logo

గీత దాటితే.. కటకటాలే!

ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తోంది. దీంతో పాటు పోలింగ్‌కు ఆటంకం కలిగించే చర్యలను తీవ్రంగా పరిగణిస్తుంది.

Updated : 10 May 2024 06:33 IST

ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తోంది. దీంతో పాటు పోలింగ్‌కు ఆటంకం కలిగించే చర్యలను తీవ్రంగా పరిగణిస్తుంది. ఎన్నికల రోజున కేంద్రాన్ని స్వాధీనం చేసుకొని పోలింగ్‌ను అడ్డుకొంటే కటకటాల పాలు కావాల్సిందే. ఓటింగ్‌ జరగకుండా అడ్డుకోవడాన్ని బూత్‌ క్యాప్చరింగ్‌ అంటారు. ఈవీఎంలను ధ్వంసం చేయడం, బ్యాలెట్‌ పేపర్లను ఎత్తుకెళ్లడం, ఎన్నికల గుర్తులపై సిరా పోయడం వంటి చర్యలన్నీ దీని కిందకే వస్తాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఐపీసీ సెక్షన్‌ 135ఏ, 136 ప్రకారం మూడేళ్ల నుంచి అయిదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. అందుకే పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో తెల్లటి గీత గీస్తారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ఈసీ ఏర్పాటు చేసిన వాహనాలు తప్ప ఎలాంటి వాహనాలను దాన్ని దాటి లోపలికి అనుమతించరు. అవాంఛనీయ ఘటనలు నియంత్రించేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో వెబ్కాస్టింట్‌, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది.

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌


సిరా గుర్తు సరే.. వేలు లేకుంటే!

పోలింగ్‌ సమయంలో ఓటరు చేతి వేలికి సిరా గుర్తు వేస్తారు. దొంగ ఓట్లను నియంత్రించేందుకు ఎన్నికల సంఘం ఈ నిబంధన అమలు చేస్తోంది. ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు వేస్తారు. ఒకవేళ ఎడమ చేతి చూపుడు వేలు లేకపోతే ఎలా? అన్న సందేహం రావచ్చు. అలాంటప్పుడు ఈసీ ప్రత్యామ్నాయ మార్గాలు చూపింది. ఎడమ చూపుడు వేలు లేకపోతే మధ్య వేలికి గుర్తు వేస్తారు. అది కూడా లేనప్పుడు బొటన వేలికి పెడతారు. ఎడమ చేతికి వేళ్లే లేకుంటే కుడి చేయి చూపుడు వేలు, అదీ లేకుంటే మధ్య వేలు, ఆ తర్వాత ఉంగరం వేలికి సిరా చుక్క అంటిస్తారు. ఒకవేళ ఓటరుకు రెండు అరచేతులు లేకుంటే చేయి మధ్య భాగంలో, లేకుంటే భుజం వద్ద చుక్క రాస్తారు.

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌


ఓటు.. పలు విధాలు

బ్యాలెట్ ఓటింగ్‌: ఓటర్లు నేరుగా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం. ప్రస్తుతం ఈవీఎంలు వాడుకలో ఉండగా గతంలో బ్యాలెట్‌ పత్రాల ద్వారా పోలింగ్‌ జరిగేది. నిర్దేశిత ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకదానిని చూపించి ఓటు వేయవచ్చు.
ఆన్‌లైన్‌ ఓటింగ్‌: కొన్ని దేశాల ప్రజలకు ఆన్‌లైన్‌ ఓటింగ్‌కు అనుమతి ఉంది. ఈ విధానాన్ని మొదట ‘ఎస్టోనియా’లో 2005లో నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో ప్రవేశపెట్టారు.
పోస్టల్‌ ఓటింగ్‌: కేంద్ర సాయుధ దళాలు, రాష్ట్ర పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యులు, అధికారికంగా విదేశాల్లో విధులు నిర్వహిస్తున్నవారు, ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు దీనికి అర్హులు. ఓట్ల లెక్కింపు సమయంలో మొదట పోస్టల్‌ ఓట్లను లెక్కిస్తారు.
ఇంటి నుంచి ఓటు: 80 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే విధానాన్ని గతేడాది కర్ణాటక ఎన్నికల్లో మొదటిసారి ప్రవేశపెట్టారు. డిసెంబరులో నిర్వహించిన తెలంగాణ శాసనభ ఎన్నికల్లో ఈ విధానాన్ని సుమారు 28,057 మంది వినియోగించుకున్నారు.
టెండరు లేదా ఛాలెంజింగ్‌ ఓటు: ఎవరి ఓటునైనా ఇతరులు వేసిన సందర్భంలో ఓటరు తన హక్కును వినియోగించుకోవడానికి ఈ విధానాన్ని వినియోగిస్తారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం 1961లో సెక్షన్‌ 49(పి) ద్వారా ఈ సదుపాయాన్ని కల్పించింది. ఓటు కోల్పోయిన తానే నిజమైన ఓటరును అని అవసరమైన ధ్రువీకరణ పత్రాల ద్వారా నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రిసైడింగ్‌ అధికారి ఇచ్చే ఫారం 17(బి) పూర్తి చేసి టెండరు బ్యాలెట్ పేపరుపై వేసిన ఓటును ప్రత్యేక కవర్‌లో భద్రపరిచి కౌంటింగ్‌ కేంద్రానికి పంపిస్తారు.
ప్రాక్సీ ఓటు: తనకు బదులు ఇతరులను పంపించి ఓటు వేయించడమే ప్రాక్సీ ఓటు. పోలీసు, రక్షణ శాఖల్లోని ఇంటెలిజెన్స్‌, గూఢచార సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. తమ తరఫున ఓటు వేసేందుకు ప్రాక్సీని నియమించుకునేందుకు వీలుగా 2003లో భారతదేశ ప్రజాప్రతినిధి చట్టాన్ని సవరించారు.

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం


పెద్దపల్లి బరిలో ఈసారే అత్యధికం

పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి 1962 నుంచి ఎన్నికలు నిర్వహిస్తుండగా ఈసారి అత్యధికంగా 42 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1952, 1957లలో కరీంనగర్‌ ద్విసభ్య నియోజకవర్గ పరిధిలోనే పెద్దపల్లి ఉండేది. 1962లో మొదటి ఎన్నికల్లో కేవలం ఇద్దరు మాత్రమే పోటీ చేశారు. 1967, 1977, 1989లలో నలుగురు చొప్పున, 1971, 1980, 1984, 2004 ఎన్నికల్లో అయిదుగురు చొప్పున, 1991, 2009లలో 15 మంది, 1996లో 19 మంది, 1998లో 8 మంది, 1999లో ఏడుగురు, 2014లో 17 మంది, 2019లో 16 మంది పోటీ పడ్డారు. ప్రస్తుతం బరిలో ఉన్న 42 మందే నియోజకవర్గ చరిత్రలో అత్యధికం.

న్యూస్‌టుడే, ఫెర్టిలైజర్‌ సిటీ


స్వస్థలాలకు ఏపీ ఓటర్లు

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ఈ నెల 13న జరుగుతుండటంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నివసిస్తున్న ఆ రాష్ట్రానినికి చెందిన ఓటర్లు స్వస్థలాలకు తరలివెళ్తున్నారు. ఏపీలో తెదేపా, జనసేన, భాజపాలతో కూడిన కూటమి, వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రధానంగా తలపడుతుండటంతో బరిలోని అభ్యర్థులు ప్రతి ఓటరుపైనా దృష్టి సారించారు. దీంతో ఇక్కడ భవన నిర్మాణ, పరిశ్రమలు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న వేలాదిమందిని ఆంధ్రప్రదేశ్‌కు రప్పించేందుకు అక్కడి నాయకులు చొరవ తీసుకుంటున్నారు. అన్ని పార్టీలకు చెందిన వారు ఫోన్‌ల ద్వారా ఇక్కడ నివసిస్తున్న వారిని సంప్రదించి ఓటేసేందుకు ఆహ్వానించటం, వాహనాలు కూడా ఏర్పాటు చేయటం లేదా రానుపోను ఖర్చులను ఇస్తుండటంతో పెద్దఎత్తున వెళ్తున్నారు. ఓటు వేయటంతో పాటు స్వస్థలంలోని తమవారిని కలిసే అవకాశం ఉండటంతో వేసవి ఎండలను సైతం లెక్కచేయకుండా ఆంధప్రదేశ్‌లో ఓటుహక్కును కలిగినవారంతా ఇంట బాట పట్టారు.

న్యూస్‌టుడే, జగిత్యాల వాణిజ్యం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు