logo

జగనాసుర ‘చట్టం’

ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం-2023పై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ చట్టంపై న్యాయవాదులు సుదీర్ఘకాలం పోరాటం చేసి హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చినా రాష్ట్రప్రభుత్వం

Updated : 04 May 2024 05:15 IST

కర్నూలు న్యాయవిభాగం, గాయత్రీ ఎస్టేట్‌, ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం-2023పై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ చట్టంపై న్యాయవాదులు సుదీర్ఘకాలం పోరాటం చేసి హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చినా రాష్ట్రప్రభుత్వం అమలుచేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూవివాదాలను కోర్టులో పరిష్కరించుకునే హక్కును వైకాపా ప్రభుత్వం కాలరాసింది. భూ సర్వే పూర్తి చేయకుండా చట్టం చేయటంపై పలువురు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టంతో ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


రెవెన్యూ అధికారుల చేతిల్లోకి.. - సుందర్‌సింగ్‌ 

 అధ్యక్షుడు, ఆదోని బార్‌ అసోసియేషన్‌

భూ హక్కు చట్టంతో ప్రజలకు అన్యాయం జరుగుతుంది. రెవెన్యూ అధికారుల చేతిలోని ఈ చట్టం వెళ్తుంది. దీంతో రాజకీయ నాయకులు ప్రవేశించే ప్రమాదం ఉంది. పారదర్శకత ఉండదు. ఇప్పటివరకు విధి విధానాలు అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తే ఆందోళన చేస్తాం.  


కోర్టు ధిక్కారమే - ఎం.వి.చక్రపాణి, జిల్లా బార్‌

అసోసియేషన్‌ మాజీ కార్యదర్శి

రెవెన్యూ అధికారులకు పెత్తనం అప్పగించి ప్రజలకు నష్టం కలిగించే ఈ చట్టాన్ని రద్దు చేయాలని జిల్లా న్యాయవాదులమంతా పోరాటం చేశాం. చట్టానికి వ్యతిరేకంగా పిల్‌ దాఖలు చేస్తే హైకోర్టు స్టే ఇచ్చినా ప్రభుత్వం చట్టాన్ని అమలుచేయడం కోర్టు ధిక్కారమే. ప్రభుత్వ తీరుపై మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తాం.


పాసు పుస్తకంపై జగన్‌ బొమ్మ ఎందుకు..

- కేసీ రాముడు, న్యాయవాది

భూయాజమాన్య పత్రాలపై జగన్‌ చిత్రం వేయడం తగదు. న్యాయపరమైన తీర్పులు చెప్పే బాధ్యతలను రెవెన్యూ అధికారులకు అప్పగించటం ద్వారా అధికార పార్టీ నేతలు తమకు అనుకూలమైన టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారిని నియమించుకుని దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంది. రెవెన్యూ అధికారులు యాజమాన్య హక్కులు నిర్ధారించటం ప్రమాదకరం.


ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనే.. - బి.కృష్ణమూర్తి,

జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. ఈ చట్టం అమలుతో భూయజమానులు.. వారికి తెలియకుండానే ఆస్తులపై హక్కులు కోల్పోతారు. అందుకే ఈ చట్టాన్ని మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఈ చట్టం అమలు చేయటం కచ్చితంగా కోడ్‌ ఉల్లంఘనే. ఎన్నికల కమిషన్‌ వెంటనే చర్యలు తీసుకుని దీనిని తక్షణమే రద్దు చేయాలి.


కేసు దాఖలు చేసేదెలా?

- తాయన్న, న్యాయవాది ఆదోని

భూ హక్కు చట్టం అమలైతే వివాదం తలెత్తినపుడు సివిల్‌ కోర్టులో కేసులు దాఖలు చేసే అవకాశం ఉండదు. భూ హక్కు చట్టానికి సంబంధించి అధికారిని ఇంతవరకు నియమించలేదు. అప్పీలకు హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. రైతులకు ఆర్థిక భారం పెరుగుతుంది. ఈ చట్టం లోపభూయిష్టంగా ఉంది. తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా రెండో సంతకం కింద భూ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పడం హర్షణీయం.


అధికార పార్టీ ఆదేశాలే అమలు - వీరన్న నాయుడు

న్యాయవాది, ఆదోని

భూ హక్కు చట్టంలో అధికార పార్టీ ఆదేశాలతో అధికారులు నడచుకునే ప్రమాదముంది. రాజకీయ పలుకుబడి ఉన్నవారికి న్యాయం జరుగుతుంది. పేదలు, అమాయకులకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ. కొందరు రెవెన్యూ అధికారుల తప్పిదాలతో  రైతులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. చట్టాన్ని రద్దు చేయాలి. .


వెంటనే ఆపేయాలి - రవికాంత్‌ప్రసాద్‌,

జిల్లా బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి

ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం ప్రకారం రెవెన్యూ అధికారులే యాజమాన్య హక్కులు నిర్ధారిస్తారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చట్టం. చట్టం అమలుకు సంబంధించి మెమో జారీ చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. విధివిధానాలు తెలియజేయకుండా.. స్పష్టత ఇవ్వకుండా అమలు చేసిన ఈ చట్టాన్ని వెంటనే ఆపేయాల్సిన అవసరం ఉంది.


ఇదో అసంబద్ధమైన చట్టం - నాగేంద్రనాథ్‌

న్యాయవాది

అసెంబ్లీలో హేతుబద్ధమైన చర్చ జరపకుండా చట్టం అమలు చేయటం దారుణం. ఇది పూర్తిగా అసంబద్ధమైన చట్టం. రెవెన్యూ దస్త్రాలను నవీకరించకుండా, సర్వే చేయకుండా అమలుచేయడం దారుణం. వారసత్వాన్ని అధికారులే నిర్ధారిస్తే ఎలా.. ఈ చట్టం కారణంగా భూవివాదాలు మరిన్ని పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. న్యాయ కార్యదర్శిగానీ.. రెవెన్యూ కార్యదర్శిగానీ ఈ చట్టంపై మాట్లాడకుండా అనర్హులైన ప్రభుత్వ సలహాదారుడితో మాట్లాడించడం సరైంది కాదు. ఈ చట్టం అమలును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని