logo

గజిబిజిగా ఓటరు జాబితా

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పార్టీల నాయకులు ఓటరు జాబితాలు పరిశీలిస్తున్నారు. వారు జాబితాను చూస్తే.. పేర్లు గజిబిజిగా కనిపించాయి. ఓటరు చీటీలు పంపిణీ చేసే వారికి కూడా తలనొప్పిగా తయారైంది.

Published : 09 May 2024 05:14 IST

సరిదిద్దకుండానే పోలింగ్‌కు..
న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

  • వావిలాలపల్లిలోని పోలింగ్‌ కేంద్రంలో ఉండాల్సిన ఓటర్లు అంబేడ్కర్‌ రోడ్డు, క్రిస్టియన్‌ కాలనీలో ప్రత్యక్షమయ్యారు. జాబితాలో ప్రకారం ఇంటి నంబర్లు అక్కడికి ఉండటంతో పోల్‌చీటీలు కూడా అక్కడే పంపిణీ చేసే అవకాశముంది.
  • బూత్‌లలో ఓటర్ల కేటాయింపు సక్రమంగా చేయకపోవడంతో ఒక బూత్‌లో 487 ఓట్లు ఉండగా, మరో బూత్‌లో 1489 ఓట్లు ఉన్నాయి. ఓటేసే సమయంలో ఒక దానిలో రద్దీ ఉండనుంది. రెండింటిలో సమానంగా నిర్ణయించలేదు. నగరవ్యాప్తంగా అత్యధిక శాతం పోలింగ్‌ కేంద్రాలలో ఇలాగే ఉన్నాయి.
  • ఇంటినంబర్‌ ప్రకారం కుటుంబ సభ్యులందరివి ఒకే పోలింగ్‌ స్టేషన్‌లోని ఒకే బూత్‌లో ఉండాలి. అలాకాకుండా భార్య, భర్త, పిల్లల ఓట్లు వేర్వేరు చోట ఉన్నాయి.
  • కాపువాడ, పాతబజారు, పద్మశాలీ వీధిలో ఉన్న ఓటర్లు మారుతినగర్‌లోని ఓటరు జాబితా ఉన్నాయి. పోలింగ్‌ కేంద్రాలు ఎక్కడ ఉంటాయో తెలియక కొందరు ఓటేసేందుకు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో రాలేదు.

న్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పార్టీల నాయకులు ఓటరు జాబితాలు పరిశీలిస్తున్నారు. వారు జాబితాను చూస్తే.. పేర్లు గజిబిజిగా కనిపించాయి. ఓటరు చీటీలు పంపిణీ చేసే వారికి కూడా తలనొప్పిగా తయారైంది. వారం రోజులుగా ఓటర్లను కలుసుకునేందుకు ఆయా ప్రధాన పార్టీల నాయకులు బూత్‌ కమిటీల వారీగా ఇంటింటికి వెళ్తున్నారు. కొందరి పేర్లు ఉండి, మరికొందరివి కనిపించకపోవడంతో ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. మిగతా ఓట్లు ఏ బూత్‌లో ఉన్నాయో తెలుసుకొని చెబుతామని చెప్పి సదరు పార్టీల బాధ్యులు అక్కడి నుంచి జారుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇలాగే ఓటర్ల జాబితా గందరగోళంగా ఉండగా, ప్రస్తుతం కూడా అలాగే ఉందని కార్పొరేటర్లు అంటున్నారు. పార్లమెంట్‌ ఎన్నికలలో మార్పులు, చేర్పులు ఉంటాయని భావించిన రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులకు సమస్యలు ఎప్పటిలాగే దర్శనమిచ్చాయి. ఈ ఓటరు జాబితా ఎప్పుడు మారుతుందో ఆ అధికారులే తెలియాలంటున్నారు.

ఎప్పటిలాగే ప్రత్యక్షం..

పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితా లేకపోవడం ఒక కారణమైతే, సమీప బూత్‌లలో ఉన్న ఓటర్లు కాకుండా ఇతర బూత్‌లకు సంబంధించిన వారు ఉన్నారు. ఇంటి నంబర్లు, వీధుల పేర్లు ఎక్కడో తెలియకుండా మారింది. కొన్నింటికి అయితే రెండు అంకెల ఇంటి నంబర్లు ఉండటంతో ఏ డివిజన్‌ ఓట్లు అనేవీ తేల్చుకోలేకపోతున్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో ఉన్నట్లే ఇంటినంబర్ల స్థానంలో సర్వే నంబర్లు ఉన్నాయి. మరికొందరికి బిల్డింగ్‌ అని ఉంది. ఇలాంటి వాటిని రెవెన్యూ అధికారులు పరిశీలించి మార్చకపోవడంతో అలాగే జాబితాలో ముద్రితమవుతున్నాయి.

అదనంగా అయిదు కేంద్రాలు

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొత్తం 390 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, లోక్‌సభ ఎన్నికల కోసం అదనంగా అయిదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రూరల్‌ మండలంలో దూరంగా ఉన్న వాటిని ఓటర్ల దగ్గరికి మార్చినట్లు సమాచారం. ఇంకా 19 పోలింగ్‌ కేంద్రాలను అటు ఇటుగా మార్చారు. వీటిని ఓటర్లు దగ్గర ఉన్న ప్రాంతానికి విభజించారు. ఓటరు చీటీలో పోలింగ్‌ కేంద్రం, చిరునామా, రూట్‌ మ్యాప్‌ ప్రచురించి ఇచ్చారు. దాని ఆధారంగా ఓటర్లు పోలింగ్‌ రోజున ఓటు వేసే వీలుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు