logo

సింగరేణి కార్మికుల మొగ్గు ఎటు?

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి కార్మికులు ఎటువైపు మొగ్గు చూపుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. భారీ సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ఆదరణ ఉంటే విజయావకాశాలు ఉంటాయని భావిస్తున్న అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Published : 09 May 2024 04:53 IST

ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థుల ప్రయత్నాలు
న్యూస్‌టుడే, గోదావరిఖని

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి కార్మికులు ఎటువైపు మొగ్గు చూపుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. భారీ సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ఆదరణ ఉంటే విజయావకాశాలు ఉంటాయని భావిస్తున్న అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో అత్యధికంగా ఉన్న సింగరేణి కార్మికులు ఎటు వైపు మొగ్గు చూపితే ఫలితం అటువైపే ఉంటుందన్నది అభ్యర్థుల ప్రగాఢ విశ్వాసం. దీంతో లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతరులు సైతం వారి ఆదరణ పొందేందుకు దృష్టి సారించారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉండటంతో ఈలోగా వారిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా కార్మికులు ఒకసారి నిర్ణయం తీసుకుంటే మొత్తం అదే సరళి ఉంటుండగా ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారన్నది అంతుచిక్కడం లేదు. పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా అందులో అయిదు నియోజకవర్గాలు పూర్తిగా సింగరేణి ప్రాంతాల్లోనే ఉన్నాయి. రామగుండం నియోజకవర్గం పరిధిలో ఆర్జీ-1, 2 డివిజన్లు, మంథని నియోజకవర్గం పరిధిలో ఆర్జీ-3 డివిజన్‌, మంచిర్యాలకు శ్రీరాంపూర్‌,  చెన్నూరులో మందమర్రి, జైపూర్‌ ప్లాంటు, బెల్లంపల్లి అసెంబ్లీ స్థానానికి బెల్లంపల్లి డివిజన్లు వస్తాయి. మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాల్లో 28,829 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరితో పాటు మరో 15 వేల మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. సింగరేణి ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలు కలిపితే కనీసం 1.80 లక్షల ఓట్ల వరకు ఉంటాయి. మెజారిటీ ఓట్లు ఎవరికి పడితే వారినే విజయం వరించే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ఎక్కువ శాతం సింగరేణి కార్మికులపై దృష్టి సారించారు.

కొత్త గనులతోనే ఉపాధి అవకాశాలు

సింగరేణిలో కొత్త గనులు ఏర్పాటు చేయక చాలా సంవత్సరాలవుతోంది. ప్రస్తుతం కొత్తగా విధించిన నిబంధన ప్రకారం ఓపెన్‌ టెండర్‌ ద్వారానే గనులను దక్కించుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి చేస్తున్న గనులన్నీ పాతవి కావడంతో కొద్ది కాలంలోనే అందులో నిక్షేపాలు పూర్తయ్యే పరిస్థితి ఉంది. గనులు మూసివేసే క్రమంలో ఉపాధి అవకాశాలు సైతం సన్నగిల్లుతున్నాయి. కొత్త ఉద్యోగాలు రావాలంటే నూతన గనులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో కొత్తగా ప్రతిపాదనలో ఉన్న గనులు 10 వరకు ఉన్నాయి. వీటిని ప్రారంభించుకుంటే కనీసం 10 వేల మంది వరకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. కొత్త గనులు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ప్రస్తుతం కోల్‌బెల్టు ప్రాంతంలో ఉంది. గనులుంటేనే నియోజకవర్గం పరిధిలో ఓటర్లు ఉండే అవకాశం ఉండటంతో భవిష్యత్తులో కొత్త గనుల ఏర్పాటు అత్యవసరంగా మారింది.

  • కోల్‌ ఇండియాలో ఆర్థిక ప్రయోజనాలపై వర్తించే ఆదాయ పన్నును యాజమాన్యం భరిస్తుంది. అదే విధంగా సింగరేణిలో సైతం యాజమాన్యం భరించే విధంగా చర్యలు చేపట్టాలన్న డిమాండ్‌ ఇక్కడి కార్మికుల్లో ఉంది. కార్మికులు సంపాదించిన మొత్తంలో 30 శాతం వరకు ఆదాయ పన్ను కిందే చెల్లించాల్సి వస్తుంది. దీనిని నివారించేందుకు కొంత వరకైనా మినహాయింపునిస్తే బాగుంటుందన్న అభిప్రాయం నెలకొంది.
  • కాంట్రాక్టు కార్మికులకు హైపవర్‌ కమిటీ వేతనాలు చెల్లించాలని ఎంతో కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. కోల్‌ ఇండియాలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు ఇది వర్తింపజేస్తున్నారు. సింగరేణిలో అమలు చేయడం లేదు. దీనిపై అనేక సార్లు కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేశారు. జేబీసీసీఐ సమావేశాల్లో చర్చించారు. ఇప్పటి వరకు ఈ అంశంపై ముందడుగు పడలేదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని