logo

కబ్జాల కాటసాని కథ తేల్చుదాం

గజ్జల కొండలో రూ.కోట్ల విలువైన గ్రావెల్‌ను తవ్వేశారు.. వక్ఫ్‌ భూములు కబ్జా చేశారు.. జగన్నాథగట్టు భూములు కొల్లగొట్టారు.. పాత్రికేయుల భూములు కబ్జా చేశారు.. కబ్జాల రెడ్డి.. కాటసాని కథ తేల్చుదామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. పాణికేశ్వరస్వామి భూములు ఆక్రమించారని, నకలీ పత్రాలు సృష్టించారని దుయ్యబట్టారు.

Published : 07 May 2024 06:45 IST

కర్నూలులోనూ కేజీఎఫ్‌ ఉంది
పథకాలు కావాలంటే కూటమి రావాలితెదేపా అధినేత చంద్రబాబునాయుడు
ఈనాడు,  కర్నూలు, కల్లూరు గ్రామీణ ఓర్వకల్లు

మాట్లాడుతున్న తెదేపా  అధినేత చంద్రబాబు నాయుడు

గజ్జల కొండలో రూ.కోట్ల విలువైన గ్రావెల్‌ను తవ్వేశారు.. వక్ఫ్‌ భూములు కబ్జా చేశారు.. జగన్నాథగట్టు భూములు కొల్లగొట్టారు.. పాత్రికేయుల భూములు కబ్జా చేశారు.. కబ్జాల రెడ్డి.. కాటసాని కథ తేల్చుదామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. పాణికేశ్వరస్వామి భూములు ఆక్రమించారని, నకలీ పత్రాలు సృష్టించారని దుయ్యబట్టారు. ముజాఫర్‌నగర్‌లోని   524 సర్వే నంబరులో మసీదుకు చెందిన రెండెకరాలు కొట్టేశారన్నారు.  అలాంటి వ్యక్తిని మళ్లీ గెలిపిస్తే అడుగు పొలం కూడా మిగిల్చరన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి, ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి

కర్నూలు నగర పరిధిలోని కల్లూరు చెన్నమ్మ కూడలిలో సోమవారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కబ్జాలరాయుడి పాపాలపై కథనం రాస్తే ‘ఈనాడు’ కార్యాలయంపై దాడి చేశారన్నారు. ఇద్దరు దుర్గామాతల్ని పోటీకి పెట్టానని... వారు కబ్జాల రెడ్డిని భస్మం చేస్తారన్నారు. ‘మీలో బాధ, ఆగ్రహం, ఆవేశం, కోపం ఉన్నాయి. కాటసాని గ్రావెల్‌ ఫీల్డ్‌ కర్నూలులోనూ ఉందన్నారు. ఆయన కబ్జాలు చూస్తే గుండెలు మండవా? అని ప్రశ్నించారు. దానిని మే 13న ఎన్నికల రోజు చూపండి. వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించండి. వైకాపాను భూస్థాపితం చేయండి. శబరి ఒక వైద్యురాలు. ఆమె ఇక్కడున్న వారికి సరైన వైద్యం చేస్తారు.. శబరి తాత శేషశయనారెడ్డి 70 ఏళ్ల కిందటే రాజకీయం చేశారు. బైరెడ్డి బిడ్డగా ప్రజల రుణం తీర్చుకునేందుకు ఆమె ఎంపీగా పోటీ చేస్తున్నారు. చరితమ్మ కూడా స్థానికురాలే. మెత్తగా కనబడతారుగానీ అడ్డమొస్తే ఎదురు తిరుగుతారు. ఇద్దరూ మహిళలే. వారిద్దరూ దుర్గాదేవిలా పోరాడి భూబకాసురుల్ని తుదముట్టిస్తారు. వారిద్దరినీ గెలిపించండి’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి,  నంద్యాల ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి నియోజకవర్గంలో భూ బకాసురులు ఉన్నారు... పేదల భూములు కొల్లగొట్టారు.. భూదందా, మట్టి మాఫియాతో రూ.కోట్లు దోచుకున్నారు... ఆ బకాసురుడిని చూసి పాణ్యం ప్రజలందరూ వణికిపోతున్నారు.. ఓటుతో భూస్థాపితం చేయాలి.

సీఏఏ, ఎన్‌ఆర్సీ బిల్లులకు వైకాపా మద్దతిచ్చింది..

పాణ్యం నియోజకవర్గ పరిధిలో 1.60 లక్షల ఓట్లు కల్లూరులోని 16 డివిజన్లలో ఉన్నాయి. మరో 1.50 లక్షల ఓట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. లేపోతే చాలా అన్యాయం జరుగుతుంది. బీసీ డిక్లరేషన్‌ తెస్తాం. నియోజకవర్గ పరిధిలో అన్ని కులాలు, మతాల వారికి ప్రాధాన్యమిచ్చాం.. వైకాపా ఒక్క రెడ్డి సామాజికవర్గానికి మాత్రమే సీట్లు ఇచ్చింది. 4 శాతం రిజర్వేషన్లు కాపాడుతా. పార్లమెంటులో సీఏఏ, ఎన్‌ఆర్సీ బిల్లులకు వైకాపా మద్దతు ఇచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు.

మెగా డీఎస్సీపై తొలి సంతకం అంటూ

పాణ్యం మనదే..

‘ఓర్వకల్లులో విమానాశ్రయం నిర్మించా.. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ను 30 వేల ఎకరాల్లో ఏర్పాటుచేశా.. జగన్‌ పాలనలో అందులో పెట్టుబడులు వచ్చాయా?’ అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.  నాకు ‘పాణ్యం కొత్తకాదు.. కర్నూలు కూడా కొత్త కాదు... నేను రాయలసీమ బిడ్డను. మండుటెండలో మీరు నిల్చుంటే సూర్యుడు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు. నా జీవితంలో ఇంత ఆదరణ ఎప్పుడూ చూడలేదు. పాణ్యం మనదే’ అని చంద్రబాబునాయుడు అన్నారు.

సూపర్‌ సిక్స్‌ పథకాల ప్రదర్శన

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా

‘‘కల్లూరు పట్టణ పరిధిలో రెండు రోజులకోసారి తాగునీరు వస్తోంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యం నీళ్లు ఇస్తాం. హంద్రీనీవా నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా కల్లూరు, ఓర్వకల్లు మండలాలకు నీళ్లు అందిస్తాం. అలగనూరు జలాశయం నుంచి గడివేముల, పెసలవాయి ప్రాంతాలకు నీరొచ్చేలా అనుసంధానం చేస్తాం. దీనిద్వారా గడివేముల, బండిఆత్మకూరు, నంద్యాల మండలంలోని 30 వేల ఎకరాలకు నీళ్లు అందుతాయి. ఓర్వకల్లులో పరిశ్రమలు వస్తాయి. వైకాపాను ఓడించేందుకు ప్రజలందరూ సిద్ధమా? పట్టుదల, సంకల్పంతో వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించేందుకు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని