logo

వేసవి గట్టెక్కేదెలా..?

వేసవి సమీపిస్తోంది. కొల్లేరు, ఉప్పుటేరు తీర ప్రాంతాల్లో ప్రజలకు నీటిఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. కృష్ణా బ్యారేజీ నుంచి కాలువలకు విడుదలవుతున్న నీటిని నిల్వ చేసి వేసవిలో ప్రజలకు అందించే అవకాశాలపై అధికారులు సరైన

Published : 28 Jan 2022 02:17 IST

పైపులైన్ల ఏర్పాటుతో ఎద్దడికి పరిష్కారం

కోరుకొల్లు, కలిదిండి, కైకలూరు, న్యూస్‌టుడే

కైకలూరు : పెంచికలమర్రు సామూహిక రక్షిత మంచినీటి పథకం

వేసవి సమీపిస్తోంది. కొల్లేరు, ఉప్పుటేరు తీర ప్రాంతాల్లో ప్రజలకు నీటిఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. కృష్ణా బ్యారేజీ నుంచి కాలువలకు విడుదలవుతున్న నీటిని నిల్వ చేసి వేసవిలో ప్రజలకు అందించే అవకాశాలపై అధికారులు సరైన దృష్టి సారించడంలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 10, 15 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు చేపట్టిన సామూహిక రక్షిత మంచినీటి పథకాలు ఈసారీ అక్కరకు వచ్చే సూచనలు కనపించడం లేదు. ప్రస్తుతం ఉన్న చెరువులను పూర్తిస్థాయిలో నింపినా.. 45 రోజులు మించి నీరు నిల్వ ఉండని పరిస్థితి ఈ ప్రాంతాల్లో నెలకొంది. నేల స్వభావం కూడా అందుకు ప్రధాన కారణం.

ఆరేళ్లుగా సాగుతోంది

తాడినాడ, చినతాడినాడ, పోతుమర్రు పంచాయతీల పరిధిలోని 11 గ్రామాలకు తాగునీరు అందించాలన్న సంకల్పంతో తాడినాడలో రూ13.కోట్ల అంచనాలతో సామూహిక రక్షిత మంచినీటి పథకం నిర్మాణానికి ఆరేళ్ల కిందట శ్రీకారం చుట్టారు. కొవిడ్‌ నేపథ్యం, వర్షాలు, తదితర అంశాలతో పాటు పశ్చిమగోదావరి జిల్లా నుంచి వేయాల్సిన పైపులైన్ల విషయంలో తలెత్తిన అభ్యంతరాలు.. ఇలా ఏదో ఒకటి మోకాలడ్డుతూ వస్తోంది. ఈ వేసవికైనా శుద్ధ జలం వస్తుంది, ఉప్పుటేరు దాటి పడవలపై తాగునీరు తెచ్చుకునే కష్టం తీరుతుందని ఆశించిన ఏటి తీర గ్రామాల ప్రజల ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. పైపులైన్ల నిర్మాణంలో అధికారులు చొరవ చూపిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

మేజర్‌ పంచాయతీలు కలిదిండి, కోరుకొల్లులో సుమారు 12వేల పైచిలుకు చొప్పున జనాభా ఉన్నారు. కోరుకొల్లులో ప్రస్తుత అవసరాలకు 5.30ఎకరాల్లో చెరువు ఉంది. వేసవిలో నీటి ఎద్దటి ఎదుర్కొనేందుకు ఇది చాలకపోవడంతో కొత్త ఎస్సీ కాలనీలో ఇటీవల రెండెకరాల చెరువును అందుబాటులోకి తెచ్చినా ప్రయోజనం లేదు. ఉన్న చెరువులకు అదనంగా ఒక్కో గ్రామంలో సుమారు 10 ఎకరాల చెరువు నిర్మించేందుకు స్థానిక నాయకులు, అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా స్థలం కొరత ప్రధానంగా వేధిస్తోంది.

అదనంగా చెరువు అవసరం

మండవల్లి మండలం తక్కెళ్లపాడు సామూహిక మంచినీటి పథకాన్ని 14 గ్రామాలకు అనుసంధానం చేస్తూ నిర్మించారు. ప్రస్తుతం రెండు గ్రామాలకు మాత్రమే నీరందుతుంది. కేవలం 7 ఎకరాల చెరువు మాత్రమే ఉండటంతో వేసవితో తీవ్ర ఎద్దడి ఉంటుంది. నిల్వ సామర్థ్యం పెంచేందుకు అదనంగా మరో చెరువు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

చింతపాడులో రూ.50 లక్షల వ్యయంతో మరో మంచినీటి పథకం ఏర్పాటుకు నిధులు మంజూరైనట్లు అధికారులు ప్రకటించినా పనులు మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఇది ఆచరణలో పెడితే మరో 8 లంక గ్రామాలకు తాగునీరు అందించవచ్ఛు

రెండు గ్రామాలకే నీరు●

కైకలూరు మండలంలో కొల్లేరు లంక గ్రామాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పెంచికలమర్రు సామూహిక రక్షిత నీటి పథకం వృథాగా మారింది. 16 గ్రామాలకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన ఈ పథకం పైపులైను పనులు అటకెక్కాయి. 20 ఎకరాల విస్తీర్ణంలో మూడు చెరువులు కలిపి 60 ఎకరాల్లో నీరు అందుబాటులో ఉంది. పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం వద్ద గోదావరి జలాలు ఈ పథకానికి తరలించేందుకు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రస్తుతం రెండు గ్రామాలకు మాత్రమే అరకొరగా నీరు విడుదల చేస్తున్నారు. ఆ నీరు కూడా తాగడానికి అనువుగా లేవని స్థానికులు చెబుతున్నారు.

కైకలూరు మండలం తామరకొల్లు, వింజరం, ఆచవరం, రాచపట్నం, సీతనపల్లి, దొడ్డిపట్ల్ల, రామవరం, గోనిపాడులో రక్షిత నీటి పథకాలు శుద్ధజలం అందించలేని స్థితిలో ఉన్నాయి. దీంతో ఊటబావుల నీరే దిక్కవుతున్నాయి. వాటి సంరక్షణకైనా చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఆటపాక, తామరకొల్లు గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ సుజలస్రవంతి, సుజలధార పథకాల్లో శుద్ధ జల కేంద్రాలు నిర్మించారు. ప్రస్తుతం వీటి నిర్వహణ సరిగాలేక అలంకారప్రాయంగా మారాయి. ఆచరణలో పెడితే వేసవిలో ప్రజలకు ఉపయుక్తంగా ఉంటాయి.

త్వరలో పూర్తిస్థాయి వసతులు

తాడినాడ, పెంచికలమర్రు తాగునీటి పథకాలపై ఆధారపడి ఉన్న గ్రామాలకు పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతాం. జల్‌జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఇప్పటికే రెండు పథకాలకు నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం టెండరు ప్రకటన చేశాం అన్ని గ్రామాలకు పైపులు ఏర్పాటు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చూస్తాం. కలిదిండి, కోరుకొల్లు, కైకలూరు వంటి మేజర్‌ పంచాయతీల్లో పెరుగుతున్న జనాభా, నీటి అవసరాల దృష్ట్యా అదనపు చెరువుల ఏర్పాటుపై సమగ్ర పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటాం. - శాస్త్రి, డీఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని