logo

మల్లన్న సాక్షిగా ఉత్తుత్తి శంకుస్థాపనలు

శ్రీశైలంలో శాశ్వత అభివృద్ధి పనులకు వైకాపా తన అయిదేళ్ల పాలనలో ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది. రివర్స్‌ పాలన చేస్తున్న నేపథ్యంలో భక్తులకు కష్టాల్నే మిగిల్చింది.

Published : 04 May 2024 04:24 IST

నాలుగు నెలలైనా ప్రారంభించని అభివృద్ధి పనులు
దేవాదాయశాఖలో రివర్స్‌ పాలనకు నిదర్శనం

శ్రీశైలంలో టెండర్లు పిలవకుండా రూ.215 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి (పాత చిత్రం)

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైలంలో శాశ్వత అభివృద్ధి పనులకు వైకాపా తన అయిదేళ్ల పాలనలో ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది. రివర్స్‌ పాలన చేస్తున్న నేపథ్యంలో భక్తులకు కష్టాల్నే మిగిల్చింది. ఆర్భాటంగా శంకుస్థాపనలు చేస్తూ తర్వాత వాటి సంగతి మంత్రి కొట్టు సత్యనారాయణ మర్చిపోతున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో రూ.215 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన పలుసార్లు శంకుస్థాపనలు చేశారు. మంత్రి కొట్టు నెలవారీ పర్యటనలు చేసి అరచేతిలో వైకుంఠం చూపించారు.శ్రీశైల దేవస్థానానికి 2010లో మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదించారు. దినదినాభివృద్ధి చెందుతున్న జ్యోతిర్లింగ క్షేత్రం కావడంతో భక్తుల రద్దీకి అనుగుణంగా శాశ్వత అభివృద్ధి పనులు చేయడానికి అప్పట్లో దేవాదాయశాఖ నడుం బిగించింది. కాంగ్రెస్‌, తెదేపా ప్రభుత్వాల హయాంలో మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా శ్రీశైలంలో సుమారు రూ.200 కోట్లకు పైగా భూగర్భ మురుగునీటి వ్యవస్థ, తాగునీరు, రింగ్‌రోడ్డు, స్నానఘాట్ల విస్తరణ, దుకాణాల సముదాయాలు, డార్మెటరీలు, వసతిగదులు వంటి సదుపాయాలు చేపట్టారు. 2019లో వైకాపా ప్రభుత్వంలో మాత్రం శ్రీశైలంలో శాశ్వత పనుల ఊసే లేకపోయింది. వైకాపా ప్రభుత్వంలో వెల్లంపల్లి శ్రీనివాస్‌, కొట్టు సత్యనారాయణ దేవాదాయశాఖ మంత్రులుగా వ్యవహరించారు. వీరిద్దరూ ఐదేళ్ల పాటు ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలం గడిపారు.

ప్రగతి జాడేది

బాధ్యతలు చేపట్టిన మూడేళ్లు శాశ్వత అభివృద్ధి పనుల జాడే లేదు. ఆ తర్వాత దేవాదాయశాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ (ఉప ముఖ్యమంత్రి హోదాలో) ప్రతి నెలా శ్రీశైలం వచ్చి సమీక్షలు నిర్వహించారు. 2023 ఆగస్టులో నూతన క్యూ కాంప్లెక్స్‌, సాలు మండపాలు, ఇతర పనులకు టెండర్లు పిలిచారు. కానీ సకల శాఖల సలహాదారు నుంచి ఒత్తిళ్లు రావడంతో ఆ టెండర్లను అప్పటి ఈవో లవన్న అర్ధంతరంగా రద్దు చేశారు. ఆ తర్వాత గతేడాది డిసెంబరు 27న కొట్టు సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కలిసి శ్రీశైలంలో రూ.215 కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్‌, సాలు మండపాలు, 200 గదులతో యాత్రికుల వసతి సముదాయం, శివసేవకుల భవనం, 1 మెగా వాట్‌ సోలార్‌ వాటర్‌ ప్లాంట్‌, సబ్‌స్టేషన్‌, సీసీ రోడ్లు, నీళ్ల ట్యాంకుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కానీ పనులు మాత్రం నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీనికి కారణం ప్రతిపాదిత అభివృద్ధి పనులన్నింటికీ ముందస్తుగా దేవాదాయశాఖ ముఖ్య ఇంజినీరు నుంచి సాంకేతిక అనుమతులు తీసుకొని టెండర్లు పిలవాలి. మంత్రి ఈ నిబంధనలు ఏమాత్రం పట్టించుకోలేదు. దేవాదాయశాఖ కమిషనర్‌, ముఖ్య ఇంజినీరు నుంచి ఎటువంటి అనుమతులు రాకుండానే రూ.215 కోట్ల పనులకు మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపనలు చేసి రివర్స్‌ పాలనకు నిదర్శనంగా నిలిచారు. శంకుస్థాపనలు చేసిన తర్వాత రూ.75 కోట్ల అంచనాలతో నూతన క్యూ కాంప్లెక్స్‌, రూ.35 కోట్ల అంచనాలతో సాలు మండపాల నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పిలిచారు. ఈ రెండు పనులకు కూడా ఇప్పటికీ దేవాదాయశాఖ కమిషనర్‌ నుంచి అనుమతుల ఖరారుకు శ్రీశైలం అధికారులు ఎదురుచూస్తున్నారు. మిగిలిన పనులకు ఎటువంటి టెండర్లు పిలవకుండా శంకుస్థాపనలు చేసేసి చేతులు ఎత్తేశారు.

మంత్రి.. డాంభికాలు

వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో రూ.వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి డాంభికాలు పలికారు. కానీ మంత్రి కొట్టు సత్యనారాయణ చేసిన శంకుస్థాపనల వ్యవహారాన్ని పరిశీలిస్తే ఉత్తుత్తి శంకుస్థాపనలుగా తేలిపోయాయి. గతేడాది డిసెంబరులో శంకుస్థాపనలు చేసినా.. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ వచ్చే లోపు పనులకు అనుమతులకు నోచుకోకపోవడం వైకాపా పాలనకు అద్దం పట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని