logo

ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు

ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది

Published : 25 Apr 2024 05:21 IST

ప్రమాదకర స్థితిలో వంతెన

ఐదేళ్లు.. కూలుతున్నా కదలిక లేదు

 

ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది. నిర్వహణ లేక పలు చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. మొక్కలు మొలిచాయి. రక్షణ గోడలు ఐదారు చోట్ల కూలిపోయాయి. పాదచారుల మార్గంలో సిమెంట్‌ కుంగి రంధ్రాలు ఏర్పడ్డాయి. మెట్ల మార్గం పూర్తిగా ధ్వంసమైంది. పగటి పూటే బిక్కుబిక్కుమంటూ జనం అడుగులు వేయాల్సిన పరిస్థితి. ఇక రాత్రిళ్లు దీపాలు లేక చిమ్మ చిక్కట్లో మెట్ల మార్గంలో వెళ్లేందుకు జంకుతున్నారు. ఐదేళ్లలో పరిస్థితి మరింత చేయిదాటుతున్నా.. కనీస నిర్వహణ పనులు చేపట్టలేదు. ముట్టుకుంటే చాలు కూలుతుందన్నట్లుగా ఉంది పరిస్థితి. వంతెన మధ్యలో హెచ్‌టీ తీగలతో రైలు మార్గం ఉండటం మరింత ఆందోళనకు గురిచేసే అంశం. 15 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పలు మార్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వంతెన సమస్య పరిష్కరిస్తామని హామీఇచ్చినా.. నేటికీ పరిష్కారం కాలేదు.

 పరిశీలనతోనే సరి

ఆదోని బైపాస్‌ రహదారి నిర్మాణం పూర్తికాకపోవడంతో, జాతీయ రహదారిని తాత్కాలికంగా పాత ఆకాశవంతెన మీదుగా అనుమతించారు. వంతెన పరిస్థితి తెలుసుకుని చివరికి భారీ వాహనాల రాకపోకలను నిలువరిస్తూ వంతెన రెండు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వంతెన పటిష్టతపై గతంలో అధికారుల బృందం పరిశీలించింది. నమూనాలు సేకరించి, పటిష్టత నిర్ధారణ కోసం ల్యాబ్‌కు పంపారు. పరిశీలనకే పరిమితమైంది తప్ప అడుగు ముందుకు పడలేదు. స్పందించాలని జనం కోరుతున్నారు.

ఆదోని మార్కెట్‌, న్యూస్‌టుడే: ఆదోని పట్టణ వాసుల ట్రాఫిక్‌ అవస్థలు తీర్చాలని నాలుగు దశాబ్దా కిందట నిర్మించిన వంతెన ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. రక్షణ గోడలు కూలుతున్నాయి.. వంతెనపై మొక్కలు ఏకంగా వృక్షాలుగా మారాయి. ఎక్కడికక్కడ తారు చెదిరి, చువ్వలు తేలాయి. వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. వంతెన కిందికి దిగే మెట్లపై సైతం రక్షణ కరవైంది. పాదచారులు భయం భయంగా కిందకు దిగాల్సిన పరిస్థితి. ‘ఆకాశం బద్దలవుతున్నా’.. ప్రజాప్రతినిధులకు మాత్రం కనీసం చీమకుట్టినట్లైనా లేదు. ఆదోని పట్టణవాసులకే కాకుండా వచ్చివెళ్లే వారికి సైతం ప్రమాదకరంగా మారింది.

తలపైనే ప్రమాదం

గడిచిన ఐదేళ్లలో వంతెనపై రక్షణ గోడలు కూలుతున్నా అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. తపాలా శాఖ కార్యాలయ మార్గం వైపు రెండు చోట్ల వంతెన రక్షణ గోడలు కుప్పకూలాయి. అ సమయంలో జనమెవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇటు వైపు రైల్వేస్టేషన్‌ మార్గంలో పట్టపగలు వంతెన రక్షణ గోడ కూలింది. జనం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పాదచారుల మార్గంలో సిమెంట్‌ కుంగి వ్యక్తులు రెప్పపాటులో తేరుకుని బయటపడ్డారు. గతేడాది చివర్లో ఓ వ్యక్తి మెట్ల మార్గంలో నడుస్తూ అదుపు తప్పి కింద పడుతుండగా.. ఇంతలో తోటి పాదచారులు గుర్తించి పట్టుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. గతంలో ఓ ట్రాక్టరు, ఓ కారు వంతెన పై నుంచి కింద పడిన ఉద్దంతాలూ లేకపోలేదు. పిల్లర్లు మినహా మిగిలిన భాగమంతా సిమెంట్‌, ఇనుము తుప్పు పట్టి పగుళ్లు ఏర్పడి.. ప్రమాద తీవ్రతను హెచ్చరిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని