logo

ప్రగతి మంత్రం..సంక్షేమ రాగం!

సీతారామ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ ఏడాది నుంచే ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Updated : 07 Feb 2023 06:07 IST

ఈటీవీ, ఖమ్మం

సీతారామ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ ఏడాది నుంచే ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విద్యను చేరువ చేసేందుకు కొత్తగూడెం జిల్లాకు ఇంజినీరింగ్‌ కళాశాలను కేటాయించింది. దళితబంధు పథకం ద్వారా ఉభయ జిల్లాల్లోని పది నియోజకవర్గాల్లో మరో 11వేల మందికి ఆర్థికంగా చేయూతనందిస్తామని వెల్లడించింది. సొంత జాగా కలిగిన అర్హులకు ఇంటి నిర్మాణానికి రూ.3లక్షల చొప్పున అందిస్తామని ప్రకటించింది. దీని ద్వారా రెండు జిల్లాల్లో 20వేల మందికి లబ్ధి చేకూరనుంది. విత్త మంత్రి హరీశ్‌రావు సోమవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌తో ఉభయ జిల్లాలకు ఒనగూరే ప్రయోజనాలపై కథనం.


ఉద్యోగులకు అండగా..

ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులకు అండగా నిలిచేందుకు ఎంప్లాయీస్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది.


సొంతింటి కల  సాకారం దిశగా..

నిరుపేదలకు అండగా నిలిచేలా బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. సొంత జాగా కలిగిన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున అందిస్తామని   ప్రకటించింది.


‘అనుసంధానం’తో  నీరు పుష్కలం

కరవు పీడిత ప్రాంతాలకు సాగునీరు ఇవ్వడంతోపాటు ఎన్నెస్పీలో నీటి లభ్యత ఉండని సమయాల్లో ఆయకట్టును స్థిరీకరించడం కోసం పాలేరు జలాశయానికి అనుసంధానం చేస్తామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రూ.13,263 కోట్ల అంచనాతో సీతారామ ప్రాజెక్టు పనులు గతంలో చేపట్టారు. ఇప్పటివరకు సుమారు రూ.8 వేల కోట్లు వెచ్చించారు. 60 శాతం పనులు పూర్తైన విషయం విదితమే.


రయ్‌మని దూసుకెళ్లాలంటే..

గుంతల్లేని రహదారులే లక్ష్యమని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రస్తావించింది. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రహదారుల నిర్వహణకు రూ.4,500కోట్లు కేటాయించింది.ఏజెన్సీ ప్రాంత  రోడ్లు మెరుగు పడనున్నాయి.


విద్య, వైద్యానికి దన్ను

విద్య, వైద్యానికి ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చింది. జేఎన్టీయూ పరిధిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. తద్వారా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విద్య మరింత చేరువ కానుంది. మణుగూరు పాలిటెక్నిక్‌ కళాశాలను ఈ ఏడాదిలోనే ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. రూ.200 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా గర్భిణులకు పౌష్టికాహార కిట్లు అందిస్తామన్నారు.


క్రమబద్ధీకరణ ఆశలు..

కాంట్రాక్టు ఉద్యోగులను ఏప్రిల్‌ 1 నుంచి క్రమబద్ధీకరిస్తామన్న ప్రభుత్వ ప్రకటన కొత్త ఆశలు నింపుతోంది.


దళితుల అభ్యున్నతికి..

దళితుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే తొలిదఫా లబ్ధిదారులకు యూనిట్లు కేటాయించింది. తాజాగా ప్రతి నియోజకవర్గానికి 1,100 మంది లబ్ధిదారులకు పథకం అమలుచేస్తామని ప్రకటించింది.


వ్యవసాయానికి పెద్దపీట

బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు ప్రభుత్వం రూ.26,831 కోట్లు కేటాయించింది. రైతుబందు పథకానికి రూ.15వేల కోట్లు ప్రతిపాదించింది. ఖమ్మం జిల్లాలో 3.13 లక్షల మంది రూ.352.91 కోట్లు, భద్రాద్రి జిల్లాలో 1,32,532 మంది రైతులకు రూ.192.65 కోట్ల రైతుబంధు సాయమందుతోంది. వ్యవసాయ రుణ మాఫీకి సర్కారు రూ.6,385 కోట్లు ప్రతిపాదించింది. దీని ద్వారా ఖమ్మం జిల్లాలో సుమారు 3.20లక్షల మంది, భద్రాద్రి జిల్లాలో 1,38,187 మంది అన్నదాతలు లబ్ధి పొందనున్నారు. అనుబంధ రంగాలకూ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. ఆయిల్‌పాం సాగుకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,000 కోట్లు   కేటాయించింది. ఉభయ జిల్లాల్లో ప్రస్తుతం 70వేల ఎకరాల్లో సాగవుతున్న ఆయిల్‌పాం పంటను 2 లక్షల ఎకరాలకు విస్తరించాలని యోచిస్తోంది. మత్య్సశాఖ అభివృద్ధి, గొర్రెల పంపిణీకి నిధులు కేటాయించడం వల్ల రెండు వృత్తులపై ఆధారపడి జీవించే కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.


రాష్ట్ర బడ్జెట్‌ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ప్రజామోదయోగ్యమైంది. సబ్బండ వర్గాల సంక్షేమంతోపాటు అన్ని రంగాలకు ప్రాధాన్యమిచ్చింది. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. దళితబంధు పథకం మరిన్ని కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈఏడాది నుంచే సాగునీరందిస్తాం.

అజయ్‌కుమార్‌, మంత్రి


బడ్జెట్‌ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ఆలోచనలకు అనుగుణంగా ఉంది. సీఎం కేసీఆర్‌ నిర్మాణాత్మక అడుగులకు ఈ పద్దు నిలువెత్తు నిదర్శనం. బడ్జెట్‌లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం దక్కింది. రైతుబాంధవుడు కేసీఆర్‌.. వ్యవసాయానికి అగ్రతాంబూలం ఇస్తున్నారు. రాష్ట్రం మరింత పురోగమించేలా పద్దు దోహదపడుతుంది.

నామా నాగేశ్వరరావు, ఎంపీ


అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా బడ్జెట్‌ జనరంజకంగా ఉంది. సీఎం కేసీఆర్‌ పాలనాదక్షతకు అద్దం పడుతుంది. అన్నివర్గాల ప్రజలకు కేటాయింపులు దక్కాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లా వాసులకు ప్రయోజనకరంగా ఉంది. సీతారామ ప్రాజెక్టు రైతులకు వరం కాబోతుంది.

వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని