖండించారు.

Published : 09 May 2024 04:45 IST

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: వేములవాడ ఆలయ అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇవ్వలేదని భారాస ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేసిన విమర్శలను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ ఖండించారు. వేములవాడ ఆలయం గురించి మాట్లాడే అర్హత భారాస, కాంగ్రెస్‌ నేతలకు లేదన్నారు. బుధవారం రాత్రి కరీంనగర్‌లో పద్మశాలీ భవన్‌లో జరిగిన కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్‌ బూత్‌ ఏజెంట్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రసాద్‌ స్కీం కింద ప్రతిపాదనలు పంపితే వేములవాడ, కొండగట్టు ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా, కేంద్రం నుంచి లేఖ రాసినా నాటి సీఎం కేసీఆర్‌ పట్టించుకోలేదు. వేములవాడ, కొండగట్టు ఆలయాలు అభివృద్ధికి నోచుకోకపోవడానికి నాటి కేసీఆర్‌ సర్కారే కారణం. వేములవాడ ఆలయ అభివృద్ధికి ఏడాదికి వంద కోట్ల చొప్పున రూ.400 కోట్లు విడుదల చేసి అద్భుతంగా అభివృద్ధి చేస్తామని రాజన్న సాక్షిగా హామీ ఇచ్చిన కేసీఆర్‌ నయా పైసా ఇవ్వలేదు. కొండగట్టు అంజన్న ఆలయానికి సైతం వంద కోట్లు ఇస్తానని చెప్పి మోసం చేశారు. భారాస పాలనలో వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. ఆలయ అభివృద్ధికి నిధులు ఖర్చు పెట్టకపోగా రాజన్న ఆలయానికి వచ్చే ఆదాయాన్ని సైతం దారి మళ్లించారు. నేను ఎంపీగా గెలిచిన తర్వాత వేములవాడ, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా. ఆలయాల అభివృద్ధి విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయాలను పక్కనపెట్టి సహకరించాలి. కేంద్రం కూడా పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయాన్ని దేశమంతా చాటి చెప్పేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేములవాడకు వచ్చారనే విషయాన్ని కాంగ్రెస్‌, భారాస నేతలు విస్మరించడం సిగ్గు చేటు. భారాస అభ్యర్థి నాన్‌లోకల్‌ కాబట్టే వేములవాడ ఆలయాన్ని ప్రసాద్‌ పథకంలో పెట్టించలేకపోయారు. కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణం కాకపోయినా వినోద్‌కుమార్‌ ఏనాడూ పట్టించుకోలేదు. కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను ఆయన ఇప్పించలేకపోయారు. అయినా నేను కేంద్రాన్ని ఒప్పించి సేతుబంధన్‌ స్కీం కింద ఆర్వోబీ నిర్మాణానికి పూర్తి స్థాయి నిధులు మంజూరు చేయించా..’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని