logo

Karanataka Elections: నేతలకు ముచ్చెమటలు.. ‘కనక’ సింహాసనం ఎవరిదో!

బెంగళూరు నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో.. ఒకవైపు తమిళనాడు, మరో వైపు ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులున్న కోలారు జిల్లా రాజకీయం వేడెక్కింది.

Updated : 13 May 2023 07:39 IST

కోలారు జిల్లాలో తీవ్ర ఉత్కంఠ

కోలారు, న్యూస్‌టుడే : బెంగళూరు నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో.. ఒకవైపు తమిళనాడు, మరో వైపు ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులున్న కోలారు జిల్లా రాజకీయం వేడెక్కింది. పాలు, టమోటా, మామిడి ఉత్పత్తిలో ఇతర జిల్లాలతో పోటీ పడే ఈ గడ్డపై మంచి ఎండాకాలంలో నిర్వహించిన ఎన్నికలు ఎవరిని బంగారు సింహాసనంపై కూర్చోపెడతాయో అంచనాలకు అందడం లేదు. కోలారు గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌) బంగారు గనుల కారణంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కరవు సీమను ఏలే రాజెవరో తేలేది నేడే (శనివారం)కావడంతో నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. మొదటి నుంచి కాంగ్రెస్‌, జనతాదళ్‌ అభ్యర్థులు ఎక్కువ మంది గెలుస్తూ వచ్చారు. ఈసారి కోలారు నుంచి పోటీ చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విఫలయత్నాలు చేశారు. తెలుగు, తమిళ, కన్నడ ఓటర్లు ఇక్కడి నియోజకవర్గాలలో ఉన్నారు. ఇక్కడ పాగా వేయడానికి భాజపా ఈసారి ప్రత్యేక శ్రద్ధచూపింది.

* గత ఎన్నికల (2018)లో కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ (శ్రీనివాసపుర), ఎస్‌ఎన్‌ నారాయణస్వామి (బంగారపేట), ఎం.రూపకళ (కేజీఎఫ్‌), కేవై నంజేగౌడ (మాలూరు) కాంగ్రెస్‌ పార్టీ నుంచి నెగ్గారు. కె.శ్రీనివాసగౌడ (కోలార) జనతాదళ్‌ నుంచి విజయం సాధించగా హెచ్‌.నాగేశ్‌ (ముళబాగిలు) స్వతంత్ర అభ్యర్థిగా విధానసౌధలో అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా కొత్తూరు మంజునాథ్‌ బరిలో దిగాల్సిన పరిస్థితి ఎదురైనా.. కుల ధ్రువీకరణ పత్రం వివాదంతో ఆయన చివరిక్షణంలో పోటీ నుంచి తప్పుకొని తన అనుచరుడు నాగేశ్‌ను బరిలో దించి గెలిపించుకోవడం నిన్నమొన్నటి చరిత్ర.

ఈసారి పోటీ

ఇప్పటి వరకు పోటీలో లేని భాజపా నాలుగు నియోజకవర్గాలలో వేళ్లూనుకుని జనతాదళ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చిందని పోలింగ్‌ అనంతర సమీక్షలు స్పష్టం చేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇక్కడి నుంచి పోటీ చేసే ఉద్దేశంతో పలు సభలను నిర్వహించినా.. చివరి క్షణంలో ఆ ప్రయత్నం నుంచి విరమించుకున్నారు. కురుడుమలె గణపతి ఆలయం నుంచి జనతాదళ్‌ తన పంచరత్న యాత్రను ప్రారంభించి.. జిల్లాలో తన బలాన్ని చాటే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇక్కడే జై భారత్‌ సమావేశాన్ని నిర్వహించారు.

కోలారులో వర్తూరు ప్రకాశ్‌ (భాజపా), కొత్తూరు మంజునాథ్‌ (కాంగ్రెస్‌÷), సీఎంఆర్‌ శ్రీనాథ్‌ (దళ్‌) పోటీలో ఉన్నారు. గతంలో రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా గెల్చిన వర్తూరు ప్రకాశ్‌ ఈసారి భాజపా అభ్యర్థిగా బరిలో దిగారు. ముళబాగిలిలో దళ్‌ నుంచి సమృద్ధి మంజునాథ్‌ పోటీలో ఉండగా, ఆయనకు భాజపా నుంచి సీగేనహళ్లి సుందర్‌, కాంగ్రెస్‌ నుంచి ఆదినారాయణ గట్టి పోటీ ఇచ్చారు. బంగారపేటలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి రెండు సార్లు గెలిచిన ఎస్‌ఎన్‌ నారాయణస్వామి హ్యాట్రిక్‌ విజయంపై కన్నేశారు. దళ్‌ నుంచి ఎం.మలేశ్‌ బాబు, భాజపా టికెట్‌పై ఎం.నారాయణ స్వామి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. శ్రీనివాసపురలో మాజీ స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ (కాంగ్రెస్‌) పోటీలో ఉండగా, జనతాదళ్‌ అభ్యర్థి జీకే వెంకటశివారెడ్డి ఆయనకు తీవ్రమైన పోటీ ఇచ్చారు.

భూవ్యాపారి, గుంజూరు శ్రీనివాస రెడ్డి భాజపా అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మాలూరులో జనతాదళ్‌ నుంచి భాజపాలోకి వచ్చిన కేఎస్‌ మంజునాథ గౌడకు తిరుగుబాటు అభ్యర్థి హూడి విజయకుమార్‌ పోటీ ఇస్తున్నారు. దళ్‌ నుంచి రామేగౌడ, కాంగ్రెస్‌ నుంచి కేవై నంజేగౌడ పోటీలో ఉన్నారు. కేజీఎఫ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రూపకళ శశిధర్‌ మరోసారి పోటీలో ఉండగా, దళ్‌ నుంచి డా.రమేశ్‌ బాబు, భాజపా అభ్యర్థి అశ్విని సంపంగి బరిలో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గతంలో నగరాభివృద్ధి ప్రాథికార అధ్యక్షురాలిగా, జిల్లా పంచాయతీ సభ్యురాలిగా అశ్వినికి అనుభవం ఉంది. ఇక్కడ భాజపా, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ నెలకొన్న విషయాన్ని పోలింగ్‌ సరళి స్పష్టం చేస్తోంది. మరికొద్ది గంటల్లో ఈ బంగారు సీమ ప్రజా ప్రతినిధులెవరో తేలిపోనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని