logo

కలిసొచ్చిన బాస్మతి... హరియాణాకు ఎగుమతి

కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు, మిల్లర్ల కోతలతో విసుగు చెందిన కర్షకులు బాస్మతి రకం వరి సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. యాసంగిలో వ్యవసాయ క్షేత్రాల్లో పంటను పండిస్తూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.

Published : 09 May 2024 04:48 IST

కర్షకులకు గిట్టుబాటు
న్యూస్‌టుడే, వీర్నపల్లి

కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు, మిల్లర్ల కోతలతో విసుగు చెందిన కర్షకులు బాస్మతి రకం వరి సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. యాసంగిలో వ్యవసాయ క్షేత్రాల్లో పంటను పండిస్తూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. తాలు, తరుగుతో సంబంధం లేకుండా పచ్చి ధాన్యాన్ని ఇంటి వద్దే అమ్ముకుంటున్నారు. దిగుబడి తక్కువగానే ఉన్న సమయంతోపాటు ధర కలిసొస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వీర్నపల్లి మండల కేంద్రంలో 40 మంది రైతులు సుమారు వంద ఎకరాలకు పైగా బాస్మతి ధాన్యం పండిస్తున్నారు. దొడ్డు రకం, సన్న రకంతో పోలిస్తే పక్షం రోజుల మందుగానే పంట చేతికొస్తుంది. దీంతో చివరి దశలో నీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వడం లేదని రైతులు అంటున్నారు. నాలుగేళ్లుగా సాగుతో పెట్టుబడులు పోను ఆశించిన ఆదాయం వస్తుందని చెబుతున్నారు. మార్కెటింగ్‌ కోసం హరియాణాకు చెందిన ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇంటి వద్దే కాంటాలు...

యాసంగిలో సన్నరకం పండించేందుకు రైతులు అంతగా ఆసక్తి చూపరు. దొడ్డు రకం ధాన్యం పండించడంతో కొనుగోలు కేంద్రాలకు ఒక్కసారిగా ధాన్యం పోటెత్తుతున్నాయి. దీంతో కాంటాలకు అధిక సమయం పడుతుంది. తాలు తొలగించినప్పటికీ తరుగు పేరిట కొంత అనధికారికంగా తూకం పరిపాటిగా మారింది. ఈ మూస పద్ధతిని వీడి బాస్మతి సాగుకు ఇక్కడి రైతులు ముందుకొస్తున్నారు. వంగడాలను హరియాణా నుంచి తెచ్చుకుని ఇక్కడ సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చిన మూడు రోజుల్లోపే ఇంటివద్దే పచ్చిగాఉన్నధాన్యాన్ని సైతం తూకాలు వేస్తున్నారు. ఎకరాకు 20 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని కర్షకులు చెబుతున్నారు. తాలు తరుగు సాకుతో కోతలు విధించడం లేదు. అలాగే హమాలీ డబ్బులను సైతం సదరు వ్యక్తులే చెల్లిస్తున్నారు. రూ. 2,600 ధర పలుకుతుందని అన్నదాతలు పేర్కొంటున్నారు. తూకం వేసిన 48 గంటల్లోపు రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమవుతున్నాయి.


నాలుగేళ్లుగా సాగు చేస్తున్నా

- పతారి పద్మయ్య, వీర్నపల్లి

నాలుగేళ్ల క్రితం ఓ వ్యక్తి సలహాతో ఇక్కడ బాస్మతి సాగు చేశాను. నాతోపాటు ఇరుగు పొరుగు రైతులు సైతం పంటను వేశారు. ఇంటి వద్దకే వచ్చి కాంటాలు వేస్తున్నారు. మూడు ఎకరాల విస్తీర్ణంలో 70 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. తూకం వేసిన రెండు రోజుల్లో డబ్బులు ఖాతాల్లో జమవుతున్నాయి. బాస్మతి సాగుతో మాకు బాగానే గిట్టుబాటు అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని