logo

‘ఘనులు’ తీసిన గోతులు

డోన్‌ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్‌పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్‌, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Published : 25 Apr 2024 05:11 IST

రెచ్చిపోతున్న మైనింగ్‌ మాఫియా
ఆర్థిక మంత్రి ఇలాకాలో తవ్వకాలు

అధికార అండతో తరలుతున్న ఖనిజం

 

మైనింగ్‌ చట్టం ‘అధికారానికి’ చుట్టం అవుతోంది.. విలువైన ఖనిజం అక్రమంగా తరలిపోతోంది.. నిబంధనలకు విరుద్ధంగా తోడేస్తూ ఎలాంటి పన్నులు చెల్లించకుండా తరలిస్తున్నారు.. లీజు గడువులు ముగిసినా అధికార పార్టీ అండదండలతో పట్టపగలే పెద్ద యంత్రాలతో తోడేస్తున్నారు. ఐదేళ్ల కాలంలో అధికార పార్టీ కనుసన్నల్లోనే మైనింగ్‌ దోపిడీ విచ్చలవిడిగా జరిగింది. అనుమతులకు మించి తవ్వినప్పుడు, ఇటువంటి అక్రమాలను ఎవరైనా ప్రశ్నిస్తే ఇక్కడ మైనింగ్‌ మాఫియా దాడులకు దిగుతోంది. గనుల్లో ఏదైనా ఘటన జరిగినా, వ్యక్తులు మృతిచెందినా ఆయా విషయాలు బయటకు పొక్కనివ్వకుండా అధికార జులం ప్రదర్శిస్తున్నారు.

 న్యూస్‌టుడే, డోన్‌


ఖనిజాల ఖిల్లా డోన్‌

ఉమ్మడి కర్నూలు జిల్లాలో డోలమైట్‌, లైమ్‌స్టోన్‌, వైట్‌షేల్‌, స్ట్రీటైట్‌, వైట్‌క్లే, తెల్ల సుద్ద, మొజాయిక్‌చిప్స్‌, ఇనుపఖనిజం, బలపంరాయి, నాపరాయి, క్వార్జ్‌ వంటి ఖనిజ నిల్వలు ఉన్నాయి. డోన్‌ నియోజకవర్గ పరిధిలో చిన్నమల్కాపురం, పెద్దమల్కాపురం, జలదుర్గం, కొచ్చెర్వు, బావిపల్లె, చండ్రపల్లె ఎక్కువగా ఉన్నాయి. డోలమైట్‌, వైట్‌షేల్‌, లైమ్‌స్టోన్‌ వంటి ఖనిజాలను పిండి చేసి పౌడర్‌ పరిశ్రమలకు, పేపర్‌ తయారీతో పాటు ఇతర అవసరాలకు వేరే ప్రాంతాలకు తరలిస్తారు. వాటిని తవ్వుకోవడానికి ప్రభుత్వం నుంచి అధికారికంగా 84 మందికి అనుమతులున్నట్లు తెలుస్తోంది. ఇందులో కొందరి లీజు గడువు ముగిసింది. చిన్నమల్కాపురం పరిధిలో ముగ్గురు వ్యక్తులకే అనుమతులు ఉన్నాయి. అనధికారికంగా పలువురు తోడేస్తున్నారు. వీరికి ‘అధికార’ పార్టీ అండదండలు ఉన్నట్లు సమాచారం. లీజులిచ్చిన ప్రాంతాలన్నీ కొండలు కావడం.. లీజులు ఒకచోట ఉండగా.. తవ్వకాలు మరోచోట చేపడుతున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి పడుతోంది.

రాయల్టీకి ఎగనామం

లక్షల క్యూబిక్‌ మీటర్ల ఖనిజాలు తవ్వి తరలిస్తున్నారు. వీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. రాయల్టీలు లేకుండానే ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా డోలమైట్‌, వైట్‌షేల్‌, మొజాయిక్‌ చిప్స్‌, స్టీటైట్‌, లైమ్‌స్టోన్‌ ఖనిజాలు తరలిస్తున్నారు. డోలమైట్‌కు మెట్రిక్‌ టన్నుకు రూ.262, డీఎంఎఫ్‌ కింద రూ.30 రాయల్టీ చెల్లించాలి. ఒక రాయల్టీని అడ్డు పెట్టుకుని ట్రాక్టర్ల ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు తరలిస్తున్నారు.

తనిఖీలు నామమాత్రం

డోన్‌ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్‌పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్‌, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నామమాత్రంగా సాగుతున్నాయి. ఖనిజాలు తీసుకెళ్లే వాహనాలు వెళ్లేటపుడు అక్కడున్న సిబ్బంది పత్రాలు నిశితంగా పరిశీలించాలి.. పత్రాల్లో పొందుపరిచిన సరకు, లారీలో ఉన్నది ఒకటేనా అన్నది గమనించాలి, కానీ అలా జరగడం లేదు. కనీసం నిఘా కెమెరాలు లేకపోవడం గమనార్హం. కోట్లవారిపల్లె సమీపంలో పెద్ద ఎత్తున పౌడర్‌ పరిశ్రమలు ఉన్నాయి. మల్కాపురం నుంచి వచ్చే డోలమైట్‌, ఇతర ఖనిజాలు ఈ చెక్‌పోస్టు సమీపం నుంచే పరిశ్రమలకు వెళ్తుంటాయి. రాయల్టీలు లేకుండా ట్రాక్టర్లలో తరలిస్తున్నా అడిగేవారు లేరు.

భయపెడుతున్న పేలుళ్లు

చిన్నమల్కాపురం పరిధిలోని పలు గనుల్లో నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు చేపడుతున్నారు. గనుల్లోని కింది భాగంలో ట్రాక్టర్ల కాంప్రెషర్ల ద్వారా పేలుడు పదార్థాలతో తవ్వుతున్నారు. దీంతో గ్రామంలో ఇళ్లు బీటలు బారుతున్నాయి. ‘బీ’ విభాగం కిందకొచ్చే ఖనిజాలకు బ్లాస్టింగ్‌కు అనుమతులు లేకపోయినా పేలుళ్లు సాగిస్తున్నారు. ఈ ప్రాంతం రైల్వే ట్రాక్‌ సమీపంలోనే ఉండటం గమనార్హం. పేలుళ్ల (బ్లాస్టింగ్‌)కు ఉపయోగించే పదార్థాలు పట్టపగలే సంచుల్లో గనుల ప్రాంతానికి తరలిస్తున్నారు. పేలుడు పదార్థాల రవాణాకు డోన్‌ పరిధిలో ఒక్కరికే అనుమతులున్నట్లు సమాచారం. కానీ చాలా మంది సరఫరా చేస్తున్నారు. పోలీస్‌, రెవెన్యూ, గనుల శాఖ అధికారులు తనిఖీలు చేయాల్సి ఉన్నా.. అటువైపు కన్నెత్తి చూడటం లేదు.

ప్రమాదకరంగా తోడేస్తున్నారు

  •  మైనింగ్‌ నిర్వహించేందుకు బీ కేటగిరీ గనుల్లో రోజుకు 50-100 టన్నులు తవ్వకాలు చేపట్టవచ్చు. ఏ కేటగిరీలో ఖనిజాన్ని బట్టి 300-500 టన్నుల వరకు తవ్వకాలు చేపట్టే విధంగా అధికారులు అనుమతులు ఇస్తారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి రెట్టింపు స్థాయిల్లో తవ్వేస్తున్నారు.
  • గనుల్లో తవ్వకాలు చేపట్టేప్పుడు అక్కడున్న ఖనిజ పరిస్థితిని బట్టి 3 మీటర్ల నుంచి 9 మీటర్ల వరకు బెంచ్‌ కటింగ్‌ చేపట్టాలి. మల్కాపురం పరిధిలో లీజులున్న గనుల్లోనూ ఈ విధానం ఎక్కడా అమలు కావడం లేదు. ఇక్కడ 60 నుంచి 100 అడుగుల లోతులో తవ్వకాలు చేపడుతున్నారు.
  • వందల అడుగుల లోతులోకి తవ్వకాలు సాగిస్తూ, నిబంధనలు అతిక్రమిస్తున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. దీనివల్ల పైప్రాంతం పగుళ్లు వచ్చి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. బెంచ్‌ కటింగ్‌ పద్ధతిని విస్మరించి తవ్వకాలు చేపట్టినచోట పైభాగం కూలిపోయి రాళ్లు పడి పలువురు మృతి చెందిన ఘటనలున్నాయి.  

హత్యలు.. అనుమానాస్పద మృతులు

  •  డోన్‌ మండలంలోని కొచ్చెర్వు గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి మైనింగ్‌మాఫియా చేతిలో 2023లో కిరాయి హత్యకు గురయ్యారు. డోన్‌ పరిధిలో జరిగే అక్రమమైనింగ్‌ విషయాలను అధికారులకు చేరవేస్తున్నారనే నెపంతో మైనింగ్‌ వ్యాపారులు ఆయన్ని కిరాయి హత్య చేయించారంటున్నారు. అప్పట్లో ఈ హత్య జిల్లాలోనే సంచలనంగా మారింది.
  • 2021 డిసెంబరులో కొచ్చెర్వు ప్రాంతంలోని ఓ గనిలో నిబంధనలు లేకుండా జేసీబీతో తవ్వకాలు జరుపుతుండటంతో బండరాళ్లు మీద పడి ఓ యువకుడు మృతి చెందారు. కొందరు అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకుని ఈ కేసును పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి.
  • ప్యాపిలి మండలంలో ఆరునెలల కిందట బావిపల్లె వద్ద ఓ గనిలో తవ్వకాలు జరుపుతుండగా ట్రాక్టర్‌ డ్రైవర్‌ ప్రమాదవశాత్తు మరణించారు. కానీ ఈ మృతిపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో నిజాలు బయటికి రాకుండా కేసును మూసివేశారంటున్నారు.
  •  2023లో చిన్నమల్కాపురంలోని ఓ గనిలో వంద అడుగుల లోతులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వచ్చి మృతిచెందటం సంచలనంగా మారింది. ఇలా గనుల ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చినవి కొన్ని మాత్రమే ఉంటున్నాయి. ఎన్నో అక్రమాలు, మరణాలు, లోగుట్టుగానే జరుగుతున్నా..విచారణలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయనే విమర్శలు రేగుతున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని