logo

అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె

తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్‌, కార్తీక్‌ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే.

Updated : 26 Apr 2024 05:57 IST

కోదాడ, న్యూస్‌టుడే: తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్‌, కార్తీక్‌ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. అమ్మను విడిచి క్షణం కూడా ఉండలేరు. ఉద్యోగరీత్యా బయటకు వెళ్లిన నాన్న రాక కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. నానమ్మ, తాత ఒళ్లో ఆడుకుంటుంటారు. ఇన్ని బంధాల మధ్య పెరుగుతున్న వారి జీవితంలో రోడ్డు ప్రమాదంతో ఆ ఆనందాలు ఒక్క రోజులోనే ఆవిరైపోయాయి.

బోనకల్లు మండలం గోవిందాపురం(ఎల్‌) గ్రామానికి చెందిన నలమల చందర్‌రావు హైదరాబాద్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. అతడి కుమారుడు కృష్ణంరాజు అక్కడే కారు డ్రైవర్‌గా స్థిరపడ్డారు. అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. చందర్‌రావు తన కూతురు నాగమణిని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన జిల్లా శ్రీకాంత్‌కు ఇచ్చి వివాహం చేశారు. శ్రీకాంత్‌ సైతం హైదరాబాద్‌లోని మణికొండలో డ్రైవర్‌గా స్థిరపడ్డారు. శ్రీకాంత్‌ చిన్న కూతురు లావణ్యకు పుట్టువెంట్రుకలు తీసేందుకు విజయవాడలోని చర్చికి వెళ్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. శ్రీకాంత్‌ తన తండ్రిని 18 ఏళ్ల క్రితం, తల్లిని నాలుగేళ్ల క్రితం కోల్పోయారు.


పుట్టిన రోజే.. పుట్టెడు శోకం..

హించని రోడ్డు ప్రమాదంతో ఓవైపు నాన్న శ్రీకాంత్‌, అక్క లాస్య మరణించగా, మరోవైపు అమ్మ నాగమణి ప్రాణాలతో పోరాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలిసీ తెలియని వయసు కావటంతో మూడేళ్ల చిన్నారి లావణ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమ్మ దగ్గరే ఉంటానని ఏడుస్తోంది. నాన్న, అక్క అంత్యక్రియలు స్వగ్రామం చిమిర్యాలలో జరుగుతున్నాయని, అదే చివరి చూపు అని ఆ చిన్నారికి తెలియదు. పుట్టినరోజు పుట్టువెంట్రుకల కార్యక్రమం జరగాల్సిన రోజే విషాదఛాయలు అలుముకున్నాయన్న సంగతీ తెలియదు.


బోరున విలపించిన  బంధువులు

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందటంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుల్లో ఇద్దరిది కోదాడ మండలం చిమిర్యాల కావటంతో ఘటన జరిగిన గంటలోపే గ్రామస్థులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని విలపించారు. మృతిచెందిన మరో నలుగురి స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం(ఎల్‌). అక్కడి నుంచి కూడా బంధువులు భారీగా ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. రెండు గ్రామాల వారు కన్నీరుమున్నీరు కావడంతో ఆస్పత్రి ఆవరణలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.

రెండు రోజులుగా రహదారి పక్కనే లారీ

బ్రేక్‌ ఫెయిలవటంతో రెండు రోజులుగా రహదారి పక్కనే లారీ ఉందని స్థానికులు తెలిపారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వహించకుండా వెంటనే మరమ్మతులు చేసి ఉంటే ఈ ప్రమాదం తప్పేదని చెబుతున్నారు.

డ్రైవర్‌ మారకుంటే బతుకు మారేదేమో..!

విజయవాడలో శుభకార్యం ఉండటంతో అందరూ కలిసి అర్ధరాత్రి ఒంటి గంటకే కారులో బయలుదేరారు. కారును జిల్లా శ్రీకాంత్‌ నడుపుతుండగా మార్గమధ్యలో టైరు పేలింది. ఇక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కారు టైరు మార్చుకొని మళ్లీ బయలుదేరారు. ఆ సమయంలో శ్రీకాంత్‌ బదులు ఆయన బావమరిది కృష్ణంరాజు డ్రైవర్‌ సీటులో కూర్చున్నారు. కోదాడ సమీపంలోకి రాగానే కారు అతివేగంతో ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి నిద్ర మత్తే కారణంగా తెలుస్తోంది. వృత్తిరీత్యా శ్రీకాంత్‌ డ్రైవర్‌ కావటంతో ఆయనే వాహనం నడిపితే ప్రమాదం తప్పేదేమోనని బంధువులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని