logo

పతాక స్థాయికి ప్రచార ఘట్టం

లోక్‌సభ ఎన్నికల బహిరంగ ప్రచారానికి ఆదివారం సాయంత్రం ముగియనుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు, పార్టీ నేతలు, మంత్రి, ఎమ్మెల్యేలు శనివారం ప్రచారం తీవ్రం చేశారు.

Published : 05 May 2024 04:24 IST

బళ్లారి: రోడ్డు షోలో మంత్రి బి.నాగేంద్ర

బళ్లారి, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల బహిరంగ ప్రచారానికి ఆదివారం సాయంత్రం ముగియనుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు, పార్టీ నేతలు, మంత్రి, ఎమ్మెల్యేలు శనివారం ప్రచారం తీవ్రం చేశారు. జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత, వేడిగాలులు ఉన్నా లెక్క చేయకుండా ప్రచారం చేశారు. మంత్రి బి.నాగేంద్ర తన గ్రామీణ నియోజకవర్గంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే జి.ఎన్‌.గణేష్‌ వారి నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. భాజపా అభ్యర్థి బి.శ్రీరాములు శనివారం ప్రచారం చేశారు. కొన్ని సమయాల్లో ద్విచక్రవాహంపై వెళ్తూ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు.

హొసపేటె: ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారపర్వం ముగియనుండడంతో విజయనగర జిల్లాలో బళ్లారి లోక్‌సభ అభ్యర్థులు ప్రచారం వేగిరం చేశారు. భాజపా అభ్యర్థి బి.శ్రీరాములు, కాంగ్రెస్‌ అభ్యర్థి ఇ.తుకారామ్‌ శనివారం హొసపేటెపైన దృష్టి సారించి పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం సండూరు మార్గంలోని ఏకలవ్య కూడలినుంచి భాజపా అభ్యర్థి శ్రీరాములు వాల్మీకి నాయుకులు నివసించే వాడల్లో రోడ్డుషో చేపట్టారు. భాజపా ప్రభుత్వంతోనే ఉత్తమ భవిష్యత్తు సాధ్యమని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.  విజయనగర డీసీసీ అధ్యక్షుడు సిరాజ్‌షేక్‌ అభ్యర్థి ఇ.తుకారామ్‌తో కలిసి బైలువద్దిగెరె, గాదిగనూరు, పాపినాయకన హళ్లి ప్రాంతాల్లో ప్రచారం చేశారు. మాజీ ఎంపీ ఉగ్రప్ప హంపీ పంచాయతీ పరిధిలోని కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమై చర్చలు జరిపారు.

పయ్యావుల సతీమణి,కుమారుల ప్రచారం

బళ్లారి: ఆంధ్రప్రదేశ్‌ విధానసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ తరఫున సతీమణి, కుమారులు శనివారం బళ్లారి నగరంలో ఉన్న ఓటర్లను కలిసి ఓటును అభ్యర్థించారు. ఇంటింటికీ వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని అక్కడ స్థిరపడిన ఉరవకొండ నియోజకవర్గ వాసులను కోరారు. ఉరవకొండ నియోజకవర్గం బళ్లారి సరిహద్దులో ఉండటంతో పలువురు ఓటర్లు బళ్లారిలో స్థిరపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన పయ్యావుల కేశవ్‌ సతీమణి హేమలత, కుమారులు పయ్యావుల విక్రమ్‌ సింహ, పయ్యావుల విజయసింహకు స్థానిక ప్రజలు స్వాగతం పలికారు. బళ్లారిలోని విద్యానగర్‌, పటేల్‌నగర్‌ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను కలిశారు. వారి వెంట స్థానిక నేతలు గుర్రం లాల్‌మోహన్‌, మల్లికార్జున, వెంకటనాయుడు, తదితరులున్నారు.
సింధనూరు: కమలం పార్టీ భ్రష్టులతో నిండిపోయింది..అక్రమార్జనతోనో మరే రకంగానో దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా బయటపడే నాయకులంతా భాజపాలోకి చేరుతుంటే..ఆ పార్టీ అగ్రనేతలు వారిని వాషింగ్‌ మిషన్‌లో కడిగేసి పార్టీలోకి చేర్చుకుంటున్నారు.. ఫలితంగా భాజపా బలాన్ని పెంచుకుంటోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి దుయ్యబట్టారు. ఆయన సురుపుర వెళ్తూ శనివారం సింధనూరులో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో భాజపా సాధించే స్థానాలు ఏక అంకె సంఖ్యలో ఉంటాయన్నారు. రాష్ట్రం కరవు కోరల్లో చిక్కుకున్నప్పుడు ఆదుకోవలసిన కేంద్రం పక్షపాతం చూపి ముఖం చాటేసిన శాపం వారికి ఎన్నికల ఫలితాల్లో చూపుతుందని రామలింగారెడ్డి చెప్పారు. ఆ సమయంలో ప్రజలను ఆదుకున్నవి కాంగ్రెస్‌ గ్యారంటీలే అని వివరించారు.  ఎమ్మెల్యే బాదర్లి, లింగాయత సమాజం పెద్దలు ఆయన వెంట ఉన్నారు.
సింధనూరు: ‘ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు మనకు ముఖ్యమైనవి, మహనీయులు అందించిన రాజ్యాంగాన్నే మార్చేయాలని చూస్తున్న వారి నుంచి దేశాన్ని రక్షించుకునే సమయం..అది కాంగ్రెస్‌కే సాధ్యం. భాజపా పాలనలో ఈ దేశం ఏ దిక్కుకు వెళ్లిపోతోందని మేధావులు ఆందోళన చెందుతున్నారు. ఆ ప్రమాదం నుంచి రక్షించుకోవాలంటే పర్యాయంగా కాంగ్రెస్‌ పాలన అత్యావశ్యమని’ శాసనసభ్యుడు బాదర్లి హంపనగౌడ ఓటర్లకు వివరించి చెప్పారు. అన్నదమ్ముల్లా ఉండే ప్రజల మధ్య మతకల్లోలాలు సృష్టిస్తోన్న ఈ భాజపాను పక్కనబెట్టండని ఆయన పిలుపునిచ్చారు. వళబళ్లారి మార్గంలోని గోమర్శి, అలబనూరు, బెళగుర్కి తదితర గ్రామాల్లో తిరిగి సాయంత్రం కాందిశీకుల క్యాంపుల్లో శనివారం ఆయన విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రాజశేఖర్‌ హిట్నాళ్‌ తరఫున ప్రచారం చేశారు.

బళ్లారి: ప్రచారంలో పాల్గొన్న భాజపా అభ్యర్థి శ్రీరాములు

 

బళ్లారి:తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు

 

బళ్లారి:ప్రచారంలో ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి

 

హొసపేటె పట్టణంలో రోడ్‌ షో నిర్వహిస్తున్న భాజపా అభ్యర్థి శ్రీరాములు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని