logo

వానాకాలం వరి సాగు జోరు!

వర్షాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తుగా సిద్ధం చేశారు. గత సీజన్‌తో పోల్చిచూస్తే ఈ సారి వరి విస్తీర్ణం ఎక్కువగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Published : 09 May 2024 03:10 IST

కొత్తగూడెం వ్యవసాయం, న్యూస్‌టుడే: వర్షాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తుగా సిద్ధం చేశారు. గత సీజన్‌తో పోల్చిచూస్తే ఈ సారి వరి విస్తీర్ణం ఎక్కువగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురుస్తాయన్న వాతావరణ శాస్త్రవేత్తల అంచనాలకు తోడు కొత్త ప్రభుత్వం వచ్చే సీజన్‌ నుంచి వరికి క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తామని ప్రకటించింది.  సాధ్యమైనంత మంది అన్నదాతలు వరి సాగుకు మొగ్గుచూపుతారని తెలుస్తోంది. జిల్లాలో కిన్నెరసాని, తాలిపేరు, మూకమామిడి, పెదవాగు రిజర్వాయర్లతో పాటు పాములేరు, మొర్రేడువాగు, కిన్నెరసాని నదులు, వాగుల పరీవాహక ప్రాంతాలు, ప్రధాన చెరువుల కింద ఆయకట్టు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరితో పాటు ప్రధాన వాణిజ్య పంటల డిమాండ్‌కు తగిన విధంగా విత్తనాల సరఫరాకు చర్యలు చేపడుతున్నారు. పట్టాలు అందిన పోడు భూముల్లో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశముంది. ఈ ఏడాది అత్యధికంగా సాగయ్యే పంటల్లో వరి, పత్తితో పాటు మొక్కజొన్న, మిరప రకాలు ఉంటాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు తెలిపారు. ‘ప్రస్తుత అంచనా ప్రకారం విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతున్నాం. అవసరాన్ని బట్టి ఉన్నతాధికారుల సమన్వయంతో కొరత లేకుండా చూస్తాం. యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులనూ దిగుమతి చేసుకోవాలని డీలర్లకు సూచించాం’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని