logo

జగన్‌ ఆరాచకం.. తెలుగు గంగకు శోకం

నాడు ఎన్టీఆర్‌ ప్రారంభించిన తెలుగు గంగ ప్రాజెక్టుపై ప్రస్తుత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం రైతులకు శాపంగా పరిణమించింది. అయిదేళ్లలో జగనన్న ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎటువంటి శ్రద్ధ చూపకపోవడంతో తాగు, సాగునీటికి కష్టాలేర్పడ్డాయి.

Updated : 03 May 2024 06:15 IST

డిస్ట్రిబ్యూటరీ పనులకు నిధుల గ్రహణం
నాలుగేళ్లుగా పూర్తి కాని  మెయిన్‌ కాల్వ పనులు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: నాడు ఎన్టీఆర్‌ ప్రారంభించిన తెలుగు గంగ ప్రాజెక్టుపై ప్రస్తుత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం రైతులకు శాపంగా పరిణమించింది. అయిదేళ్లలో జగనన్న ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎటువంటి శ్రద్ధ చూపకపోవడంతో తాగు, సాగునీటికి కష్టాలేర్పడ్డాయి. తెలుగు గంగ ప్రధాన కాలువ లైనింగ్‌ పనులు జరగకపోవడం, కాలువల పనుల కోసం భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లించకపోవడంతో పనులు పడకేశాయి.

ఎప్పటికి పూర్తవుతాయో...?

తెలుగుగంగ ప్రధాన కాల్వ నుంచి నీటిని పంట పొలాలకు తరలిచేందుకు 2005లో పనులు ప్రారంభమయ్యాయి. బ్లాక్‌ ఛానెళ్లు, మేజరు కెనాళ్లు, మైనర్‌, సబ్‌ మైనర్సు, ఫీల్డుఛానెళ్ల నిర్మాణ పనులు చేపట్టారు. 2009లో ఒక్కసారిగా ఈ పనులు ఆగడంతో వాటి పూర్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. గతేడాది గుత్తేదారు సమస్యను పరిష్కరించి పనులు చేపట్టినా క్షేత్రస్థాయిలో సమస్యల కారణంగా మేజరు, మైనర్‌ కాల్వల నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయింది. కనీసం పంట కాల్వల తవ్వకాలైనా పూర్తిచేద్దామంటే రైతులకు పరిహారం సక్రమంగా అందకపోవడంతో వారు అంగీకరించలేదు. ఇలా పనులు ఎక్కడిక్కడ పడకేశాయి. కొన్ని చోట్ల తవ్విన తర్వాత పరిహారం రాలేదంటూ కొందరు ఆయా కాలువల్ని పూడ్చేశారు. ఇలా కాల్వలు అసంపూర్తిగా ఉండడంతో తెలుగుగంగ నీటిని రైతులు వినియోగించుకోలేకపోతున్నారు. పడకండ్ల పరిధిలోని సర్వే నం 9లో తెలుగు గంగ కాలువ పూడిక తీత పనులు జరుగుతుండగా రైతులు అడ్డుకున్నారు. పరిహారం మంజూరైనా ఆ మొత్తం రైతులకు అందకపోవడంతో పనులు చేపట్టేందుకు ససేమిరా అంటున్నారు. కొన్ని చోట్ల తవ్విన తర్వాత పరిహారం రాలేదంటూ రైతులు ఆయా కాలువలను పూడ్చేశారు.

రూపకల్పన జరిగిందిలా...

కృష్ణా వెనుక జలాలతో రాయలసీమను పునీతం చేసేందుకు 1983లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్‌ తెలుగుగంగకు రూపకల్పన చేశారు. చెన్నై నగరానికి తాగునీటికి 15 టీఎంసీల నీటిని సరఫరా చేయడంతో పాటు ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలకు సాగునీటిని అందించేందుకు దీన్ని రూపొందించారు. 29 టీఎంసీల కృష్ణా నది జలాలను ఉపయోగించి ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,14,500 ఎకరాలకు, వైఎస్సార్‌ జిల్లాలో 1,67,000 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు అప్పటి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ముఖ్యమంత్రులు ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌ తెలుగుగంగ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. వెలుగోడు వద్ద గాలేరునదిపై 16.95 టీఎంసీలతో నిర్మించనున్న ఈ రిజర్వాయర్‌ ద్వారా సాగునీటితో పాటు నంద్యాల పట్టణానికి 0.86 టీఎంసీలు, ఆళ్లగడ్డ పట్టణానికి తుండ్ల వాగు ద్వారా 0.16 టీఎంసీల తాగునీటిని అందివ్వాలనుకున్నారు. 1993 నుంచి వెలుగోడు రిజర్వాయర్‌ ద్వారా పొలాలకు సాగునీటిని మాత్రమే అందిస్తున్నారు.


గొడిగనూరు గ్రామ పరిధిలో తెలుగు గంగ కాలువకు నీరు రాకపోవడం వల్ల దాదాపు 500 ఎకరాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. చింతలచెరువు, మూడురాళ్లపల్లె, కేపీˆ.తండా, చింతలచెరువు, చాగలమర్రి పరిసరాల్లో పంట కాలువలు అధ్వానంగా మారడంతో దాదాపు 4500 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది.

న్యూస్‌టుడే, చాగలమర్రి


ఆళ్లగడ్డలో అసంపూర్తి కాలువలు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: తెలుగు గంగ ప్రధాన కాల్వ, మేజరు, మైనర్‌ కాల్వల పనులకు ఆళ్లగడ్డ సబ్‌ డివిజన్‌ పరిధిలో రూ.18 కోట్లతో 2023లో పనులు చేపట్టారు. గతేడాది జూన్‌, జులైలో మేజరు, మైనరు కాల్వల్లో పూడిక తీత పనులు చేపట్టారు. ఈ పనులు జరిగిన నెలల వ్యవధిలోనే కాలువలు నిండా మళ్లీ ముళ్లచెట్లు పెరగడంతో నీటి ప్రవాహానికి ఆటంకాలేర్పడ్డాయి.  


ఆగిన రహదారి పనులు

మెయిన్‌ కాల్వ లైనింగ్‌ పనులతో పాటు కట్ట వెంబడి డబ్ల్యూబీఎం రహదారిని 0-42 కి.మీ పొడవునా నిర్మించడానికి నిధులు మంజూరయ్యాయి. 18 కి.మీ.ల పొడవునా రహదారి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కానీ 18-42 కి.మీల పొడవునా 5 కి.మీలు, 10వ కి.మీ వద్ద 5 కి.మీల పొడవునా రహదారి పనులు నిలిచిపోయాయి. నిర్మాణంలో భాగంగా నిర్మించాల్సిన సింగిల్‌ లైన్‌బ్రిడ్జి నిర్మాణాలు ఇంకా 15 శాతం పూర్తి కాలేదు. కల్వర్టుల పనులు కూడా అక్కడక్కడా పెండింగ్‌లో ఉన్నాయి.


తెలుగు గంగ ప్రధానకాల్వ వెంట 16వ బ్లాకు నుంచి 22వ బ్లాకులకు సంబంధించి ఉపకాల్వలకు సీమెంట్‌ లైనింగ్‌ లేకపోవడంతో నీరంతా వృథాగాపోతోంది.  రుద్రవరం మండలంలో దాదాపుగా 35 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. చిలకలూరు, చందలూరు, బి.నాగిరెడ్డిపల్లె, మందలూరు, ముత్తలూరు, నరసాపురం, నల్లవాగుపల్లె రైతులు నీరు రాకపోవడంతో పంటలను వదిలేసుకుంటున్నారు.

న్యూస్‌టుడే, రుద్రవరం


లైనింగ్‌ ఎన్నటికి పూర్తి అయ్యేనో!

తెలుగుగంగ ప్రధాన కాలువ లైనింగ్‌ పనులు ప్రశ్నార్థకంగా మారాయి. వెలుగోడు రిజర్వాయర్‌ 0 కి.మీ నుంచి 18.20 కి.మీల వరకు 18 కి.మీ నుంచి 42.566 కి.మీ వరకు లైనింగ్‌ పనులు చేయడానికి 2021లో రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రానికి చెందిన గుత్తేదారు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానంగా 10, 11 బ్లాక్‌ల పరిధిలో పనులు ఆగిపోయాయి. తొలుత రూ.239 కోట్లతో ఒప్పందం కుదిరింది. పనులు ఆలస్యం కావడంతో పాటు నిర్మాణ ఖర్చులు పెరిగిపోయాయని గుత్తేదారు సంస్థకు వెసులుబాటు కల్పించారు. అంచనా వ్యయాన్ని రూ.500 కోట్లకు పెంచి పాత గుత్తేదారునికే పనులు కట్టబెట్టారు. ఈ ఏడాది జూన్‌ ఆఖరు వరకు గడువు కూడా పొడిగించారు. ఇంకా 15 శాతం పనులు జరగాలి.


నాసిరకంగా పనులు

తెలుగుగంగ ప్రధాన కాలువ లైనింగ్‌తో పాటు డబ్ల్యూబీఎం రహదారి నిర్మాణాల్లో పలుచోట్ల పనులు నాసిరకంగా జరిగాయి. మహానంది సమీపంలోని అయ్యన్ననగర్‌ వద్ద జరిగిన పనుల్లో నాణ్యత లోపించింది. కాల్వకు ఇరువైపులా చేసిన సైడ్‌ స్లోపింగ్‌ బెడ్‌ పనులు లోపభూయిష్టంగా జరిగాయి. కృష్ణనంది సమీపంలో చేసిన బ్యాలెన్స్‌ లైనింగ్‌ పనులకు పెద్ద సైజు కంకర వాడారు. చాగలమర్రి మండలం పరిధిలో 35, 36 బ్లాక్‌ల పరిధిలో చింతలచెరువు, మూడురాళ్లపల్లె నుంచి చాగలమర్రి వరకు జరిగిన రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించింది. రుద్రవరం మండలం పరిధిలో 21వ బ్లాక్‌ తూము వద్ద ప్రధాన కాల్వలో సైడ్‌ వాల్‌ కూలిపోవడంతో చేసిన పనులు కూడా సరిగ్గా జరగలేదు. గతంలో రెండుసార్లు ఈ గోడ పడిపోయింది. కాని తిరిగి చేసిన తర్వాత మరమ్మతు పనులు కూడా తూతూమంత్రంగా జరిగాయి.


ళ్లగడ్డ మండలంలోని ఆర్‌.కృష్ణాపురం గ్రామ సమీపంలోని 28వ బ్లాక్‌ తెలుగు గంగ కాల్వలో ఇటీవల పూడిక తొలగించి విస్తరణ పనులు చేపట్టారు. ఈ కాల్వ నుంచి పంట పొలాలకు నీరు మళ్లించే డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్‌ అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ముళ్లపొదలతో నిండి నీరు పారేందుకు వీల్లేకుండా మారాయి

న్యూస్‌టుడే, అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని