logo

మండుటెండల్లో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు..!

ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండవేడిమి, వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారం రోజులుగా 44 నుంచి 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Published : 05 May 2024 01:50 IST

పరీక్షలు వాయిదా వేయాలని ఆచార్య మల్లారెడ్డికి వినతి పత్రం అందిస్తున్న విద్యార్థి సంఘాల నేతలు

కేయూ క్యాంపస్‌, వరంగల్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండవేడిమి, వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారం రోజులుగా 44 నుంచి 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొద్దిరోజుల పాటు తీవ్రత ఇలాగే ఉండొచ్చని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో కాకతీయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. సోమవారం నుంచి బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ తదితర కోర్సుల్లో రెండు, నాలుగో, ఆరో సెమిస్టర్‌ విద్యార్థులకు పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ ప్రకటించారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల బాధ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

122 పరీక్ష కేంద్రాలు.. 1.70 లక్ష మందికి పైగా విద్యార్థులు: కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో 1,71,991 మంది విద్యార్థులు డిగ్రీ పరీక్షలకు హాజరుకానున్నారు. 122 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్‌.నరసింహాచారి, అదనపు అధికారిణి డా.ఎం.తిరుమలాదేవి తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 45, వరంగల్‌లో 47, ఖమ్మంలో 30 కేంద్రాలుండగా.. హాల్‌టికెట్లను సైతం కేయూ వెబ్‌సైట్‌లో ఉంచారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

గ్రామీణ విద్యార్థులకు ప్రమాదమే.. గ్రామీణ విద్యార్థులు కొందరు 30-40 కి.మీ. నుంచి జిల్లా, మండల కేంద్రాలకు వచ్చి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఎండల్లో రాకపోకలు కష్టమే. మరోవైపు పరీక్ష కేంద్రాల్లో సైతం ఉక్కపోతతో అవస్థలు తప్పేలా లేవు. ఒకవైపు లోక్‌సభ, పట్టభద్రుల (నల్గొండ-ఖమ్మం-వరంగల్‌) ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ పరిధిలో విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అక్కడ రవాణా సౌకర్యాలు అంతంతమాత్రమే.

ఉస్మానియాలో వాయిదా.. ఉష్ణోగ్రతల తీవ్రత నేపథ్యంలో విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షలను వాయిదా వేసింది. జూన్‌ 7 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. కేయూతో పోల్చితే ఓయూలో డిగ్రీ చదివే విద్యార్థుల సంఖ్య ఎక్కువే. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన సమాధానపత్రాల మూల్యాంకనం, ఫలితాలు విడుదల, సర్టిఫికెట్లు అందించడానికి కార్యాచరణ రూపొందించింది. మరోవైపు కేయూ అధికారులు ఆ దిశగా ఆలోచించడం లేదు.


ఎండల తీవ్రత ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. జులై నుంచి బీఈడీ, ఐసెట్‌, పీజీసెట్‌, లాసెట్‌ తదితర పోటీ పరీక్షల్లో ప్రవేశాలు ప్రారంభమవుతాయి. త్వరితగతిన డిగ్రీ పరీక్షలు నిర్వహించి ఫలితాలను విడుదల చేయాలనే ఉద్దేశంతోనే ఈ షెడ్యూల్‌ ప్రకటించాం. వాయిదా వేస్తే పీజీ, ఐసెట్‌ తదితర కోర్సుల్లో సీట్లు పొందే విద్యార్థులకు నష్టం కలిగే అవకాశం ఉంది.

ఆచార్య పి.మల్లారెడ్డి, కేయూ రిజిస్ట్రార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని