logo

ఖమ్మంలో కమల వికాసం ఖాయం

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని ఖమ్మం లోక్‌సభ స్థానం ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు అన్నారు. కాంగ్రెస్‌, భారాస హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆశించిన స్థాయి అభివృద్ధి జరగలేదని, ప్రజలు ఈసారి భాజపా వైపు చూస్తున్నారని చెప్పారు.

Updated : 08 May 2024 05:41 IST

భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావుతో ముఖాముఖి

ఈటీవీ, ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని ఖమ్మం లోక్‌సభ స్థానం ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు అన్నారు. కాంగ్రెస్‌, భారాస హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆశించిన స్థాయి అభివృద్ధి జరగలేదని, ప్రజలు ఈసారి భాజపా వైపు చూస్తున్నారని చెప్పారు. తెదేపా మద్దతుతో ఖమ్మం లోక్‌సభ స్థానంలో కమల వికాసం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘ఈనాడు’తో ఆయన ముచ్చటించారు. ఆ వివరాలు మీ కోసం..

మోదీ కరిష్మానే భాజపాకు అదనపు బలం

ప్రపంచ పటంపై భారతదేశాన్ని సగర్వంగా నిలిపిన ఘనత ప్రధాని నరేంద్రమోదీకి దక్కుతుంది. ‘కేంద్రంలో మూడోసారి మోదీ- ఖమ్మంతో జోడీ’ అనే నినాదంతో ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మోదీ కరిష్మా భాజపాకు అదనపు బలం. తెదేపా మద్దతుతో మాకు సానుకూల పవనాలు వీస్తున్నాయి. రాష్ట్రంలో ఐదు నెలలకే కాంగ్రెస్‌ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. గతంలో భారాస అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ నియంత మాదిరి వ్యవహరించారు.

కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లే జాతీయ రహదారుల నిర్మాణం

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని కాంగ్రెస్‌, భారాస నాయకులు ఆరోపిస్తున్నారు. ఉభయ జిల్లాల్లో ఈమాత్రమైనా అభివృద్ధి కనిపిస్తుందంటే అది కేంద్ర ప్రభుత్వం చలవే. జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం రూ.12వేల కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే వివిధ పథకాల్లో కేంద్రం వాటా నిధులు ఉన్నాయి. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి భాజపా అధికారంలోకి రావటం ఖాయం. ఇక్కడా భాజపాను ఆశీర్వదిస్తే అభివృద్ధి గాడిన పడుతుంది.

నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తా

ప్రజలు ఎంపీగా గెలిపిస్తే గిరిజనుల అభ్యున్నతి, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తా. ఖమ్మం లోక్‌సభ స్థానంలో మెరికల్లాంటి క్రీడాకారులు ఉన్నా.. అందుకు తగినట్లుగా సౌకర్యాలు లేవు. వసతుల కల్పనపై దృష్టి సారిస్తా. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపనకు చొరవ చూపుతా. పామాయిల్‌ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను నెరవేర్చేందుకు యత్నిస్తా. సారవంతమైన భూములున్నా ఆ స్థాయిలో పంటల సాగు, దిగుబడులు లేవు. మండలానికో బయో ఇన్‌పుట్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు కృషి చేస్తాను.

ఆదరిస్తే అద్భుతాలు చేసి చూపిస్తా

నేడు ఈ గడ్డపై పుట్టిన బిడ్డను. మా సొంతూరు భద్రాద్రి జిల్లా ములకలపల్లి. ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో ఎలా పరుగులు పెట్టించాలనే అంశంపై ప్రణాళిక ఉంది. తప్పుడు వాగ్దానాలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై ప్రజల భ్రమలు తొలగిపోయాయి. అయిదో అతిపెద్ద ఆర్థిక దేశంగా ఉన్న భారత్‌ను మూడో స్థానంలోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పనిచేస్తున్నారు. ‘సబ్‌ కా సాత్‌- సబ్‌ కా వికాస్‌’ నినాదంపై ప్రజలకు విశ్వాసం ఉంది. ఖమ్మం లోక్‌సభ స్థానంలో ప్రజలు ఆదరిస్తే అన్ని రంగాల్లో జిల్లా అబ్బురపడేలా అభివృద్ధి చేసి చూపిస్తా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు