logo

మీకు పంక్చర్‌ చేసినోళ్లు తెలియదా యడ్డీ?

విధానసభకు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ప్రజాధ్వని యాత్ర చేస్తున్న బస్సుకు పంక్చర్‌ అయిందని మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప చేసిన వ్యాఖ్యలను విపక్ష నాయకుడు సిద్ధరామయ్య ఖండించారు.

Published : 06 Feb 2023 01:32 IST

సిద్ధు ఘాటు వ్యాఖ్యలు

కలబురగి, న్యూస్‌టుడే: విధానసభకు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ప్రజాధ్వని యాత్ర చేస్తున్న బస్సుకు పంక్చర్‌ అయిందని మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప చేసిన వ్యాఖ్యలను విపక్ష నాయకుడు సిద్ధరామయ్య ఖండించారు. ముఖ్యమంత్రిగా ఉన్న బీఎస్‌వైను పదవి నుంచి తప్పించి, పక్కన పెట్టింది ఎవరో చెప్పాలని భాజపా నాయకులను ప్రశ్నించారు. మీకు పంక్చర్‌ చేసిన నాయకులు ఎవరో తెలియదా అని యడ్డీని ప్రశ్నించారు. ప్రజాధ్వని యాత్రలో భాగంగా కలబురగికి చేరుకున్న ఆయన ఆదివారం ఇక్కడ తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. యడియూరప్ప లేకుండానే ఎన్నికలలో ఘన విజయం సాధిస్తామని కమలనాథులు కలలు కన్నారని ఎద్దేవా చేశారు. యడియూరప్ప తనకు మంచి స్నేహితుడని, ఆయన ఆరోగ్యంగా ఉంటూ, క్రియాశీలక రాజకీయాలలో ఉండడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు. భాజపాను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని విశ్రాంతి తీసుకోకుండా పోరాటం చేస్తున్న ఆయన, విపక్షాలను కించపరుస్తూ మాట్లాడడం సరికాదన్నారు. యడియూరప్ప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లినప్పుడే 104 స్థానాలు వచ్చాయని, బొమ్మైకు అందులో సగం వచ్చినా గొప్పేనని వ్యాఖ్యానించారు. తాను కోలారు నుంచి పోటీ చేస్తే 200 శాతం విజయం దక్కించుకుంటానని, ఆ నియోజకవర్గాన్నే తనకు కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరతానని చెప్పారు. కోలారు తనకు సురక్షితం కాదని, తన కుమారుడు యతీంద్ర సమీక్ష నిర్వహించినట్లు వస్తున్న వార్తలలో నిజం లేదన్నారు. తన వినతిని పార్టీ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. చాముండేశ్వరిలో తనను ఓడించినా, బాదామి ప్రజల తనను అక్కున చేర్చుకున్నారని చెప్పారు. బెంగళూరు నుంచి ప్రతిసారీ వచ్చి వెళ్లడం దూరాభారం అవుతుందని చెబితే, తనకు హెలికాప్టర్‌ కూడా కొనిస్తామని అక్కడి కార్యకర్తలు, నాయకులు తనకు చెప్పారని గుర్తు చేశారు. తాను ఐదేళ్లలో 15 లక్షల ఇళ్లను నిర్మించి ఇవ్వగా, భాజపా ఇప్పటి వరకు ఒక్క ఇంటినీ సొంతంగా నిర్మించి ఇవ్వలేదన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి కాని ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి, అది తమ ఖాతాలోకి వేసుకుందని ఆరోపించారు. భాజపాకు వ్యతిరేకంగా ప్రజలలో ఆగ్రహం ఉందన్నారు. గుత్తేదారుల నుంచి 40 శాతం కమీషన్‌, కుల, మతాల పేరిట ప్రజల మధ్య చీలికలు తీసుకు వస్తుందన్న విమర్శ, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న కోపం ప్రజలలో ఉందని తెలిపారు. యాదగిరి, కలబురగి, కొడగు, బీదర్‌ జిల్లాలోని కురబరు, గోండులు, రాజగొండ సముదాయాలను షెడ్యూల్డు తెగల పరిధిలోకి తీసుకు రావాలని సిఫార్సు చేసి ఎనిమిదేళ్లు దాటినా, ఇప్పటికీ స్పందించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి రాజ్యాంగంలో సవరణ చేయలేదని, పంచమసాలి సముదాయానికి రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, ఆ సముదాయం ప్రజలను వంచించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని