logo

పొంగుతున్న గోవా మద్యం

ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లాలో అక్రమ మద్యం పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణ, కర్ణాటకతోపాటు సదూరంలో ఉన్న గోవా నుంచి సైతం జిల్లాకు మద్యం భారీగా రవాణా జరుగుతోంది.

Published : 04 May 2024 04:15 IST

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లాలో అక్రమ మద్యం పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణ, కర్ణాటకతోపాటు సదూరంలో ఉన్న గోవా నుంచి సైతం జిల్లాకు మద్యం భారీగా రవాణా జరుగుతోంది. నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లి చెక్‌పోస్టు వద్ద కంటైనర్‌లో గోవా మద్యం భారీగా పట్టుబడటం సంచలనంగా మారింది. ఓట్ల కోసం.. అక్రమార్జనకు వైకాపా నాయకులు మద్యం రవాణాకు బరితెగిస్తున్నా అధికారులు అంతంతమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారు.

భారీఎత్తున రవాణా

కర్ణాటకతోపాటు గోవా సైతం నకిలీ మద్యానికి కేంద్రంగా గుర్తింపు పొందింది. కర్ణాటక కంటే గోవాలో అధిక బ్రాండ్లు లభ్యమవుతాయి. ఏ బ్రాండ్‌ కావాలంటే ఆ బ్రాండ్‌ నకిలీ మద్యం తయారు చేస్తారు. అక్కడ చిన్నచిన్న ఫ్యాక్టరీలు అధికంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో నకిలీ మద్యం భారీగా తయారవుతోంది. కర్ణాటకకు చెందిన పలువురు అక్రమార్కులు మధ్యవర్తులుగా వ్యవహరించి ఉమ్మడి జిల్లాకు రవాణా చేస్తున్నారు. జిల్లాలో పలువురు వైకాపా నాయకులకు వారితో సత్సంబంధాలున్నాయి. గతంలో పలుమార్లు గోవా మద్యాన్ని కర్నూలు జిల్లా ఆబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. బనగానపల్లికి చెందిన ఓ ప్రజాప్రతినిధి బావమరిది గతంలో ఇలానే లారీలో భారీ మోతాదులో అక్రమ మద్యం తెప్పించి దొరికిపోవటం సంచలనంగా మారింది.  

వైకాపా నేతల బరితెగింపు

ఎన్నికలు సమీపిస్తున్నందున వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. ఆస్పరి మండలం యాటకల్లు-తొగలగట్టు రస్తా వద్ద వైకాపా నేత శ్రీకాంత్‌రెడ్డితోపాటు మరో నలుగురిని పోలీసులు ఇటీవల అరెస్టు చేసి రూ.3.62 లక్షల విలువ చేసే 60బాక్సుల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఆదోని మండలం సంతెకుడ్లూరులో పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రూ.2లక్షల విలువ చేసే 50బాక్సుల కర్ణాటక మద్యం పట్టుకున్నారు. ఏప్రిల్‌ 30న మంత్రాలయం పోలీసులు నాలుగు బాక్సుల కర్ణాటక మద్యం పట్టుకున్నారు. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే కర్నూలు జిల్లా సరిహద్దులోని ఏడు చెక్‌పోస్టుల పరిధిలో 50మంది 22 వాహనాలతో పట్టుబడగా.. 3,063లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోవటం గమనార్హం. మొత్తంమీద ఏప్రిల్‌ నెలలోనే కర్నూలు జిల్లాలోని ఏడు సెబ్‌ స్టేషన్ల పరిధిలో 201మందిని అరెస్టు చేసి 165 కేసులు నమోదు చేసి 6,946లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. చెక్‌పోస్టులు మరింత పటిష్టపరిస్తే ఇంకా భారీగా అక్రమ మద్యం పట్టుబడే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని