logo

రేపటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్‌ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈసారి ఉమ్మడి జిల్లాలో ఫలితాలు అనుకున్న స్థాయిలో రాలేదు.

Published : 23 May 2024 03:53 IST

హాజరుకానున్న 30,978 మంది విద్యార్థులు

మహబూబ్‌నగర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో సన్నద్ధత పరీక్ష రాస్తున్న విద్యార్థినులు

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : ఇంటర్‌ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈసారి ఉమ్మడి జిల్లాలో ఫలితాలు అనుకున్న స్థాయిలో రాలేదు. రాష్ట్రస్థాయిలో ప్రథమ సంవత్సరం ఫలితాల్లో చివరి నుంచి రెండో స్థానం(34వ స్థానం)లో జోగులాంబ గద్వాల జిల్లా ఉండగా.. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో చివరి నుంచి రెండో స్థానంలో నారాయణపేట జిల్లా నిలిచింది. రాష్ట్రస్థాయిలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో వరుసగా మహబూబ్‌నగర్‌ జిల్లా 53.94 (ప్ర.సం.) - 64.21 (ద్వి.సం.), నాగర్‌కర్నూల్‌ 53.48 -  59.06, నారాయణపేట  52.78 -  53.81, వనపర్తి 45.57 -  64.75, జోగులాంబ-గద్వాల 44.3 (ప్ర.సం.) -  62.82 (ద్వి.సం.) శాతం ఉత్తీర్ణత నమోదైంది. 
తరగతులతో సందేహాల నివృత్తి.. : ఈ నెల 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షలను విద్యార్థులు రాయనున్నారు. ఫలితాలు మెరుగయ్యేందుకు ఈ పరీక్షలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో అనుత్తీర్ణులైన విద్యార్థులకు కొన్నిచోట్ల ఆన్‌లైన్‌ తరగతులు, మరికొన్ని చోట్ల ప్రత్యక్ష తరగతులు నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు. వివిధ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు నిపుణులు నెల పాటు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో పరీక్షల పర్యవేక్షణనకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ముఖ్య పర్యవేక్షకులు, విభాగ పర్యవేక్షకులు, సిట్టింగ్‌ స్వ్కాడ్‌లు, ప్లయింగ్‌ స్క్వాడ్‌లను పరీక్షల పర్యవేక్షణకు ఏర్పాటు చేశారు. తరగతి గదుల్లో చీకటి లేకుండా విద్యుత్తు సౌకర్యం కల్పించారు. వేసవి నేపథ్యంలో తాగునీరు, ఫ్యాన్లు తదితర వసతులు కల్పించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 30,978 మంది విద్యార్థులకు అధికారులు 74 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.


ప్రిన్సిపల్‌ సంతకం అవసరం లేదు : సప్లిమెంటరీ పరీక్ష రాసే విద్యార్థులు సంబంధిత కళాశాలలో లేదా ఇంటర్‌ విద్యాశాఖ పోర్టల్‌ నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చు. పోర్టల్‌ నుంచి తీసుకున్న హాల్‌టికెట్‌పై కళాశాల ప్రిన్సిపల్‌ సంతకం లేకున్నా పరీక్షకు అనుమతిస్తారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని