logo

మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, కొరియర్‌ అరెస్టు

నిషేధిత సీపీఐ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మావోయిస్టు కొరియర్‌లను అరెస్టు చేసినట్లు ఎస్పీ బి.రోహిత్‌రాజు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

Published : 29 Mar 2024 02:10 IST

సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ బి.రోహిత్‌రాజు

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: నిషేధిత సీపీఐ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మావోయిస్టు కొరియర్‌లను అరెస్టు చేసినట్లు ఎస్పీ బి.రోహిత్‌రాజు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. దుమ్ముగూడెం మండలం ములకలపల్లి అటవీ ప్రాంతంలో జిల్లా పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా బెటాలియన్లు గురువారం కూంబింగ్‌ నిర్వహించారు. ఈ సమయంలో చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాకు చెందిన మావోయిస్టు పార్టీ కిష్టారం ఎల్‌ఓఎస్‌ డిప్యూటీ కమాండర్‌ పుట్టం మున్నా అలియాస్‌ సన్నాల్‌ (35), ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన మావోయిస్టు కొరియర్‌ జాడి పెద్దబ్బాయి (26) పట్టుబడ్డారు. వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. మున్నా 2004 నుంచి ఆయుధ దళం సభ్యుడిగా పని చేస్తున్నాడు. అప్పట్నుంచి గంగలూరు ఏరియా మిలీషియా సభ్యుడిగా, ఏరియా కమిటీ దళ సభ్యుడిగా, పామేడు ఏరియా కమిటీ దళ సభ్యుడిగా, 2011 నుంచి 2022 మధ్య మడవి హిడ్మా అలియాస్‌ సంతోశ్‌ నాయకత్వంలో మావోయిస్టు బెటాలియన్‌ సభ్యుడిగా పనిచేశాడు. రెండేళ్లుగా కిష్టారం ఏరియా ఎల్‌ఓఎస్‌ డిప్యూటీ దళ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఎస్‌ఎల్‌ఆర్‌ ఆయుధంతో తిరుగుతూ ఇతర మావోయిస్టు దళ సభ్యులతో కలిసి పలు విధ్వంసకర ఘటనల్లో అతడు పాల్గొన్నాడు. 2007లో తాడిమెట్ల వద్ద 12 మంది సీఆర్‌పీఎఫ్‌, 2010లో చింతల్నార్‌ అటవీ ప్రాంతంలో మరో 76 మంది జవాన్లను హతమార్చిన ఘటనల్లో ఈయన నిందితుడు. 2013లో కిష్టారం వద్ద బలగాలపై జరిగిన దాడిలో, 2014లో మైన్‌ప్రూఫ్‌ వెహికిల్‌పై కాల్పులు జరిపి తొమ్మిది మంది జవాన్లను హతమార్చిన ఘటనలోనూ మున్నా పాల్గొన్నాడు. ఇవికాకుండా వేర్వేరు దాడుల్లో పాల్గొని 27 మంది జవాన్ల మృతికి కారణమైన వారిలోనూ ఆయన ఒకడు. పెద్దబ్బాయి గత మూడేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఫస్ట్‌ బెటాలియన్‌ మావోయిస్టులకు కొరియర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరి వద్ద ఒక బ్యాగు, పది జిలెటిన్‌ స్టిక్స్‌, రెండు ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లు, మావోయిస్టు కరపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించనున్నట్లు చెప్పారు. మావోయిస్టులకు సహకరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, అమాయక ఆదివాసీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఓఎస్డీ సాయి మనోహర్‌, దుమ్ముగూడెం సీఐ బి.అశోక్‌, 151 బెటాలియన్‌ డిప్యూటీ కమాండర్‌ ప్రదీప్‌సింగ్‌ షెకావత్‌ పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని