logo

ఓటరన్నకు పండగొచ్చె!

కర్ణాటకలో రెండో విడత 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాగలకోటె, చిక్కోడి, బెళగావి, విజయపుర, కలబురగి, రాయచూరు, బీదర్‌, కొప్పళ, బళ్లారి, హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ, దావణగెరె, శివమొగ్గ నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది

Published : 07 May 2024 03:30 IST

 భారమంతా మీదేనండీ.. కొప్పళలో ఉద్యోగినుల సేవలు

బెెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : కర్ణాటకలో రెండో విడత 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాగలకోటె, చిక్కోడి, బెళగావి, విజయపుర, కలబురగి, రాయచూరు, బీదర్‌, కొప్పళ, బళ్లారి, హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ, దావణగెరె, శివమొగ్గ నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. అన్ని పోలింగ్‌ బూత్‌లకు ఈవీఎం, వీవీ ప్యాట్ తదితర సరంజామాతో ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన బూత్‌లకు చేరుకున్నారు. సిబ్బందిని తరలించేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకున్నారు. ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన నియోజకవర్గాల నుంచి కొన్ని బస్సులను తరలించారు. అవాంఛనీయ ఘటనలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి బూత్‌ పరిధిలో పోలీసులు, భద్రత సిబ్బందిని కేటాయించారు. ఆయా నియోజకవర్గాల కీలక బూత్‌లను జిల్లాధికారులు పరిశీలించారు. మహిళా ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా సఖీ బూత్‌లను ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్‌ శాతం కన్నా ఈసారి ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని అధికారులు, నాయకుల అంచనా. బెంగళూరుతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి పోలింగ్‌ జరుగుతున్న నియోజకవర్గాలకు ఓటర్లు వెళ్లేందుకు ఆర్టీసీ, నైరుతి రైల్వే ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి.బీదర్‌తో కనీసం 80 శాతం పోలింగ్‌ నమోదు చేయాలనేది లక్ష్యమని జిల్లాధికారి గోవిందరెడ్డి తెలిపారు. దావణగెరె లోక్‌సభ పరిధిలో భద్రత ఏర్పాట్లను ఎస్పీ ఉమా ప్రశాంత్‌ పర్యవేక్షించారు. కలబురగి నియోజకవర్గంలో 493 బూత్‌లలో వెబ్‌కాస్టింగ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అన్ని పోలింగ్‌ బూత్‌ల వద్ద అత్యవసర వైద్యసేవలు అందించేందుకు సిబ్బంది, అంబులెన్సు, తాగునీరు, ఎండ తీవ్రతను తప్పించుకునేందుకు షామియానాలు, వెయిటింగ్‌ రూమ్‌, మరుగుదొడ్డి తదితర సదుపాయాలు కల్పించారు.

కలబురగిలో ఈవీఎం యంత్రాన్ని మోసుకెళుతున్న ఓ ఉద్యోగిని

ః ఈ ఎన్నికల్లో 2,59,17,193 మంది ఓటు హక్కు వినియోగించుకుంటుండగా, అందులో 1,29,66,570 మంది మహిళలు, 1,29,48,978 మంది పురుషులు, 1945 మంది తృతీయలింగ పౌరులు ఉన్నారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే 3.78 లక్షల మంది యువకులు, 3.12 లక్షల మంది యువతులు ఉన్నారు. బీవై రాఘవేంద్ర, గీతా శివరాజ్‌ కుమార్‌, ఈశ్వరప్ప, మాజీ ముఖ్యమంత్రులు జగదీశ్‌ శెట్టర్‌, బసవరాజ బొమ్మై, మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ, మంత్రుల సంతానం మృణాల్‌ హెబ్బాళ్కర్‌, సాగర్‌ ఖండ్రే, సంయుక్త పాటిల్‌, ప్రియాంక జార్ఖిహొళి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, లోక్‌సభ సభ్యుడు భగవంత ఖూబా, మాజీ స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డే కాగేరి తదితరులు ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం 206 మంది పురుషులు, 21 మంది మహిళలతో కలిపి 227 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నియోజకవర్గాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, మాజీ ప్రధాని దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, యడియూరప్ప, సదానందగౌడ, కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక వాద్రా, మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తదితరులు ప్రచారాన్ని నిర్వహించిన క్రమంలో.. పోలింగ్‌ భారీగా నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని