logo

శాసనసభ ఎన్నికల ఫలితాలే పునరావృతం

కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే తమకు భరోసా ఇస్తుందనే నమ్మకం ప్రజల్లో నాటుకుందని ఖమ్మం లోక్‌సభ స్థానం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు.

Published : 07 May 2024 02:07 IST

ఖమ్మం లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డితో

ఈటీవీ, ఖమ్మం: కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే తమకు భరోసా ఇస్తుందనే నమ్మకం ప్రజల్లో నాటుకుందని ఖమ్మం లోక్‌సభ స్థానం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. శాసనసభ ఎన్నికల ఫలితాలే సార్వత్రిక సమరంలోనూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పునరావృతమవుతాయని అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేల సహకారంతో ప్రచారం సాగుతోందని చెప్పారు. తనకు రాజకీయాలు కొత్త కాదని.. తానూ రాజకీయాలకు కొత్త కాదని.. గెలిపిస్తే ఖమ్మం లోక్‌సభ స్థానంలో ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. ‘ఈనాడు’తో ఆయన ముచ్చటించారు. ఆ వివరాలు మీ కోసం..

ఆరు గ్యారంటీలతో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేసింది. ప్రజలు నమ్మకంతోహస్తం పార్టీకి అధికారం కట్టబెట్టారు. కాంగ్రెస్‌ శ్రేణులు నూతనోత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటించాను. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

మంత్రులే ప్రచార రథసారథులు

ఖమ్మం లోక్‌సభ స్థానంలో భారీ ఆధిక్యం సాధించి పార్టీ అగ్రనేత సోనియాగాంధీకి కానుకగా అందిస్తాం. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రి చేయటంలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు కీలక భూమిక పోషించబోతున్నాయి. ముగ్గురు మంత్రులు ప్రచార రథసారథులుగా వ్యవహరిస్తూ నాయకులు, కార్యకర్తలను సమన్వయపరుస్తున్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ ఖిల్లా అని మరోసారి నిరూపించేలా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి.

కాంగ్రెస్‌తో దశాబ్దాల అనుబంధం

రాజకీయాలు నాకు కొత్తకాదు. నేనూ రాజకీయాలకు కొత్తేమీ కాదు. సుదీర్ఘ కాలంగా మా కుటుంబం కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంది. మా తాతయ్య, మానాన్న కాంగ్రెస్‌ పార్టీలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎదిగారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ ఉన్నతికి  మా కుటుంబం కృషి చేస్తోంది. సుమారు 20 ఏళ్లుగా నేనూ కాంగ్రెస్‌ పార్టీకి సేవలందిస్తున్నా. కూసుమంచి మండలం చేగొమ్మ నా స్వస్థలం. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల కోసం వందలాది ఎకరాల భూములను విరాళంగా అందించిన చరిత్ర మా కుటుంబానిది. ప్రజలు ఆదరించి ఎంపీగా గెలిపిస్తే వారి కష్టసుఖాల్లో ఒకడిగా ఉంటాను.

విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి

ఖమ్మం జిల్లా రాజకీయంగా, చారిత్రకంగా రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. గత పదేళ్లుగా రాష్ట్రంలో భారాస, కేంద్రంలో భాజపా అధికారంలో ఉండటంతో అభివృద్ధిలో ఈ జిల్లా వెనుకబడింది. నన్ను ఎంపీగా గెలిపిస్తే అన్ని రంగాల్లో ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని అగ్రగామిగా నిలబెడతా. ఖమ్మం జిల్లాకు విశ్వవిద్యాలయం తీసుకొస్తాను. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తాను. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు పరిశ్రమలకు అనువైనవి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపనతో వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చు. ఈ దిశగా అడుగులు వేస్తాను. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఉభయ జిల్లాలకు రైల్వే ప్రాజెక్టులు తీసుకొస్తాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని