logo

భాజపా నేతలవి పగటికలలు

కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి రాదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి లోక్‌సభ ఎన్నికలు రెండో స్వాతంత్య్ర పోరాటంతో సమానమని అభివర్ణించారు.

Published : 06 May 2024 05:32 IST

వారికి అధికారం కల్ల
ముఖ్యమంత్రి స్పష్టీకరణ

విలేకరులతో మాట్లాడుతున్న సిద్ధరామయ్య

బెళగావి, న్యూస్‌టుడే : కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి రాదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి లోక్‌సభ ఎన్నికలు రెండో స్వాతంత్య్ర పోరాటంతో సమానమని అభివర్ణించారు. కాషాయ పార్టీకి 200 సీట్లు రావడం కూడా కష్టమవుతుందని జోస్యం చెప్పారు. ఓడిపోతామన్న భయంతోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళలకు ఏటా రూ.లక్ష, నిరుద్యోగుల ఖాతాకు రూ.లక్ష అందిస్తామన్నారు. బెళగావిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రముఖ వ్యాపారవేత్తలకు రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన కేంద్రం.. రైతుల విషయంలో రెండు నాల్కల ధోరణిని అనుసరించిందని తూర్పారబట్టారు. కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తుందని, రుణ మాఫీ చేయకూడదనేది భాజపా రహస్య ఎజెండాగా మారిందని నిప్పులు చెరిగారు. తమకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చుతామని భాజపా, సంఘ పరివార్‌ చెబుతున్నాయని తప్పుపట్టారు. అందరికీ సమాన అవకాశాలను కల్పించాలన్న లక్ష్యంతో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారని, దానికి వ్యతిరేకంగా కమలనాథులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని