logo

40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది.

Published : 25 Apr 2024 05:33 IST

కడిమెట్ల గ్రామస్థులకు అభివాదం చేస్తున్న తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి
ఎమ్మిగనూరు గ్రామీణం, ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. 40 ఏళ్లుగా ఆయన కంచుకోటగా భావించే ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో బుధవారం రాత్రి తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రచారం చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే సొంతూరులో నాలుగు దశాబ్దాలు తర్వాత ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ప్రచారం చేయడం గమనార్హం. ఎమ్మెల్యే సోదరుల కుమారులు చెన్నారెడ్డి, విరుపాక్షిరెడ్డి, బాలకృష్ణారెడ్డి, కరుణాకర్‌రెడ్డి ఇటీవల ఎమ్మిగనూరు పర్యటనకు వచ్చిన హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష సమక్షంలో తెదేపాలో చేరారు. ఎమ్మెల్యేకు గట్టి పట్టున్న ఐదు గ్రామాల్లో నాలుగు దశాబ్దాలుగా ఎన్నికలు ఏకపక్షంగా సాగుతుండటం వల్ల ఆయన రాజకీయ ఎదుగుదలలో కీలక భూమికగా మారాయి. ఎమ్మెల్యేకు ఈసారి వైకాపా టికెట్‌ ఇవ్వకపోవడం, ఆయన సోదరుల కుమారులు పార్టీ మారడంతో ఐదు గ్రామాల్లోని 12 వేల ఓట్లు ఏకపక్షంగా జరగకుండా చీలనున్నాయని చర్చ సాగుతోంది. బీవీ ప్రచారంలో ప్రజల నుంచి స్పందన రావడంతో నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది. ఆయన వెంట చెన్నారెడ్డి, మురళీరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని