logo

దారితప్పిన కరవు పరిహారం: అశోక్‌

కేంద్రం విడుదల చేసిన కరవు పరిహారాన్ని రైతులకు పంపిణీ చేయకుండా అధికార పార్టీ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటున్నట్లు భాజపా ఆరోపించింది.

Published : 06 May 2024 05:29 IST

మాట్లాడుతున్న విపక్ష నేత అశోక్‌

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : కేంద్రం విడుదల చేసిన కరవు పరిహారాన్ని రైతులకు పంపిణీ చేయకుండా అధికార పార్టీ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటున్నట్లు భాజపా ఆరోపించింది. బెంగళూరులోని భాజపా మాధ్యమ ప్రచార కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విపక్ష నేత అశోక్‌, ఎమ్మెల్యే రవిసుబ్రహ్మణ్యం తదితరులు ఆదివారం విలేకరులతో  మాట్లాడారు. రైతుల బ్యాంకు ఖాతాలకు తక్షణమే పరిహారాన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు ఇబ్బంది పడుతున్నా, ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదని దుయ్యబట్టారు. భాజపాను విమర్శిస్తూ తప్పుడు ప్రకటనలు, కాలహరణ చేస్తున్నట్లు నిప్పులు చెరిగారు. రైతులు పరిహారాన్ని అడిగితే, మీ ఇంటి యజమానురాలికి ప్రతి నెలా రూ.2 వేలు ఇస్తున్నామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. పలు జిల్లాల్లో పశువుల మేతకు, తాగునీటికి కొరత ఉందన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ సమస్య ఎదురైందని చెప్పారు. ఈ ప్రభుత్వంలో అధికారులు వడ్డీ వ్యాపారుల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రాధికారలకు తమ ప్రభుత్వం కేటాయించిన నిధులను కూడా ఈ ప్రభుత్వం వెనక్కు తీసుకుని ఇతర అవసరాలకు వాడుకుంటున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ను కేరళ ముఖ్యమంత్రి అమూల్‌ బేబీ అన్నారని, వయనాడ్‌లో ఓడిపోతానన్న భయంతో రాయ్‌బరేలీలోనూ పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నేతలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంటే భయమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని