logo

తరలొచ్చిన ఉద్యోగులు.. వణికిపోయిన వైకాపా

ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్దీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వినియోగించుకునే కేంద్రాల వద్దకు అధికార పార్టీ అభ్యర్థులు, నేతలు తమ అనుచరులు వచ్చి ఉద్యోగులతో మాటలు కలిపి ప్రలోభాలకు తెరలేపారు.

Published : 08 May 2024 01:58 IST

69.80 శాతం ఓటు హక్కు వినియోగం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్దీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వినియోగించుకునే కేంద్రాల వద్దకు అధికార పార్టీ అభ్యర్థులు, నేతలు తమ అనుచరులు వచ్చి ఉద్యోగులతో మాటలు కలిపి ప్రలోభాలకు తెరలేపారు. ఓటు వేసేందుకు వెళ్తున్నవారితో తమకు అవకాశమివ్వాలని కోరారు. కొందరు ఉద్యోగులు మీరెవరని నిలదీస్తే అక్కడినుంచి తప్పించుకుని వెళ్లిపోతున్నారు. మరోవైపు ఎన్నడూ లేనివిధంగా పోస్టల్‌ ఓట్లు వేసేందుకు ఉద్యోగులు భారీగా తరలివస్తుండటంతో అధికార వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది. ఎలాగైనా ఓట్లు కొనేసి గెలిచేందుకు అడ్డదారులు వెతుకుతోంది.

కేంద్రాల్లో తప్పని ఇబ్బందులు

పీవోలు, ఏపీవోలకు రెండో విడత శిక్షణ ఇచ్చి అక్కడ పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం ఇచ్చారు. ఫలితంగా చాలాచోట్ల ఉద్యోగులు గంటల తరబడి వరుసలో నిల్చోవాల్సి వస్తోంది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తొలి రోజున ఇరుకు ప్రదేశాల్లో.. ఒకేచోట కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. రెండోరోజూ ఇదే పరిస్థితి నెలకొంది.

ఆ ఓట్లు చెల్లనట్లేనా

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల బాగోతం ఆరంభం నుంచి విమర్శల పాలవుతోంది. ఫారం-12 దరఖాస్తుల స్వీకరణ నుంచి ఓటు వేసే దాకా బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. కొంతమంది ఆర్వోలు తప్పు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చే డిక్లరేషన్‌ ఫామ్‌పై అక్కడే ఉన్న గెజిటెడ్‌ అధికారి ఓటరు వివరాలు ధ్రువీకరిస్తూ సంతకం చేసి స్టాంప్‌ వేయాల్సి ఉంటుంది. లేకుంటే అనర్హత కింద పక్కన పెడతారు. కొందరు ఉద్యోగ, ఉపాధ్యాయులు డిక్లరేషన్‌ ఫారాలపై గెజిటెడ్‌ అధికారితో సంతకాలు చేయించుకొని స్టాంపు వేయించుకోకుండా హడావుడిగా ఓట్లేసేస్తున్నారు. ఈ తరహా ఓట్లు వందల్లోనే ఉంటాయని అంచనా..

భారీగా తరలివచ్చి..

రెండో రోజైన మంగళవారం పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఓటు వేసేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయులు పోటెత్తారు. పీవోలు, ఏపీవోలు, ఇతర విధులు నిర్వహించే ఉద్యోగులు, పోలీసులు, బీఎల్వోలు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇలా.. అందరూ ఓటేసేందుకు కేంద్రాలకు తరలివచ్చారు. మొదటి రోజు 6,291 మంది ఓటేయగా.. రెండో రోజు కర్నూలు, పాణ్యం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో అత్యధిక మంది ఓట్లేయడం విశేషం. మొత్తం రెండో రోజు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 7,916 మంది ఓటేశారు. రెండు రోజుల్లో 14,207 (69.80 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

నేడు ఓటింగ్‌కు చివరి గడువు  

పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లేసేందుకు వచ్చే ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి బి.క్యాంపులోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఏర్పాటుచేసిన పోస్టల్‌ బ్యాలట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని ఆమె మంగళవారం పరిశీలించారు. ఉద్యోగులందరూ బుధవారం సాయంత్రంలోగా పోస్టల్‌ బ్యాలట్‌ను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఎలాంటి పొరబాట్లకు తావులేకుండా ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్య, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ చల్లా కల్యాణి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని