logo

హృదయం లేని మోదీ

కర్ణాటకలో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంటామన్న భయంతోనే భాజపా- జనతాదళ్‌ పొత్తు కుదుర్చుకున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు.

Published : 28 Mar 2024 03:05 IST

భయంతోనే ఒక్కటయ్యారు
నిప్పులు చెరిగిన సిద్ధరామయ్య

మైసూరు, న్యూస్‌టుడే : కర్ణాటకలో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంటామన్న భయంతోనే భాజపా- జనతాదళ్‌ పొత్తు కుదుర్చుకున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. కర్ణాటకకు జీఎస్టీ వసూళ్లలో వాటాను విడుదల చేశామని ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. తనది 56 అంగుళాల ఛాతీ అని చెప్పుకొనే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆ ఛాతీలో హృదయమే లేదన్నారు. కేవలం ఉత్తుత్తి హామీలు ఇస్తూనే పదేళ్ల పాలన పూర్తి చేయడం భాజపాకే చెల్లిందని ఎద్దేవా చేశారు. పార్టీ సిద్ధాంతాన్ని అంగీకరించి, బేషరతుగా ఎవరు ముందుకు వచ్చినా కాంగ్రెస్‌లో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. మైసూరులో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి వారికి పార్టీ పతాకాన్ని అందించి మాట్లాడారు. పార్టీలో చేరిన ప్రతి నాయకుడికీ సరైన స్థానాన్ని కల్పించామని గుర్తు చేశారు. కులం, మతం ఆధారంగా తమ పార్టీ, ప్రభుత్వం ఎప్పుడూ రాజకీయాలు చేయలేదన్నారు.

సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌ అని చెప్పుకొనే కాషాయ పార్టీ నేతలు తమ సమావేశాలకు బురఖా, గడ్డం, మెడలో శిలువ తదితరాలు ధరించి రావద్దని ప్రజలకు ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. కాషాయ పార్టీ నేతలంతా శూద్రులు, దళితులు, మహిళలు, శ్రామికులు, రైతులు, సామాజిక న్యాయం అంటే శత్రువులుగా భావిస్తున్నట్లు ఆరోపించారు. భాజపా నాయకులు అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ అభివృద్ధి చేశామని, రూ.వేల కోట్లు విడుదల చేశామని ప్రచారం చేసుకోవడంలో ముందుంటారని దుయ్యబట్టారు. గ్యాస్‌, ఇంధనం, ఎరువుల ధరలు పెరిగాయని, డాలర్‌తో రూపాయి మారకం గతంలో ఎన్నడూ లేని విధంగా పడిపోయినా, ఇప్పటి వరకు కేంద్రం ఎటువంటి ఉపశమన చర్యలు తీసుకుందో బహిరంగ పరచాలని డిమాండ్‌ చేశారు. వ్యాపారవేత్తలు అంబానీ, అదానీలకు మాత్రమే భాజపా స్పందిస్తుందని ఆరోపించారు. స్థానిక నేతలు శివణ్ణ, రాజీవ్‌, మల్లేశ్‌, ఓం ప్రకాశ్‌ తదితరులు దళ్‌, భాజపా వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, మంత్రి వెంకటేశ్‌, లోక్‌సభ అభ్యర్థి లక్ష్మణ్‌, పార్టీ నాయకులు తన్వీర్‌ సేఠ్‌, మూర్తి, విజయకుమార్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని