logo

గనినాడుకు అమాత్య యోగం

బళ్లారి గ్రామీణ విధానసభ క్షేత్రం శాసనసభ్యుడు బి.నాగేంద్రకు మొదటిసారిగా అమాత్య యోగం పట్టింది. శనివారం రాజధాని బెంగళూరులో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Published : 28 May 2023 02:02 IST

గ్రామీణ శాసనసభ్యుడు బి.నాగేంద్రకు వరించిన పదవి
అభివృద్ధిపై జిల్లావాసుల ఆశలు

ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు చెబుతున్న నాగేంద్ర

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి గ్రామీణ విధానసభ క్షేత్రం శాసనసభ్యుడు బి.నాగేంద్రకు మొదటిసారిగా అమాత్య యోగం పట్టింది. శనివారం రాజధాని బెంగళూరులో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేయాలని ఆకాంక్షిస్తూ ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో మంత్రి స్థాయికి ఎదిగిన నాగేంద్ర ప్రస్థానంపై ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లా గడేకల్లుకు చెందిన బి.ఆంజనేయులు, గుమ్మనూరుకు చెందిన బి.లక్ష్మీదేవిల రెండో కుమారుడు బి.నాగేంద్ర. తండ్రి జీవనోపాధి కోసం బళ్లారి నగరం సింధిగి కాంపౌండ్‌లో స్థిరపడ్డారు. బళ్లారి జెస్కాంలో విధులు నిర్వహించారు. వీరికి ఇద్దరు కుమారులు వెంకటేశ్‌ ప్రసాద్‌, బి.నాగేంద్ర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగేంద్ర 1971 సెప్టెంబరు 15న జన్మించారు. భార్య బి.మంజుశ్రీ, వీరికి ఇద్దరు కుమారులు విష్ణుతారక్‌, రాణక్‌ రత్న ఉన్నారు.

వ్యాపారం..: విద్యాభ్యాసం ముగిసిన తర్వాత వ్యాపారం చేస్తూనే అప్పటి మంత్రి ముండ్లూరు దివాకర్‌బాబుకు ఆప్తుడిగా ఉండేవారు. బళ్లారి కేబుల్‌ ఆపరేటర్ల ఘర్షణలో ముండ్లూరు దివాకర్‌బాబు మద్దతుగా నిలవలేదని మానసికంగా బాధపడుతూ అప్పట్లో గాలి జనార్దన్‌రెడ్డి, బి.శ్రీరాములు సమక్షంలో భాజపాలో చేరారు. రెడ్డి సోదరులకు ఆప్తుడిగా ఉన్న నాగేంద్ర ముడి ఇనుప ఖనిజం వ్యాపారంలో ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. వేలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. గనుల అక్రమ తవ్వకాల ఆరోపణలతో గాలి జనార్దన్‌రెడ్డితో పాటు బి.నాగేంద్రను సీబీఐ అధికారులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చారు.

రాజకీయ ప్రవేశం

బళ్లారిలో పుట్టి పెరిగిన బి.నాగేంద్ర బళ్లారి గ్రామీణ విధానసభ క్షేత్రంలో పట్టు సాధించారు. 2008 విధానసభ ఎన్నికల్లో బళ్లారి గ్రామీణ విధానసభ క్షేత్రం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపారు. అప్పటికే బి.శ్రీరాములు ఇక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. దీన్ని గుర్తించిన గాలి జనార్దన్‌రెడ్డి ఆదేశాలతో 2008 విధానసభ ఎన్నికల్లో కూడ్లిగి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2011లో గాలి జనార్దన్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయగా, బి.శ్రీరాములు బీఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు. 2013 ఎన్నికల్లో నాగేంద్ర రెండు పార్టీల తరఫున కాకుండా కూడ్లిగి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నెగ్గారు. 2018లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, జిల్లా బాధ్య మంత్రి సంతోశ్‌ ఎస్‌.లాడ్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో బళ్లారి గ్రామీణ విధానసభ క్షేత్రం నుంచి బి.శ్రీరాములు సోదరుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు సణ్ణపక్కీరప్పపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బి.శ్రీరాములుపై గెలిచారు. తాజగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి వర్గంలో స్థానం లభించింది. దీనిపై పలువురు కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

మంత్రికి సవాళ్ల స్వాగతం

బళ్లారి నగరంతో పాటు, గ్రామీణ, సిరుగుప్ప, కంప్లి, కురుగోడు, సండూరు విధానసభ క్షేత్రాల ప్రజలు సమస్యలతో మంత్రికి స్వాగతం పలుకుతున్నారు. బహుగ్రామ తాగునీటి పథకాలు, జలజీవన్‌ పథకం పనులు నిలిచిపోవడం, పలు తాగునీటి చెరువులు మరమ్మతులకు నోచుకోవడం, మించేరి, కొళగల్లు గ్రామాల్లో తాగునీటి చెరువులు నిర్మాణం, సుధాక్రాస్‌, రేడియోపార్క్‌ రైల్వే గేట్లపై పైవంతెన నిర్మాణం బళ్లారి నగరంలో పలు రహదారులు, తాగునీటి వ్యవస్థ, భూగర్భ మురుగు కాలువ వంటి సవాళ్లను అధిగమిస్తారని జిల్లావాసులు ఆశిస్తున్నారు.

విద్యాభ్యాసం

బి.నాగేంద్ర 1 నుంచి 5వ తరగతి వరకు బాలాజీరావ్‌ రహదారిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. 6, 7, 8 తరగతులను బళ్లారి సెయింట్‌ జాన్‌ పాఠశాల, 9, 10వ తరగతులు, పీయూసీ ప్రభుత్వ మున్సిపల్‌ పదవి పూర్వ కళాశాల పూర్తి చేశారు. బి.కాం బళ్లారి వీరశైవ కళాశాల లో పూర్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని