logo

నేతల ప్రచారానికి తాళం..ఓటరు చేతికి పాశుపతాస్త్రం

బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. అసలైన ఘట్టమైన పోలింగ్‌కు ఓటరు దేవుడు తన పాశుపతాస్త్రంతో సిద్ధమవుతున్నాడు.

Published : 06 May 2024 05:27 IST

బహిరంగ సభలు, సమావేశాలతో మారుమోగిన బళ్లారి
సాయంత్రం 6 గంటలకు మూగబోయిన మైకులు

బళ్లారి తాలూకా కొళగల్లులో రోడ్‌ షోలో పాల్గొన్న భాజపా అభ్యర్థి బి.శ్రీరాములు

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. అసలైన ఘట్టమైన పోలింగ్‌కు ఓటరు దేవుడు తన పాశుపతాస్త్రంతో సిద్ధమవుతున్నాడు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులైన కాంగ్రెస్‌ అభ్యర్థి ఇ.తుకారామ్‌, భాజపాకు చెందిన బి.శ్రీరాములు తరఫున పార్టీ అగ్రనేతలు బహిరంగ ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌, మంత్రులు బి.నాగేంద్ర, జమీర్‌ అహమ్మద్‌ ఖాన్‌, సంతోష్‌ లాడ్‌, రామలింగారెడ్డి, నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బహిరంగ ప్రచారంలో పాల్గొన్నారు.  

కౌల్‌బజార్‌ ప్రచారంలో మంత్రి బి.నాగేంద్ర,రాజ్యసభసభ్యుడు నాసీర్‌,డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్‌

భాజపా జోరుగా..

భాజపా అభ్యర్థి బి.శ్రీరాములు తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర నేతృత్వంలో వీరశైవ లింగాయతలతో సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రులు బి.ఎస్‌.యడియూరప్ప, సదానందగౌడ సమాశంలో పాల్గొన్నారు.మైత్రిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి ప్రచారంలో కనిపించలేదు. మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి సతీమణి లక్ష్మీఅరుణ, లోక్‌సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సతీశ్‌ ఏచరెడ్డి తదితరులు ఉన్నారు.  

కాంగ్రెస్‌కు మద్దతు: కార్మిక సంఘాలు, సాహితీవేత్తలు, ప్రగతి పర నిపుణులు, రైతులు, దళిత సంఘాలు, సీపీఎం., సీపీఐలు నేతృత్వంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. భాహు భాష నటుడు ప్రకాశ్‌ రై తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు.

ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి

సమావేశాలు: కాంగ్రెస్‌, భాజపా పార్టీ నేతలు బహిరంగ సభలతో పాటు, సమాజ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ  అగ్రనేత రాహుల్‌గాంధీ బహిరంగ సమావేశంలో ఖాళీ చెంబు పార్టీ అని ప్రచారం చేశారు. హొసపేటెలో భాజపా బహిరంగ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ బి.శ్రీరాములు పరంగా ప్రచారం చేశారు. మైసూరు-కొడుగు లోక్‌సభ నియోజకవర్గం భాజపా అభ్యర్థి యదువీర్‌ కృష్ణదత్త ఒడెయర్‌ ప్రచారంలో పాల్గొన్నారు. లోక్‌సభ సభ్యుడు ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక వేధింపుల వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ప్రచారంలో జేడీఎస్‌ నేతలు పెద్దగా కనిపించలేదు. ప్రచారంలో రాజ్యసభ సభ్యుడు డా.సయ్యద్‌ నాసీర్‌ హుసేన్‌ ఎక్కువగా కనిపించలేదు. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ బళ్లారిలో జరిగిన సమావేశంలో మాత్రమే నాసీర్‌ కనిపించారు.

కేఆర్‌పీపీ ప్రభావం ఎక్కడ?

లోక్‌సభ ఎన్నికల ముందు మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి స్థాపించిన కేఆర్‌పీపీని భాజపాలోకి విలీనం చేశారు. గాలి లక్ష్మీఅరుణ మొదట వారం రోజులపాటు ప్రచారంలో కనిపించారు. ఇతర నేతలకు పార్టీలో సరైన గుర్తింపు కనిపించక పోవడంతో ప్రచారంలో పెద్దగా కనిపించలేదు. లోక్‌సభ ఎన్నికల బహిరంగ ప్రచారానికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. గత 25 రోజులుగా బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్‌ షోలు, ఇంటింటి ప్రచారంలో మారుమోగిన మైక్‌లో సాయంత్రం 6 గంటలకు మూగబోయాయి. ఆదివారం రాత్రి నుంచి ఇంటింటికీ వెళ్లి ఓటర్లును ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని