logo

ఉపాధి కూలీలకు భానుడి సెగ

భానుడి భగభగతో ఉపాధి హామీ పథకం కూలీలు పని ప్రదేశాల్లో అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. పనిచేసే చోట ఎలాంటి నీడ, కనీస వసతులు లేక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేకపోతున్నారు.

Published : 05 May 2024 02:12 IST

కొత్తగూడెం సంక్షేమ విభాగం, న్యూస్‌టుడే: భానుడి భగభగతో ఉపాధి హామీ పథకం కూలీలు పని ప్రదేశాల్లో అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. పనిచేసే చోట ఎలాంటి నీడ, కనీస వసతులు లేక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేకపోతున్నారు. కొన్ని మండలాల్లో కూలీలు ఉదయం 6 గంటల నుంచి 7 మధ్య బయల్దేరి వెళ్తున్నారు. పనులు పూర్తయి యాప్‌లో ఆన్‌లైన్‌ హాజరు నమోదయ్యేటప్పటికి 11 గంటలు దాటుతోంది. సాయంత్రం వేడి వాతావరణం, వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలో వివిధ మండలాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌ దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వాతావరణం ఉడికెత్తించేలా ఉందని, కనీస జాగ్రత్తలు తప్పనిసరని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కూలీల ఆరోగ్య సంరక్షణ దిశగా పథకం మండల స్థాయి అధికారులు కనీస చర్యలు చేపట్టాలి.

వసతులు: పథకం నిబంధనల ప్రకారం పని ప్రాంతాల్లో సేదతీరేందుకు నీడ సౌకర్యం కల్పించాలి. మంచినీరు,  ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ప్రాథమిక వైద్యానికి కిట్లు అందించాలి. అరకొర నీటి క్యాన్ల ఏర్పాటుపై కూలీలు పెదవి విరుస్తున్నారు. ప్రాథమిక కిట్ల జాడే లేదు. పంట కాలువలు, చెరువుల పూడికతీత, చెట్ల నరికివేత వంటి పని ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించేలా సిబ్బంది అవగాహన కల్పించాలి.

ప్రమాద బీమా: అధిక ఉష్ణోగ్రతల కారణంగా పని ప్రదేశాల్లో విష పురుగులు, కందిరీగలు వంటివి దాడి చేసే అవకాశాలెక్కువ. ప్రమాద బీమా రూ.10 లక్షల వరకు వర్తింపజేయాలన్న కూలీల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. వడ[దెబ్బ, పాముకాటుతో అత్యధిక మంది కూలీలు మృత్యువాతపడుతున్నారు. బాధిత కుటుంబాలకు పరిహారంతోనే ఉపశమనం దక్కుతుంది.

వేసవి భత్యం: గతంలో ప్రతి కూలీకి వేసవి భత్యం చెల్లించేవారు. తాగునీరు, పరికరాలు, దూర ప్రాంతాలకు రవాణా ఛార్జీ అందించేవారు. మూడేళ్లుగా వీటికి కోత విధించడంపై లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. వీటిని తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

పనికి తగ్గ ఫలితం: ఏటా కేంద్ర ప్రభుత్వం కూలి రేటు పెంచుతుంది. అవేమీ పనికి తగిన ఫలితాన్నివ్వడం లేదన్నది కూలీల వాదన. ప్రస్తుతం రోజు కూలి రూ.300కు పెంచినా ఖాతాల్లో రూ.200-250 మధ్యే జమవుతోందని వాపోతున్నారు. గిట్టుబాటు కల్పించాల్సిన బాధ్యత అధికారులదే.


పాధి కూలీల కోసం షామియానాలు, షేడ్‌ నెట్‌లు పంచాయతీల వారీగా సంఖ్యను బట్టి ఇప్పటికే సిబ్బందికి అందజేశాం. ఒక్కో గ్రామానికి ఒకటి నుంచి నాలుగు వరకు అందాయి. వాటిని పనిప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుని నీడలో ఉపశమనం పొందేలా ఏర్పాట్లు చేయాలని సూచించాం. చల్లటి మంచినీటి క్యాన్లు రోజూ తెప్పించాలని ఆదేశించాం. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మెడికల్‌ కిట్లు కూడా సరఫరా చేశాం. మండల స్థాయి అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారు.

రవి, జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి  

మొత్తం మండలాలు: 22
గ్రామ పంచాయతీలు: 481
జాబ్‌కార్డులు: 2.19 లక్షలు
కూలీలు: 4.51 లక్షల మంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని