logo

ప్రజాధనం గాలికొదిలేశారు

అత్యవసర వైద్యసేవల సమయంలో రోగికి కృత్రిమశ్వాస అందించడం తప్పనిసరి. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్‌ కోసం ఎన్నో అగచాట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Updated : 23 May 2024 06:08 IST

 పేట జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంటుకు తాళం

మీకు అన్ని వసతులతో ఇల్లుంది..
దానికి తాళం వేసి పక్కనే వేరొక గృహం అద్దెకు తీసుకుంటారా?
అలా చేస్తే ఏమనుకోవాలి?
నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో అచ్చంగా అలాగే చేస్తున్నారు. అధునాతన ఆక్సిజన్‌ ప్లాంట్‌కు మూతవేసి రూ.లక్షలతో బయట ఆక్సిజన్‌ కొంటున్నారు. ఇదేమిటో చోద్యం. 


న్యూస్‌టుడే-(పాతబస్టాండ్‌)నారాయణపేట : అత్యవసర వైద్యసేవల సమయంలో రోగికి కృత్రిమశ్వాస అందించడం తప్పనిసరి. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్‌ కోసం ఎన్నో అగచాట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.  
కొవిడ్‌ రెండో వేవ్‌ సమయంలో నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.1.2 కోట్లతో 2021 అక్టోబరులో ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే ప్లాంటు ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహజ సిద్ధమైన గాలిని ఒత్తిడికి గురిచేసి నైట్రోజన్, కార్బన్‌డై ఆక్సైడ్‌లను వేరుచేసి ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసేలా అమర్చారు. 
ఈ ప్లాంటు గంటకు సుమారు 500 లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తుంది. వందలాది కరోనా బాధితుల ప్రాణాలు కాపాడటం సాధ్యమయ్యింది.
ఆస్పత్రిలోని 92 పడకలకు ఆక్సిజన్‌ లైన్‌ బిగించారు. కరోనా తగ్గిపోయినా ఆస్పత్రికి వివిధ సమస్యలతో వచ్చే వారికి ఆక్సిజన్‌ ఎంతో అవసరం. అయినా నిర్వహణను పట్టించుకోకుండా మూలపడేశారు. 

ఎంతో అవసరం

ప్రమాదాలలో క్షతగాత్రులైన వారు,  గుండె జబ్బుల పీడితులు, మెదడు సక్రమంగా పనిచేయని రోగులు, ప్రసవ సమయంలో గర్భిణులకు ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఉపిరితిత్తుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారికి కృత్రిమ శ్వాస అందించాలి. అన్ని ఐసీయూలలో ఆక్సిజన్‌ ఏర్పాట్లు తప్పనిసరి. అత్యవసర సమయంలో అందుబాటులో లేకపోతే రోగి ప్రాణాలకే ముప్పు. 

వ్యయం తగ్గించే అవకాశం ఉన్నా..

ప్రస్తుతం నారాయణపేట జిల్లా ఆస్పత్రికి ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్‌ తెప్పిస్తున్నారు. ఒక్కొక్క ట్యాంకరు ఖరీదు రూ.3లక్షల వరకు ఉంటుంది. సాధారణ రోజుల్లో నెలకు 3 నుంచి 4 ట్యాంకర్లు అవసరం. సీజనల్‌ వ్యాధులు విజృంభించే సమయంలో వినియోగం మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ప్లాంట్ను మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకువస్తే ఎంతో డబ్బు ఆదా అవుతుంది. ఆ నిధులతో మరింత నాణ్యమైన వైద్యం అందించడానికి వీలు కలుగుతుంది. ఇది తెలిసినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నది అంతుచిక్కని ప్రశ్న.


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..

ఆక్సిజన్‌ ప్లాంటులో కొంతకాలంగా ఉత్పత్తి నిలిచిపోయింది. మరమ్మతులు అవసరం. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దిల్లీ నుంచి నిపుణులను రప్పించి బాగుచేయించాలి.ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్‌కు కొరత లేదు.

 డా.రంజిత్‌కుమార్‌. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, నారాయణపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని