logo

Karnataka Elections: కన్నడ రాజ్యానికి రాజెవరో?

రాష్ట్రాన్ని మరో ఐదేళ్ల పాటు పాలించే పార్టీ ఏదో శనివారం తేలిపోతుంది. 2018 ఎన్నికల్లో ఏ పార్టీనీ పూర్తిగా విశ్వసించని కన్నడిగులు మరో ఐదేళ్లకు ఎవరి చేతిలో పగ్గాలు పెడతారో నేడు తెలుస్తుంది.

Updated : 13 May 2023 06:48 IST

నేడు తేలనున్న నేతల భవిత

ఈనాడు, బెంగళూరు : రాష్ట్రాన్ని మరో ఐదేళ్ల పాటు పాలించే పార్టీ ఏదో శనివారం తేలిపోతుంది. 2018 ఎన్నికల్లో ఏ పార్టీనీ పూర్తిగా విశ్వసించని కన్నడిగులు మరో ఐదేళ్లకు ఎవరి చేతిలో పగ్గాలు పెడతారో నేడు తెలుస్తుంది. ఏటేటా ఓటర్ల సంఖ్య పెరుగుతూ.. అంతే స్థాయిలో పోలింగ్‌ ప్రమాణం పెరుగుతున్నా 2013-18 మినహాయించి ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టని ఓటర్లు ఈసారైనా స్థిరమైన పాలనకు ఓటేశారేమో తెలియాలంటే మధ్యాహ్నం వరకు ఆగితే చాలు. వచ్చే ఏట నిర్వహించే లోక్‌సభ ఎన్నికలకు కర్ణాటక ఫలితాలు ఎంతో కీలకమని జాతీయ స్థాయిలో విశ్లేషణలు ఊపందుకున్న వేళ.. ఫలితం కోసం దేశవ్యాప్త రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. దేశంలోని అత్యధిక నియోజకవర్గాలున్న తొలి ఐదు రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటక.. ఈసారైనా స్థిరమైన ప్రభుత్వానికి దారులు వేస్తుందా? లేదా.. అనేది వేల కోట్ల డాలర్ల ప్రశ్న.

భవిష్యత్తుకు పాదులు..

అప్ప- బొమ్మై మంత్రాంగం ఫలించేనా?

కేంద్రంలోనే కాదు పార్టీపరంగా ఉనికి కోసం పాకులాడే కాంగ్రెస్‌కు ఈ గెలుపు అనివార్యం. భాజపా నేతల మాదిరిగానే కాంగ్రెస్‌లోని జాతీయ నేతలంతా ప్రచారానికి అన్నీ తామై వ్యవహరించారు. 28 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి సంబంధం లేని ఓ నేత.. అందులోనూ కన్నడ గడ్డ నుంచి వెళ్లిన మల్లికార్జున ఖర్గే ఏఐసీసీకి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రాష్ట్ర నేతలకు ఇంతకన్నా గొప్ప ధైర్యం ఇంకేముంటుంది? పార్టీ పెద్దకు ఈ గెలుపుతో బహుమానం ఇవ్వాలని రాష్ట్ర నేతలు కంకణం కట్టుకున్నారు. అదే ధీమాతో 2024 లోక్‌సభ ఎన్నికలను విశ్వాసంతో ఎదుర్కోవాలనేది సంకల్పం. కన్నడనాట గెలుపుతో భవిష్యత్తుకు గట్టి పునాది వేసుకోవాలని నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సంకల్పంతో పని చేసిన కాంగ్రెస్‌ నేతలు.. ఆ దిశగా విజయం సాధించినట్లే. పీసీసీకి కొత్త నేతగా రెండేళ్ల కిందట ఎన్నికైన డీకే శివకుమార్‌, దిగ్గజ నేత సిద్ధరామయ్య జోడెద్దులుగా మారి ప్రచారానికి ఊపందించారు. నేడు వీరి కష్టానికి ఫలితం రాబోతుందని కాంగ్రెస్‌ శ్రేణులు కొండంత ఆశతో ఉన్నారు. ఇటీవల వెల్లడైన ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు నిజంగా కాంగ్రెస్‌కు మానసికంగా ధైర్యాన్ని నింపినట్లే. అప్పుడే తర్వాతి ముఖ్యమంత్రి ఎవరన్న చర్చలు పార్టీలో జోరుగా సాగుతున్నాయంటే వీరికి విజయంపై ఎంతో ధైర్యం ఉన్నట్లే. పొత్తు లేదు.. ఉన్నదల్లా ఒంటిరిగా అధికార ఏర్పాటే అంటూ కాంగ్రెస్‌ ధీమాగా ఉంది.

సాయం ఎవరికంటే..

కుమారతో గౌడ..హంగ్‌పై ఆశలమేడ!

‘మెజార్టీ రాకున్నా అధికార ఏర్పాటులో మా సాయం ఉండాల్సిందే. కనీసం ముప్పై స్థానాలు గెలిస్తే చాలు కింగ్‌ మేకర్‌ అయినట్లే. మొన్నటి దాకా 125 స్థానాలకు తగ్గకుండా విజయం సాధిస్తామని ప్రచారం చేసినా.. సరిగ్గా పోలింగ్‌ రోజున 25స్థానాల్లో మా అభ్యర్థులకు నిధులు చేకూర్చలేకపోయాం’ అని జనతాదళ్‌ నేతలు వ్యాఖ్యానించారు. మేము సాధించే స్థానాలే జాతీయ పార్టీలకు ఆధారమన్న ధీమాతో ఆ పార్టీ ఎదురు చూస్తోంది. జాతీయ పార్టీలేవీ ప్రజలకు భరోసాతో కూడిన పాలన అందించలేని సమయాన దళపతులు మేమున్నామంటారు. 2006 నుంచి రాష్ట్ర రాజకీయాల్లో దేవేగౌడ పార్టీ చక్రం తిప్పుతూ వస్తోంది. మధ్యలో కేజేపీ పుణ్యమా అని కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ వచ్చినా ఆ తర్వాత కూడా జేడీఎస్‌ సత్తా చాటింది. మేమెవరి తలుపు తట్టం. ఎవరైనా మా తలుపు తట్టాల్సిందేన్న స్థిరమైన రాజకీయ నినాదంతో రాష్ట్రంలో ఉనికిని చాటే జేడీఎస్‌.. మరోమారు కింగ్‌ మేకర్‌ అవ్వాలని చూస్తోంది.

స్వతంత్రులకు డిమాండు

ఇంకా అసలైన ఫలితాలే రాలేదు. ఎవరెవరు గెలిచారో కూడా తెలియలేదు. స్వతంత్రులుగా నిలిచి గెలుస్తారన్న వారికి ఇప్పటి నుంచే డిమాండ్‌ పెరిగిపోయింది. ఈ ఏడాది 918 మంది స్వతంత్రులు పోటీ చేశారు. వీరిలో కనీసం పది మంది విజయం సాధించినా వారు అధికార ఏర్పాటులో కింగ్‌ మేకర్లే. ప్రధాన పార్టీల్లో గెలిచే సత్తా ఉన్నా పార్టీల వ్యూహాల కారణంగా రెప్పపాటు కాలంలో టికెట్‌ దొరకని వారు. 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 5-10మంది స్వతంత్రులు గెలిచే వీలుంది. వీరంతా రానున్న ఐదేళ్ల పాటు అధికారంలో కూర్చునే పార్టీని నియంత్రించే సత్తా ఉన్నవారే.

ప్రతిష్ఠ..పాకులాట..

భాజపాకు ఈ ఎన్నికల్లో గెలుపు కేవలం రాష్ట్ర నేతల ప్రతిష్ఠకు సంబంధించిన విషయం మాత్రమే కాదు.. జాతీయ ప్రముఖులకూ అగ్ని పరీక్షే. ఓ వైపు రాష్ట్రంలో నాయకత్వం లేదని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను గమనించిన అధిష్ఠానం.. ప్రచార బాధ్యతనంతా తన భుజాలపై వేసుకుని మోసింది. ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ సాధించి వరుసగా రెండోసారి అధికార పీఠంలో కూర్చోవాలి.. 38 ఏళ్లుగా ఏ పార్టీ సాధించలేని రికార్డును బద్దలు కొట్టాలి.. ఈ నిశ్చితమైన లక్ష్యంతో జాతీయ నేతలంతా ఒక్కటై ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. ఏడాది ముందుగానే ఎన్నికల లక్ష్యంతో పాలన సంస్కరణలకు తెరలేపిన భాజపా.. సరిగ్గా ఎన్నికల ముందు కీలకమైన రిజర్వేషన్‌ పెంపు, సవరణ, పీఎఫ్‌ఐ రద్దు, జై బజరంగ్‌ భళి నినాదాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసింది. అంతకంటే మిన్నగా కొత్త నాయకత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని పాతవారికి ఇంటి దారి చూపుతూ కొత్త ముఖాలకు చోటిచ్చింది. ఈ క్రమంలో పార్టీ లోపలా, బయటా ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. పార్టీ త్రిమూర్తులు నరేంద్ర మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా- సారథ్యంలో రాష్ట్ర నేతలంతా మొక్కవోని ధైర్యంతో ఎన్నికలను ఎదుర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం కాబట్టి మళ్లీ గెలిచి తీరాలి.. ఫలితం ఏమాత్రం తారుమారైనా జాతీయ స్థాయిలో ప్రతిష్టతకు భంగం వాటిల్లినట్లేననే హెచ్చరికలు లేకపోలేదు.

ఆశల పల్లకీలో..

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : జనసంఘ్‌.. భాజపాగా మారిన తర్వాత 1983లో 7.93 ఓట్ల శాతంతో 18 సీట్లను దక్కించుకుని అసెంబ్లీలో అడుగు పెట్టింది. అనంతరం 1985లో జరిగిన ఎన్నికలలో 3.88 శాతం ఓట్లతో కేవలం రెండు స్థానాలలో మాత్రమే భాజపా విజయం సాధించింది. తాజా ఎన్నికల్లో సగానికి సగం ఓట్లు కొల్లగొట్టి అధికార పీఠాన్ని పదిలపరచుకోవాలని యోచిస్తోంది. ఆ కల ఎంతవరకు నెరవేరనుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. 2019 ఉప ఎన్నికల అనంతరం 15వ విధానసభలో భాజపా సభ్యుల సంఖ్య 118కు చేరుకుంది. ఈసారి ఎన్నికలలో తాము కనీసం 125 స్థానాలు దక్కించుకుంటామన్న ధీమాతో ఉంది. ప్రారంభం నుంచి ఆ పార్టీ దక్కించుకున్న ఓట్ల శాతం.. గెలుపొందిన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని