logo

‘అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా’

అందరూ సహకరిస్తే బళ్లారి జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని బాధ్యమంత్రి బి.శ్రీరాములు అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద జిల్లాలో 86,490 మంది రైతుల ఖాతాల్లోకి రూ.13,736 లక్షలు జమ అయ్యాయన్నారు.

Published : 27 Jan 2022 00:39 IST


మోకా చెరువులోకి నీటి విడుదల సందర్భంగా స్విచ్‌ ఆన్‌ చేసిన
మంత్రి శ్రీరాములు, బళ్లారి గ్రామీణ శాసనసభ్యుడు నాగేంద్ర తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: అందరూ సహకరిస్తే బళ్లారి జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని బాధ్యమంత్రి బి.శ్రీరాములు అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద జిల్లాలో 86,490 మంది రైతుల ఖాతాల్లోకి రూ.13,736 లక్షలు జమ అయ్యాయన్నారు. అక్టోబరు, నవంబరు నెలల్లో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన 53,065 మంది రైతులకు రూ.4,936 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందజేసిందన్నారు. జిల్లా ఖనిజ నిధి నుంచి రూ.2,222.15 కోట్లతో ఆరు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రగతి గణాంకాలను ఆయన వివరించారు. జిల్లా ఆసుపత్రి, విమ్స్‌లో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, విమ్స్‌ రాష్ట్రంలోనే నమూనాగా రూపొందుతుందని మంత్రి అన్నారు. 
అందుబాటులోకి మరోచెరువు
మోకా సమీపంలోని ఎల్లెల్సీ పక్కన కొత్తగా నిర్మించిన తాగునీటి చెరువులోకి నీటిని తోడే ప్రక్రియను గ్రామీణ శాసనసభ్యుడు బి.నాగేంద్ర, తన అర్ధాంగితో కలిసి మంత్రి శ్రీరాములు బుధవారం ప్రారంభించారు. ఎల్లెల్సీ పక్కన ఉన్న విద్యుత్తు పంపుసెట్ల స్విచ్‌ నొక్కి ప్రారంభించిన వెంటనే గొట్టాల ద్వారా తుంగభద్ర జలాలు గలగలా చెరువులోకి పరుగులు తీశాయి. ఇక్కడి నుంచి రెండు తాగునీటి చెరువుల ద్వారా ఇప్పటికే నగర వాసులకు రోజూ తాగునీటిని అందజేస్తుండగా, మరో చెరువును కూడా వినియోగంలోకి తెచ్చారు. సండూరు తాలూకా దరోజి కరడిధామలో సఫారీ వాహనాలను మంత్రి శ్రీరాములు జెండా ఊపి ప్రారంభించారు. 
గ్రామ ఒన్‌ సేవలు ప్రారంభం
బళ్లారి సహా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో గ్రామ ఒన్‌ సేవలు ప్రారంభమైనట్లు మంత్రి శ్రీరాములు ప్రకటించారు. ఈ కేంద్రాల్లో 100 రకాల ప్రభుత్వ సేవలు లభిస్తాయన్నారు. మోకా గ్రామంలో గ్రామ ఒన్‌ సేవా కేంద్రాన్ని గ్రామీణ శాసనసభ్యుడు బి.నాగేంద్రతో కలిసి మంత్రి బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. కేంద్రం నుంచి పలువురికి ప్రమాణ పత్రాలను అందజేశారు. గ్రామ ఒన్‌ సేవలను  సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు డా.సయ్యద్‌ నాసీర్‌ హుసేన్, ఎంపీ వై.దేవేంద్రప్ప, శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి, బుడా అధ్యక్షుడు పాలన్న కాకర్లతోట, డీసీ పవన్‌కుమార్, ఎస్పీ సైదులు అడావత్, జడ్పీ సీఈవో కె.ఆర్‌.నందిని, ఉప విభాగం ఏసీ డా.ఆకాశ్‌ శంకర్,    నగర పాలికె కమిషనర్‌ ప్రీతి గెహ్లాట్, అటవీశాఖ అధికారి సిద్రామప్ప, తహసీల్దార్‌ రెహిమాన్‌ పాశా తదితరులు పాల్గొన్నారు. 


ప్రసంగిస్తున్న శ్రీరాములు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని