logo

వైకాపాను సాగనంపేందుకు సిద్ధం

వైకాపాను సాగనంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఏపీ న్యాయయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆదోని పట్టణం స్థానిక అంబేడ్కర్‌ కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు.

Published : 20 Apr 2024 05:42 IST

జగన్‌ హామీలు మద్యం దుకాణాల్లోనే
ఆదోని సభలో వైఎస్‌ షర్మిల

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: వైకాపాను సాగనంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఏపీ న్యాయయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆదోని పట్టణం స్థానిక అంబేడ్కర్‌ కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. వైకాపా కార్యకర్తలు కొందరు సిద్ధం జెండాలు పట్టుకొని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.. సమీపంలోని ఓ మేడపై నుంచి వైకాపా సిద్ధం జెండాలు చూపుతూ కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. మిమ్మల్ని పంపేందుకు మేము సిద్ధమన్నారు. పోలీసులు మేడపైకి వెళ్లి వైకాపా వారిని అక్కడి నుంచి తరిమివేశారు. వైకాపా అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.. ఐదేళ్లుగా గడిచినా ఆ మాటే మరిచారు.. ఖాళీలు భర్తీ చేయకుండా ఐదేళ్లు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. జగన్‌ ఇచ్చిన హామీలు మద్యం దుకాణాల్లోనే ఉండిపోయాయని ఎద్దేవా చేశారు. ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోవడం లేదన్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా భాజపాకు గులాంగిరీ చేస్తున్నారన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం.. గుండు సున్నా ఇచ్చిందన్నారు. ఆదోని ఎమ్మెల్యే పేకాటరాయుడు అంటకదా.. ఇలాంటి దోపిడీదారులకా ఓట్లు వేసేది? అని ప్రశ్నించారు. ఆదోని కాంగ్రెస్‌ అభ్యర్థిగా రమేశ్‌యాదవ్‌, కర్నూలు ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్యయాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఇండియా కూటమి నాయకులు నీలకంఠప్ప, దేవిశెట్టి ప్రకాశ్‌, దిలీప్‌దోకా, అజయ్‌బాబు, లింగన్న, సాయినాథ్‌, వీరేశ్‌, ఉమ్మి యూసుఫ్‌, నూర్‌ పాల్గొన్నారు.


చేనేతను విస్మరించారు

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: చేనేతలకు టెక్స్‌టైల్‌ పార్కు నిర్మిస్తానని, రుణమాఫీ చేస్తానని, ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏమీ చేయలేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. కాంగ్రెస్‌ న్యాయ యాత్రలో భాగంగా శుక్రవారం ఆమె ఎమ్మిగనూరు గాంధీ కూడలిలో మాట్లాడారు. ముఖ్యమంత్రి సంపూర్ణ మద్యనిషేధం చేస్తానని ఐదేళ్ల కిందట చెప్పారు..చేయకపోతే ఎన్నికల్లో ఓట్లే అడగనన్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, డీఎస్సీ, రాజధాని ఇలా పలు వాగ్దానాలన్నీ ముఖ్యమంత్రి మద్యం దుకాణాల్లో పెట్టుకున్నారని విమర్శించారు. సొంత చిన్నాన్నను చంపినవారిని సీఎం పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని