logo

జగన్ జమానా.. దక్కని న్యాయం.. ఆగని దుఃఖం

శ్రీశైలం జలాశయం నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్‌ మాట తప్పారు.

Published : 04 May 2024 04:22 IST

కొలువుల కోసం శ్రీశైలం జలాశయం నిర్వాసితుల పోరాటం

నందికొట్కూరు, న్యూస్‌టుడే : శ్రీశైలం జలాశయం నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్‌ మాట తప్పారు. ఐదేళ్లు గద్దెపైన ఉన్న ఆయన ఒక్కరికీ కొలువు ఇవ్వలేదు.. కనీసం వాలంటరీగా పని చేసే అవకాశం కల్పించలేదు. నిర్వాసితులు 2021 సెప్టెంబరులో వందరోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వైకాపా మంత్రుల కార్లను అడ్డుకొని గోడు విన్నవించుకున్నారు. జీవో 98 ప్రకారం నిర్వాసితుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి.. గత తెదేపా హయాంలో 965 మందికి ఒప్పంద కార్మికులుగా అవకాశం ఇచ్చారు.. వీరిలో 150 మంది క్రమబద్ధీకరణ జరిగింది. మిగిలిన బాధితులు ఏళ్లుగా కొలువు పోరాటం చేస్తూనే ఉన్నారు. వైకాపా ప్రభుత్వం నిర్వాసితులను పట్టించుకోలేదు.. ‘ఓటు’తో గుణపాఠం చెబుతామని నిర్వాసిత కుటుంబాలు పేర్కొంటున్నాయి.

ధర్నా చేస్తున్న నిర్వాసితులు

66 గ్రామాలు ఖాళీ చేయించారు

శ్రీశైలం జలాశయం నిర్మాణానికి 1965లో పునాది వేశారు. 1984లో జాతికి అంకితం చేశారు. నిర్మాణ సమయంలో కర్నూలు, నందికొట్కూరు, శ్రీశైలం(ఆత్మకూరు) నియోజకవర్గాల్లోని 66 గ్రామాల్లో 32 వేల కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. 85వేల ఎకరాలు నది గర్భంలో కలిసింది. ఒక్క పైసా పరిహారం ఇవ్వకుండా పోలీసు బందోబస్తు నడుమ గ్రామాలను ఖాళీ చేయించారు. ఆదుకోవాలంటూ నిర్వాసితులు 1986 నుంచి ఆందోళన చేస్తున్నారు. దిగొచ్చిన ప్రభుత్వం ఆయా కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని జీవో 98ను తీసుకొచ్చారు. అనంతరం 1994లో ఎకరాకు రూ.500 నుంచి రూ.1000 చొప్పున పరిహారం అందించారు. 1965 కుటుంబాల్లో చదువుకొన్న యువకులు కొలువుల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. నిర్వాసితులు నందికొట్కూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారు.

మునక భూములపై అధికారం కన్ను

శ్రీశైలం జలాశయం మునక భూములపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలో 63 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వీటి పరిధిలోని సుమారు 35 వేల ఎకరాలు మునిగింది.. జులై నుంచి నవంబరు వరకు వెనుక జలాలు ఉంటాయి. తర్వాత కృష్ణానదిలో క్రమంగా నీరు తగ్గిపోతుంది. ఆ సమయంలో నిర్వాసితుల్లో కొందరు ఏటా పంటలు సాగు చేస్తున్నారు. అవి సారవంతంగా ఉండటంతో పంటల దిగుబడి అధికంగా ఉంటుంది. దీంతో అధికార పార్టీ నాయకులు రంగ ప్రవేశం చేసి.. పంచాయితీలు చేస్తున్నారు. అనధికారికంగా పొలాలను విక్రయిస్తున్నారు. కొత్తపల్లి మండలంలోని జానాలగూడెం, బలపాలతిప్ప, సిద్ధేశ్వరం గ్రామాల్లో నివసిస్తున్న వారు సుమారు 1300 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు. ఓ బడారైతు వాటిని ఆక్రమించుకుని సాగు ప్రారంభించారు. అనంతరం పట్టణ ప్రాంతానికి నివాసం మార్చిన ఆయన ఆ పొలాలను కౌలుకు ఇచ్చి డబ్బులు వసూలు చేసుకునేవారు. తమ పొలాలు తామే సాగు చేసుకుంటామని రైతులు డిమాండ్‌ చేయగా అందుకు ఆయన ఒప్పుకోలేదు. దీంతో రాజకీయ నాయకులు పంచాయితీలు చేశారు.

ఆగని పోరాటం

కొలువులు ఇస్తామని ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ నిర్వాసితులందరికీ న్యాయం దక్కలేదు. 965 మందికి ఒప్పంద పద్ధతిలో లస్కర్లుగా పనిచేసే అవకాశం కల్పించారు. మిగిలిన వారు కొలువు పోరాటం చేస్తూనే ఉన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన కొత్తలో గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది. వాటిలో అవకాశం కల్పించాలని పోరాటం చేసి అలసిపోయారు. ఒప్పంద పద్ధతిలో ఉద్యోగం పొందిన వారు క్రమబద్ధీకరణ కోసం విన్నవిస్తున్నారు. ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, పునరావాస ప్రయోజనాలు కల్పించకపోవడంతో చాలా మంది దర్జీలు, కౌలుదారులు, ఎల్‌ఐసీ ఏజెంట్లు, దుకాణాలు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ‘కొలువు’దీరిన తర్వాత పెళ్లిచేసుకుందామని బ్రహ్మచారులుగా మిగిలిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

హామీని అమలు చేయాలి

- మల్లికార్జునరెడ్డి, నిర్వాసితుడు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గత ఎన్నికల ముందు బాధితులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. దీనిపై పలుమార్లు మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించినా ఫలితం లేదు. కనీసం వాలంటరీ ఉద్యోగం కూడా ఇవ్వలేదు.

ఎవరూ పట్టించుకోవడం లేదు

- భానుప్రసాద్‌, నిర్వాసితుడు

ఓట్ల సమయంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మించి ఓటు వేయించుకున్నా జగన్‌ తర్వాత దాని ఊసే ఎత్తలేదు. ఉద్యోగాలు రాక 1000 కుటుంబాలున్నాయి. ఒక్కో ఇంట్లో 3 నుంచి 5 ఓట్ల చొప్పున సుమారు 4వేల ఓట్లున్నాయి. ఉద్యోగం ఇవ్వాలని పోరాడుతూ.. జీవనం కోసం వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని