logo

యువత కలలకు రెక్కలు తొడుగుతాం

ఈసారి ఎన్నికల్లో 40 లక్షల మంది తొలిసారి ఓటేయబోతున్నారు.. ‘యువ’ తీర్పుతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి..

Published : 04 May 2024 04:50 IST

ప్రజల కష్టాల్లొంచి వచ్చిందే కూటమి మ్యానిఫెస్టో
ముస్లింలను గుండెల్లో పెట్టుకుంటాం
యువగళం సభలో నారా లోకేశ్‌

మాట్లాడుతున్న లోకేశ్‌..

ఈనాడు-నంద్యాల: ఈసారి ఎన్నికల్లో 40 లక్షల మంది తొలిసారి ఓటేయబోతున్నారు.. ‘యువ’ తీర్పుతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం డీఎస్సీ ప్రకటనపైనే ఉంటుంది.. యూనిఫైడ్‌ పోర్టల్‌, ఉద్యోగ ప్రకటన తెస్తాం.. ప్యూన్‌ నుంచి గ్రూప్‌-1 వరకు సింగిల్‌ నోటిఫికేషన్‌తో క్యాలెండర్‌ ఇస్తాం.. ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని ఐదేళ్లలో భర్తీ చేస్తాం.. యువత కలలకు రెక్కలు తొడుగుతామని  తెదేపా యువ నాయకుడు నారా లోకేశ్‌ యువతరానికి భరోసా ఇచ్చారు. నంద్యాల పట్టణంలో రాణిమహారాణి మైదానాంలో శుక్రవారం ‘యువగళం’ సభ నిర్వహించారు. సభకు పెద్ద ఎత్తున యువతర తరలొచ్చింది.. వారడిగిన పలు ప్రశ్నలకు నారా లోకేశ్‌ సమాధానాలు ఇచ్చారు.. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగానే కూటమి మ్యానిఫెస్టో తయారైందన్నారు. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు. జైన్‌ ఇరిగేషన్‌, మెగా సీడ్‌ పార్కు, సోలార్‌ పవర్‌, ఉర్దూ యూనివర్సిటీ తెదేపా తెచ్చిందే. జగన్‌ మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మూడు రాజధానులని కర్నూలులో ఒక్క ఇటుక వేయలేదు. అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం.

స్వీయచిత్రం తీసుకుంటూ..


యువకుడు: మీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లను తీసేస్తామంటున్నారు. వారి జీతాలు పెంచాలి.
నారా లోకేశ్‌: వాలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తాం. వారి జీతాలను  రూ.10 వేలకు పెంచుతాం.     వారిని ప్రజాప్రతినిధులతో అనుసంధా నిస్తాం. అప్పుడే మెరుగైన సంక్షేమ పథకాలు అందించగలం.


వైష్ణవి: అమరావతిని రాజధాని చేస్తామంటున్నారు.. విశాఖలో ఐటీ అంటున్నారు.. మరీ కర్నూలు పరిస్థితి ఏమిటి సార్‌ ?
నారా లోకేశ్‌: కర్నూలును హార్టికల్చర్‌ హబ్‌గా చేస్తాం. రెన్యూవబుల్‌ ఎనర్జీని ప్రోత్సహిస్తాం. సిమెంట్‌ పరిశ్రమలు తీసుకొస్తాం. జైన్‌ ఇరిగేషన్‌ సీడ్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తాం. లాజిస్టిక్‌ హబ్‌గా చేసే బాధ్యత తీసుకుంటాం. ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలు చేస్తే.. వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది. మేం వచ్చాక మళ్లీ తీసుకొస్తాం. బడుగు, బలహీన వర్గాలకు ఇబ్బంది లేకుండా చూస్తాం.


రాధిక: మాకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ కావాలి.
నారా లోకేశ్‌: జగన్‌ ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన తీసుకొచ్చి యువతను ఇబ్బందులు పెడుతోంది. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలు ఉండటంతో కళాశాల యాజమాన్యాలు ధ్రువపత్రాలు ఇవ్వడం లేదు. పాత ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ విధానం అమలు చేస్తాం. చదువుకు మా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. విదేశీ విద్య పథకాలు మళ్లీ తీసుకొస్తాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.


నిఖిల్‌: ఎంబీఏ పూర్తి చేశా. అమెరికాకు సిలికాన్‌ వ్యాలీ ఎలాగో దేశానికి బెంగళూరు అలా తయారైంది. ఏపీలోనూ అలాంటి సిటీని తయారు చేయగలరా?
నారా లోకేశ్‌: ఏపీ అంటే కియా గుర్తుకు వస్తుంది. ఏనాడైనా ఊహించామా? చంద్రబాబు నాయుడు ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రాధాన్యం ఇచ్చారు. ఎకో సిస్టమ్‌ తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పించారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలులో చేశాం. ఇంకా చేయాల్సి ఉంది. పోర్టులు, ఫిషరీస్‌, డిఫెన్స్‌ తీసుకురావచ్చు. ఆ విధానం మళ్లీ తీసుకువస్తాం.


యువతి: వైకాపా నేతల వేధింపులతో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మైనార్టీలు చాలా బాధపడ్డారు. మీరు అధికారంలోకి వస్తే నేరాలను ఎలా అదుపు చేస్తారు?
నారా లోకేశ్‌: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గురజాల నియోజకవర్గంలో మైనార్టీ బాలికపై అత్యాచారం జరిగితే పోలీసులను వెంటనే అప్రమత్తం చేశారు. ఎన్ని పోలీసు బలగాలు కావాలో తీసుకోమన్నారు. దీంతో 24 గంటల్లో నిందితుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. చంద్రబాబు అంటే రౌడీలకు, స్మగ్లర్లకు భయం.  అబ్దుల్‌ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్యకు కారణం వైకాపా నాయకుల వేధింపులే. పలమనేరులో మిస్బా అనే విద్యార్థి ఆత్మహత్యకు వైకాపా నేతలే కారణం. ఇప్పటికీ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. నిందితులపై కేసు కూడా పెట్టలేదు.

యువగళం సభకు హాజరైన పలువురు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని