logo

ఉద్యోగుల ఓట్లు గల్లంతు

పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో వందలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడా సరైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించలేదు.

Updated : 07 May 2024 06:41 IST

నిర్వహణలో ఎన్నికల అధికారుల వైఫల్యం 
ఓటు వినియోగానికి అష్టకష్టాలు

నంద్యాలలో కేంద్రం వద్ద ఉద్యోగినుల ఇబ్బంది

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో వందలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడా సరైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించలేదు. తొలిరోజు 32.5 శాతం పోలింగ్‌ నమోదైంది.

కవర్లకూ కటకటే

ఆత్మకూరు శిక్షణ కేంద్రంలో పార్లమెంటు అభ్యర్థికి సంబంధించిన కవర్‌-ఎలు తక్కువొచ్చియి. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లకు  కవర్‌-ఎలు తక్కువరావడంతో కొందరితో బ్యాలట్‌ పేపర్‌, డిక్లరేషన్‌ లెటర్‌ రెండూ కలిపి కవర్‌-బీలో పెట్టి ఓటు వేయించారు. దీనిపై కొందరు ప్రశ్నించడంతో పోలింగ్‌ను నిలుపుదల చేశారు. గంట తర్వాత కవర్‌-ఎ తెప్పించి పోలింగ్‌ కొనసాగించారు.  ఓటుహక్కు వినియోగించుకున్న  40 మంది ఓట్లు ఏ మేరకు చెల్లుబాటవుతాయని పలువురు అనుమానం వ్యక్తం చేశారు.

బ్యాలట్‌ పత్రాలకు నిరీక్షణ

జిల్లా కేంద్రంలోని ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉద్యోగులకు శిక్షణ నిచ్చారు. జిల్లాలోని ఉద్యోగులతో పాటు వైఎస్సార్‌, ప్రకాశం, కర్నూలు జిల్లాలకు చెందిన ఉద్యోగులు హాజరయ్యారు. వీరిలో పాణ్యం, గడివేముల మండలాలకు చెందిన ఉద్యోగులతో పాటు కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలకు చెందిన ఉద్యోగుల బ్యాలట్‌ పేపర్లు మధ్యాహ్నం 3 గంటలు దాటినా రాలేదు. అక్కడికి చేరుకున్న జాయింట్‌ కలెక్టర్‌, నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి రాహుల్‌కుమార్‌రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు.

ఆళ్లగడ్డలో అయోమయం

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణం వైపీపీఎం పాఠశాల ఆవరణలో పీవో, ఏపీవోలు 590 మంది పోస్టల్‌ బ్యాలట్‌ను వినియోగించుకోవాల్సి ఉంది. 80 మంది ఉపాధ్యాయుల పోస్టల్‌ బ్యాలట్లు గల్లంతయ్యాయి. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై విచారణ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

ఆత్మకూరులో ఆందోళన

ఆత్మకూరు: బాలికల ఉన్నత పాఠశాలలో ముందస్తు ఏర్పాట్లేమి చేయలేదు. ఓటు వినియోగించుకున్న వారికి గుర్తు వేసేందుకు వినియోగించే ఇంటిలెబుల్‌ సిరా(ఇంక్‌) అందుబాటులో పెట్టలేదు. మధ్నాహ్నం 1 గంటలకు సిబ్బందికి శిక్షణ పూర్తయింది. 3.30 గంటల వరకు పోలింగ్‌ ప్రారంభం కాలేదు. ఈ కేంద్రంలో నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలకు చెందిన ఉపాధ్యాయుల ఓట్లు పెద్ద సంఖ్యలో గల్లంతయ్యాయి.

వైకాపా ఎర

‘‘ పాదయాత్రలో హామీలిచ్చారు.. గద్దెనెక్కిన తర్వాత పట్టించుకో లేదు.. కనీసం ఒకటో తేదీన వేతనాలు ఇవ్వ లేదు.. బకాయిలు బండలా పేరుకుపోయినా స్పందించడం లేదని’’ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ఉద్యోగుల ఓట్లు చేజారకుండా అధికార పార్టీ నాయకులు ‘ఎర’వేసే ప్రయత్నం చేశారు. ఆదివారం రాత్రికే పోస్టల్‌ బ్యాలట్‌ ఉద్యోగుల వివరాలు సేకరించారు. కొంత మంది ద్వారా మధ్యవర్తిత్వం జరిపి కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. వైకాపాకు తగిన బుద్ధి చెప్పాలన్న కసి, పట్టుదల చాలా మంది ఉద్యోగుల్లో కనిపించింది. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగలేదు. నంద్యాల జిల్లాలో 17,939 పోస్టల్‌ బ్యాలట్‌ ఓటర్లు ఉన్నారు. ఇందులో నంద్యాల నియోజకవర్గంలో 4,800, ఆళ్లగడ్డలో 3,372, బనగానపల్లిలో 2,858, డోన్‌ 1,970, నందికొట్కూరు 2,224, శ్రీశైలంలో 2,715 మంది ఓటర్లు ఉన్నారు. నంద్యాలలో ఫెసిలిటేషన్‌ కేంద్రం వద్దనే కొంత మంది ఉద్యోగులకు అల్పాహారం, నీటి సీసాలు, శీతల పానీయాలు అందజేశారు. ఓటుకు రూ.2 వేలు ఫోన్‌పే చేస్తామన్నా ఉద్యోగులు తిరస్కరించినట్లు తెలిసింది.

పాణ్యం పరేషాన్‌

పాణ్యం నియోజకవర్గ పరిధిలో ఓటర్లుగా ఉన్న ఉద్యోగులు 1,250 మంది నందికొట్కూరు, ఆళ్లగడ్డ, డోన్‌, శ్రీశైలం తదితర నియోజకవర్గాలకు పీవోలు, ఏపీవోలుగా విధులు నిర్వహిస్తున్నారు. రెండో విడత ఎక్కడైతే శిక్షణకు హాజరయ్యారో అక్కడ ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పించారు.. అక్కడ జాబితాల్లో వారి పేర్లు కనిపించలేదు. ఆందోళనకు గురైన వారు కర్నూలు జిల్లా కేంద్రంలోని బి.క్యాంపు ప్రభుత్వం బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పాణ్యం నియోజకవర్గ ఫెసిలిటేషన్‌ సెంటరులో ఓటేసేందుకు వచ్చారు. అక్కడా జాబితాలో వారి పేర్లు లేవని.. తాము ఎక్కడికెళ్లి ఓటేయాలంటూ ఎన్నికల సిబ్బంది, రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)తో ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు. 1,500 మంది ఓటర్ల పేర్లు గల్లంతయితే ఎలా.. వారి పరిస్థితి ఏంటని పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్యను పాణ్యం తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి ప్రశ్నించారు. ‘‘ ఓటర్ల వివరాలు, పోస్టల్‌ బ్యాలట్‌ సామగ్రిని నంద్యాల జిల్లా కలెక్టర్‌కు పంపాం.. అక్కడి నుంచి ఆయా నియోజకవర్గాలకు జాబితాను పంపాల్సి ఉంది.. సమాచార లోపంతో పొరపాటు జరిగింది.. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎక్కడైతే రెండో విడత శిక్షణ పొందారో అక్కడ మంగళవారం ఓటేయొచ్చని’’ ఆర్వో వివరణ ఇచ్చారు.

భయపెట్టే ప్రయత్నం

నంద్యాల నేరవిభాగం, నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే : మనకంతా మంచి స్థానాలు కేటాయించారు.. వైకాపా అభ్యర్థికి ఓటు వేసి సహకరిద్దామని ఓ శాఖకు చెందిన డివిజన్‌ స్థాయి అధికారి కింద స్థాయి ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారు. అంతేకాదు ఆ శాఖకు చెందిన ఉద్యోగుల వివరాలు, చరవాణి నంబరులు వైకాపా అభ్యర్థికి చేరవేశారు. ఒక్కరికి రూ.2 వేలు ఇప్పించారు.. డబ్బులు తీసుకోకపోతే ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో తీసుకున్నట్లు సమాచారం.


ఎవరూ పట్టించుకోవడం లేదు

- జవహర్‌నాయక్‌, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు

పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించాల్సి ఉండగా పట్టించుకోలేదు. కేంద్రం వద్ద జాబితాలో పేర్లు చూసుకునే ఏర్పాటు చేయలేదు. రాజకీయ పార్టీల ప్రతినిధుల వద్దనున్న జాబితాలో పేర్లు చూసుకోవాల్సి వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

ఆత్మకూరు, న్యూస్‌టుడే


మూడుసార్లు దరఖాస్తు చేసినా

- బాలాజీరావు, ఆత్మకూరు

మంత్రాలయం నియోజకవర్గంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా. అక్కడే ఫాం-12లో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నా. కర్నూలులో ఎన్నికల విధులు కేటాయించారు. పోస్టల్‌ బ్యాలట్‌ కోసం మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నా. జాబితాలో ఎక్కడ నా పేరులేదు. అధికారులను అడిగితే ఎన్నికల విధుల్లో పాల్గొనే కేంద్రాల వద్ద చూసుకోమంటున్నారు. మళ్లీ ఫాం-12 ఇవ్వమంటున్నారు.

న్యూస్‌టుడే, ఆత్మకూరు


జాబితాలో పేరులేదు

ఐజయ్య, ఆళ్లగడ్డ

ఆళ్లగడ్డ నుంచి పీవోగా విధులు నిర్వర్తించేందుకు నందికొట్కూరుకు వచ్చా. ఆళ్లగడ్డ నియోజకవర్గం కేంద్రానికి వెళ్లి పోస్టల్‌ బ్యాలట్‌ ఓటర్ల జాబితాను పరిశీలిస్తే నా పేరు లేదు. ఆరోసారి ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నా. ఇలాంటి గందరగోళ పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదు. పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకుందామంటే జాబితాలో పేరు లేదు.

నందికొట్కూరు, న్యూస్‌టుడే


ఓటు వేయలేకపోయా

కృష్ణ, కర్నూలు

పగిడ్యాల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. నాకు కర్నూలులో ఓటు ఉంది. ఎన్నికల విధులు ఆళ్లగడ్డ పరిధిలో ఉండటంతో ఇక్కడ పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునేందుకు వచ్చాను.  ఓటుకు దరఖాస్తు చేసేటప్పుడు అన్ని వివరాలు సక్రమంగా పూర్తి చేశాను. ఓటు వివరాలు లేవని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని