logo

పొలం గట్టున జగన్‌ కనికట్టు

అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని పండగ చేస్తామన్నారు.. విత్తు నుంచి మొదలు విక్రయం వరకు రైతుకు ప్రతి దశలో తోడుగా ఉంటామన్నారు. గద్దెనెక్కారు.. ‘ కర్షక’ పథకాలకు కోత పెట్టారు..

Updated : 04 May 2024 05:09 IST

ఆరుగాలం శ్రమించే అన్నదాతకు.. కనీస మద్దతు ధర రూపాయి పెంచలేదు. పంటల బీమా ప్రీమియాన్ని చెల్లిస్తామన్నారు.. అధికారంలోకి వచ్చాక.. నిబంధనల కత్తి అందుకున్నారు.. బోర్లు ఉచితంగా తవ్విస్తామని ప్రకటించారు. మోటార్లకు విద్యుత్తు భారాన్ని అన్నదాతలపై మోపారు.

ఇలా చెప్పుకొంటూ పోతే ఐదేళ్లలో అన్నదాతను జగన్‌ నిలువునా ముంచారు.

న్యూస్‌టుడే, కర్నూలు వ్యవసాయం: అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని పండగ చేస్తామన్నారు.. విత్తు నుంచి మొదలు విక్రయం వరకు రైతుకు ప్రతి దశలో తోడుగా ఉంటామన్నారు. గద్దెనెక్కారు.. ‘ కర్షక’ పథకాలకు కోత పెట్టారు.. పాలకులు ‘కాడి’ వదిలేయడంతో అన్నదాతలు అప్పులు ఊబిలో చిక్కుకున్నారు.

1.50 లక్షల మందిని రైతు భరోసాకు దూరం చేశారు.


2023-ఖరీఫ్‌ పంట నష్టం (రూ.460.57 కోట్లు) పైసా ఇవ్వలేదు.


ఐదేళ్ల కిందట మంజూరైన రూ.659.40 కోట్ల పంట పరిహారాన్ని మళ్లించారు


వాటాకు ఎగనామం పెట్టడంతో 3 లక్షల మంది పంట రుణాలపై ఏడే శాతం వడ్డీ భరిస్తున్నారు.


బలవన్మరణం పొందిన రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు అందడం లేదు.


ఐదేళ్లలో 2-3 లక్షల మంది రూ.400 కోట్ల బీమా పరిహారం పొందలేకపోయారు.


1.03 లక్షలమంది కౌలు రైతులకు రైతు భరోసా సాయం ఎగనామం పెట్టారు.


కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఒక్కో క్వింటాపై   రూ.1000  నష్టపోయారు.


ఉచిత బోర్లకు మోటార్లు ఇవ్వకుండా రైతులపై భారం మోపారు.


బీమా.. డ్రామా

హామీ: రైతు నయా పైసా కట్టకుండా వారి వాటా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా ప్రతి రైతుకు అందిస్తాం.
వాస్తవం: ఉమ్మడి జిల్లాలో 7.40 లక్షల మంది రైతులున్నారు. రెండు సీజన్లో కలిపి 10.36 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి.
2022-23 రబీ పంటల బీమా పరిహారం గత డిసెంబరులో ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదు. 2019 నుంచి 2022లో పంటల బీమా పరిహారం ఇచ్చింది రూ.1,051 కోట్లు మాత్రమే. కానీ క్రాప్‌ బుకింగ్‌ పరిధిలోకి రాని, పంటల నమోదైనా కొన్ని పంటలకు బీమా పరిహారంలో కోత విధించడం తదితర కారణాలతో నష్టపోయిన రైతులు ఏటా 50-70 వేల మంది చొప్పున నాలుగేళ్లలో 2-3 లక్షల మంది సుమారు రూ.400 కోట్ల మేర బీమా పరిహారం పొందలేకపోయారు.

1.50 లక్షల మందికి రైతు భరోసా సున్నా

హామీ: రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 చొప్పున ఇస్తాం.!!
వాస్తవం: జగన్‌ అధికార గద్దెనెక్కిన తర్వాత మరో రూ.వెయ్యి పెంచి రూ.13,500 ఇస్తామని గొప్పలు చెప్పారు. పీఎం కిసాన్‌ కింద కేంద్రం ఏటా ఇచ్చే రూ.6 వేలు కాక.. వైకాపా ప్రభుత్వం రూ.7,500 మాత్రమే ఇస్తోంది. రూ.13,500 చొప్పున ఒక్కో లబ్ధిదారుడికి రూ.67,500 అందాల్సి ఉండగా.. రూ.37,500 ఇచ్చి రూ.30 వేలు కోత పెట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 5.60 లక్షల మందికి అందాల్సి ఉండగా 1.50 లక్షల మందికి కోత పెట్టారు.

ఉచిత బోర్లు ఉఫ్‌

హామీ: రైతుకు నయాపైసా ఖర్చు లేకుండా వైఎస్సార్‌ జలకళ పథకంలో ఉచితంగా బోర్లు వేయిస్తాం.
వాస్తవం: గడిచిన నాలుగేళ్లల్లో కర్నూలు జిల్లాలో 1,516, నంద్యాలలో 2,138 కలిపి మొత్తం 3,654 బోర్లు వేశారు. వేసిన బోర్లకు కరెంటు కనెక్షన్లు, మోటార్లు బిగించడం అంతంత మాత్రమే. కేవలం 220 బోర్లకు మాత్రమే విద్యుత్తు మోటార్లు బిగించారు.

కౌలుకోకుండా చేశారు

హామీ: కౌలు రైతులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా పంట రుణాలు,  రైతు భరోసా పెట్టుబడి సాయం అందిస్తాం.
వాస్తవం: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 41,493 మంది కౌలుదారులకు సీసీఆర్‌సీ సాగు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. సీసీఆర్‌సీ కార్డులు కలిగిన వారందరికీ బ్యాంకుల్లో వ్యక్తిగతంగా రుణాలు ఇప్పిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో రూ.220 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఏడాదిలో 649 మంది కౌలుదారులకు రూ.6.86 కోట్లు ఇప్పించారు. సీసీఆర్‌సీ కార్డులు కలిగిన 40,844 మందికి బ్యాంకుల్లో అటు ఖరీఫ్‌, ఇటు రబీల్లో రుణాలు ఇప్పించలేకపోయారు.  
‘‘ ఉమ్మడి జిల్లాలో రూ.1.20 లక్షల మంది కౌలు రైతులుంటే 41,493 మందికే సీసీఆర్సీ కార్డులు అందజేశారు. రైతులను కులాల వారీగా విభజించి కేవలం 17 వేల మందికే రైతు భరోసా పెట్టుబడి సాయం అందించింది.

పావలా వడ్డీ ఎత్తివేత

హామీ: రైతన్నలకు వడ్డీలేని పంట రుణాలిస్తాం!
వాస్తవం: పంట రుణాలకు తెదేపా ప్రభుత్వంలో రూ.లక్ష వరకు సున్నా వడ్డీ, రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పావలా వడ్డీ అమలు చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వర్తించే వడ్డీ రాయితీని నిలిపివేశారు. రూ.లక్ష లోపు రుణాలకు అసలుతోపాటు వడ్డీ వసూలు చేస్తున్నారు. సున్నా వడ్డీ సొమ్మును ఏడాది తర్వాత ఎప్పుడు రైతుల ఖాతాలో జమ చేస్తారో తెలియని పరిస్థితి. సున్నా వడ్డీ అందరికీ వర్తింపజేయడం లేదు.  పావలా వడ్డీ రుణాల పథకానికి కేంద్రం రాయితీ వాటా ఇస్తున్నా.. రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడంతో 3 లక్షల మందికిపైగా రుణం తీసుకున్న రైతులు ఏడు శాతం వడ్డీ భరిస్తున్నారు.

తొమ్మిది గంటల విద్యుత్తుకు కోత

హామీ: వ్యవసాయ రంగానికి పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నాం.
వాస్తవం: పగటిపూట ఐదారు గంటలు కూడా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసింది లేదు. 2019లో 11 వేలు, 2020లో 13 వేలు, 2021లో 8 వేలు, 2022లో 18 వేలు, 2023లో 6,724 కలిపి ఐదేళ్లలో ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేవలం 57,878 వ్యవసాయ కనెక్షన్లు మాత్రమే ఇచ్చారు.

ధరల స్థిరీకరణ నిధి ఏదీ?

హామీ: రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం.
వాస్తవం: వైకాపా అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది మొక్కజొన్న 2,858.78 క్వింటాళ్లే కొనుగోలు చేశారు.  2020-21లో ఎనిమిది పంటలు, 2021-22లో నాలుగు పంటలు, 2022-23లో మొక్కజొన్న, శనగలు అదీ కూడా అరకొరగా సీజన్‌ ముగిసిన తర్వాత కొసరంత కొనుగోలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మిర్చి, శనగ, జొన్న, మొక్కజొన్న పంటలకు ధరలు తగ్గినప్పుడు రైతులకు బోనస్‌ ఇవ్వగా, జగన్‌ సర్కార్‌ అలాంటి సాయమేదీ చేయలేదు.

తేడా గమనించారా

తెదేపా - జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో

  • ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష ఆర్థిక సాయం
  • రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా
  • రైతు కూలీలకు కార్పొరేషన్‌ స్థాపించి రాయితీలు, సంక్షేమ పథకాల  అమలు
  • బిందు సేద్యానికి 90 శాతం సబ్సిడీ
  • గోపాలమిత్రల పునర్నియామకం దిశగా చర్యలు
  • ట్రాన్స్‌ఫార్మర్ల ధరల తగ్గింపు, సబ్సిడీపై ఏరియేటర్లు

వైకాపా మ్యానిఫెస్టో

రైతుభరోసా కింద ఏటా రూ.16 వేల చొప్పున ఐదేళ్లలో రూ.80 వేలు
గత ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాల  కొనసాగింపు

ఉసురుతీస్తున్న అప్పులు

హామీ: అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునే రైతు కుటుంబాలు రోడ్డున పడకుండా పునరావాస ప్యాకేజీ కింద రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తాం.
వాస్తవం: ఉమ్మడి జిల్లాలో ఏటా 300-400 మంది వరకు రైతులు, కౌలుదారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 100 మంది మృతి చెందారని వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నా.. అందులో కర్నూలులో 35 మందికి పరిహారం ఇవ్వగా.. నంద్యాలలో నాలుగైదు నెలలుగా 66 మంది కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం అందలేదు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 2019లో 81, 2020లో 74, 2021లో 31, 2022లో 23 మంది ఆత్మహత్యలు జరిగాయని వ్యవసాయాధికారుల లెక్కలు చెబుతున్నాయి.  

బటన్‌ నొక్కారు.. పంట నష్ట సాయం మరిచారు.!!

హామీ: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రూ.4 వేల కోట్లతో విపత్తు సహాయ నిధి ఏర్పాటు.
వాస్తవం: గత ఐదేళ్లలో ఏ బడ్జెట్‌లోనూ రూ.2 వేల కోట్లకు మించి కేటాయించలేదు. 2023 ఖరీఫ్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 30 మండలాలను కరవు ప్రాంతాలుగా గుర్తించారు. 3,75,244 మంది రైతులకు రూ.460.57 కోట్ల పరిహారం జమ చేస్తున్నట్లు సీఎం జగన్‌ బటన్‌ నొక్కి రెండు నెలలవుతున్నా.. ఒక్క రైతు ఖాతాకు డబ్బు జమ కాలేదు. నిబంధనల పేరిట మరో లక్ష మందికి జాబితాలో చోటు దక్కనివ్వలేదు. ఎన్నికల కోడ్‌ వస్తుందని తెలిసి 2023-24 రబీలో ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 31 కరవు మండలాలను ప్రకటించారు. ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసిందే తప్ప పంట నష్ట గణనకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు.
‘‘ 2018 ఖరీఫ్‌, 2018-19 రబీ రెండు సీజన్లలో కలిపి 6.11 లక్షల మంది రైతులకు రూ.659.40 కోట్ల పరిహారం ఇవ్వాలని అధికారులు నివేదించారు. ఆ మొత్తాన్ని కేంద్రం 2019లో విడుదల చేసినా ఐదేళ్లుగా రాష్ట్రం ఇవ్వకుండా ఇతర పథకాలకు దారి మళ్లించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని