logo

సూపర్‌ సేవలకు ‘ప్రైవేటు’కు రండి

సర్వజన ఆసుపత్రిలో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలందిస్తామంటూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఏకంగా ప్రచార పత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు.

Updated : 04 May 2024 05:13 IST

నంద్యాల సర్వజన ఆసుపత్రి వైద్యుల తీరు

ప్రైవేట్‌ ఆసుపత్రికి రావాలని ఇచ్చిన పత్రాన్ని చూపుతున్న మహేశ్‌

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే : సర్వజన ఆసుపత్రిలో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలందిస్తామంటూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఏకంగా ప్రచార పత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. వాటిని చూసి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులను వైద్యులు పరీక్షించి తమ ప్రైవేటు ఆసుపత్రికి రావాలని చెబుతున్నారు. ఓ వైద్యుడు ఏకంగా ఆసుపత్రి ఓపీలోనే ప్రైవేటు ఆసుపత్రి వివరాలతో కూడిన చిరునామా పత్రాలను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో అన్ని పరీక్షలు చేయించిన తర్వాత సమస్య ఏంటో రోగులకు చెప్పడం లేదు. తమ ఆసుపత్రికి వస్తేనే మీ ఆరోగ్య సమస్య ఏంటి? దానికి పరిష్కారం చెబుతామని చిరునామా పత్రాన్ని ఇస్తున్నారు. అక్కడికెళితే వేలకు వేలు దోచుకుంటారని రోగులు ఆందోళన చెందుతున్నారు.

  • నంద్యాల సర్వజన ఆసుపత్రిలో ఇటీవల నరాలకు సంబంధించిన న్యూరోసర్జన్‌, ఫిజీషియన్‌, మూత్రపిండాలకు సంబంధించి యూరాలజీ, నెఫ్రాలజీ వైద్యులను నియమించి కొంత మేరకే సూపర్‌ స్పెషాలిటీ ఓపీ సేవలు అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే తన ఎన్నికల ప్రచార ప్రతాల్లో ముద్రించి వీధి వీధిలో ప్రజలకు పంచుతున్నారు. దీంతో రోగుల సంఖ్య పెరిగింది. దీన్ని అవకాశంగా మల్చుకోవాలని భావించిన వైద్యుడు రోగులను తన ప్రైవేటు ఆసుపత్రికి రావాలని ఒత్తిడి చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. సర్వజన వైద్యశాలలో పనిచేసే సిబ్బందికి సైతం తన ఆసుపత్రికొస్తే మెరుగైన చికిత్స అందిస్తానని చెబుతుండటం గమనార్హం.

డబ్బు లేకనే కదా ప్రభుత్వాసుపత్రికి వచ్చేది - మహేశ్‌, నంద్యాల

నాకు వెన్ను నొప్పి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో నరాల వైద్యుడు ఉన్నారని మూడు రోజుల కిందట వచ్చాను. వైద్యుడు పరీక్షించి ఎమ్మారై స్కానింగ్‌ చేయించారు. సమస్య చెప్పమంటే తన ప్రైవేటు ఆసుపత్రి చిరునామా పేపరు ఇచ్చి అక్కడికొస్తేనే చెబుతా అంటున్నారు. అక్కడికి వెళితే ఓపీనే రూ.500 ఉంటుంది. అంత డబ్బు లేకనే కదా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాను. ప్రభుత్వ ఆసుపత్రిలో జీతం తీసుకుంటూ ప్రైవేటుగా వైద్యం చేస్తాననడం దారుణం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని