logo

నేటితో ప్రచారానికి తెర

రాష్ట్రంలో చివరి విడత ఎన్నికల బహిరంగ ప్రచారం ఆదివారంతో ముగియనుంది. ఏప్రిల్‌ 26న తొలి విడత ఎన్నికలు నిర్వహించగా..

Published : 05 May 2024 04:37 IST

కీలక నేతల పర్యటనల జోరు

ప్రియాంక జోరు : దావణగెరెలో శనివారం నిర్వహించిన కాంగ్రెస్‌ ప్రచార సభలో పాల్గొన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,
ఉప ముఖ్యంమత్రి డీకే శివకుమార్‌, మంత్రి ఎస్‌.ఎస్‌.మల్లికార్జున, మాజీ మంత్రి శ్యామనూరు శివశంకరప్ప

ఈనాడు, బెంగళూరు : రాష్ట్రంలో చివరి విడత ఎన్నికల బహిరంగ ప్రచారం ఆదివారంతో ముగియనుంది. ఏప్రిల్‌ 26న తొలి విడత ఎన్నికలు నిర్వహించగా.. ఈనెల 7న మలివిడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జాతీయ పార్టీలు రెండూ హోరాహోరీగా పోటీ పడుతున్న ఈ ఎన్నికల కోసం ఆయా పార్టీల జాతీయ నేతలంతా పర్యటించారు. ఉత్తర కర్ణాటకలోని 14 స్థానాలకు నిర్వహించే ఈ ఎన్నికలు భాజపా, కాంగ్రెస్‌లకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. 2019 ఎన్నికల్లో వీటిని మొత్తం భాజపా కైవసం చేసుకోవటంతో కాంగ్రెస్‌ ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. మలివిడతలో 227 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా ఇందులో 206 మంది పురుషులు, 21 మంది మహిళలున్నారు. శివమొగ్గ, దావణగెరెల్లో స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్‌, భాజపాలకు గట్టి పోటీ ఇవ్వనుండగా మిగిలిన చోట్ల రెండు జాతీయ పార్టీల అభ్యర్థుల మధ్యలోనే పోరు నెలకొంది.

సోనియా మినహా..

జాతీయ పార్టీల అగ్రనేతలంతా ఈ ఎన్నికల్లో ప్రచారం చేశారు. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా కీలక ప్రాంతాల్లో పర్యటించారు. ఆది, సోమవారాల్లో మోదీ 10 మంది అభ్యర్థుల తరఫున ప్రచారం చేయగా.. అమిత్‌ షా మిగిలిన స్థానాల్లో రెండు సార్లు పర్యటించారు. హుబ్బళ్లి, శివమొగ్గ, కలబురగి, హావేరిలను నడ్డా చుట్టేశారు. పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై శనివారం రాయచూరులో రోడ్‌షోలో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప, రాష్ట్ర అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర ఆదివారం శివమొగ్గలో పర్యటిస్తారు. కాంగ్రెస్‌ నాయకురాలు సోనియాగాంధీ మినహా మిగిలిన వారంతా మలివిడత కన్నడనాడును చుట్టివెళ్లారు. రాహుల్‌గాంధీ శుక్రవారం శివమొగ్గలో పర్యటించగా, ప్రియాంక గాంధీ రెండుసార్లు రాష్ట్రానికి వచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అత్యధిక సమయం కలబురగిలో పర్యటించినా.. రాయచూరు, బెళగావి, కొప్పళలోనూ సభల్లో మాట్లాడారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ప్రజాధ్వని-2 పేరిట 14 ప్రాంతాల్లో పర్యటించారు.

పేదల సంక్షేమం..

దేశంలో 70 సంవత్సరాల పాటు దేశానికి ప్రభుత్వ రంగ సంస్థలు, పేదల కోసం సంక్షేమ పథకాలు రూపొందించిన కాంగ్రెస్‌.. ఈ పదేళ్లలో కేవలం కార్పొరేట్‌ సంస్థలు, తన మిత్ర బృందానికి మాత్రమే రాయితీలు, ప్రాజెక్టులు అందించిన ఎన్‌డీఏ.. ఈ రెండింటిల్లో ఏ పార్టీని ఎన్నుకోవాలో మీకే వదిలేస్తున్నానని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఆమె దావణగెరెలో పార్టీ అభ్యర్థి ప్రభా మల్లికార్జున తరఫున ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ‘సబ్‌కా సాత్‌ సబ్‌ కా వికాస్‌’ అని ప్రకటించే మోదీ రిజర్వేషన్లు, పేదలను విస్మరించారని నిందించారు. నిత్యం మాధ్యమాల్లో, విలాసంతమైన వేదికలపై మాట్లాడే ఆయన ఏనాడూ పేదలు, రైతులతో మాట్లాడలేదని ఆరోపించారు. మహిళల కోసం ప్రత్యేక పథకాలు రూపొందించామంటూనే.. మహిళలపై దాడులకు తెగించిన వారికి ఓట్లేయాలని కోరుతున్నారని ‘హాసన’ ఘటనను ఉటంకించారు. కరోనా టీకాలు తయారు చేసే సంస్థల నుంచీ ఎన్‌డీఏ చందాలు వసూలు చేసిందని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. గుజరాత్‌లో కూలిన వంతెననూ భాజపా మిత్ర బృందం నిర్మించిందేనన్నారు. మాదే ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అని ప్రచారం చేసుకునే భాజపా.. ఆ ఘనత వెనుక అక్రమాల చిట్టా ఉందన్నారు. ఇకనైనా ఐదేళ్ల పాటు దేశంలో సంక్షేమ పాలన కావాలంటే కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఆమె కోరారు.

  • కాంగ్రెస్‌ ప్రతి ఎన్నికల్లోనూ సామాజిక న్యాయాన్ని పాటించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దావణగెరె, చిక్కోడిల్లో ఆయన పాల్గొన్నారు. భాజపా కేవలం ఎన్నికల కోసమే బడుగు వర్గాలను ప్రస్తావిస్తోందన్నారు. ఏనాడూ కురుబలకు సీటివ్వలేదు.. మేము ముగ్గురు కురుబలకు అవకాశం ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో మీరు వేసే ప్రతి ఓటు నాకు వేసినట్లేనని సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ సమావేశంలో దావణగెరె ఎమ్మెల్యే శ్యామనూరు శివశంకరప్ప, మంత్రి ఎస్‌.ఎస్‌.మల్లికార్జున, చిక్కోడి అభ్యర్థి ప్రియాంక జార్ఖిహొళి తదితరులు పాల్గొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని