logo

ముడా కల సాకారం

మూడేళ్లుగా ఎదురు చూస్తున్న మహబూబ్‌నగర్‌ నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) ఏర్పాటు కల సాకారమయింది. ప్రభుత్వం  సోమవారం జీవో విడుదల చేయడంతో స్థానికంగా ఆనందం వ్యక్తమవుతోంది.. మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, భూత్పూరు పురపాలికలతోపాటు 12 మండలాల పరిధిలోని 143 గ్రామాలు మరింత అభివృద్ధి దిశగా పయనించనున్నాయి.. 2020 అక్టోబరులో ముడా ఏర్పాటుకు కలెక్టరు వెంకట్‌రావు  ప్రతిపాదనలు పంపించగా.. ఏడాదిన్నర అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..

Published : 15 Feb 2022 03:28 IST

మూడు పురపాలికలు, 143 గ్రామాలతో ఏర్పాటు 

మరింత అభివృద్ధికి పడనున్న అడుగులు

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌

మూడేళ్లుగా ఎదురు చూస్తున్న మహబూబ్‌నగర్‌ నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) ఏర్పాటు కల సాకారమయింది. ప్రభుత్వం  సోమవారం జీవో విడుదల చేయడంతో స్థానికంగా ఆనందం వ్యక్తమవుతోంది.. మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, భూత్పూరు పురపాలికలతోపాటు 12 మండలాల పరిధిలోని 143 గ్రామాలు మరింత అభివృద్ధి దిశగా పయనించనున్నాయి.. 2020 అక్టోబరులో ముడా ఏర్పాటుకు కలెక్టరు వెంకట్‌రావు  ప్రతిపాదనలు పంపించగా.. ఏడాదిన్నర అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. 

రెండు జలాశయాలూ ముడా పరిధిలోకి.. : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా  కర్వెన, ఉదండాపూర్‌ జలాశయాలూ ముడా పరిధిలోకి రానున్నాయి. జలాశయాల వద్ద సుందరీకరణ, పర్యాటక అభివృద్ధికి ముడా ద్వారా మంజూరయ్యే నిధులు ఉపయోగపడతాయి.

ప్రత్యేక కార్యాలయం అవసరం.. : ముడాకు ప్రత్యేక కార్యాలయం అవసరం ఉంటుంది. అధికారుల నియామకం, సిబ్బంది కేటాయింపు అవసరం.  ప్రస్తుతానికి వీటికిపై స్పష్టత లేదు. ముడా ఏర్పాటుతోపాటు ప్రాధికార సంస్థ కమిటీని ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరు ఎస్‌.వెంకట్‌రావు ఛైర్మన్‌గా, మహబూబ్‌నగర్‌ పురపాలిక కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. వీరితోపాటు జడ్చర్ల ఎమ్మెల్యే డా.లక్ష్మారెడ్డి,  దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, సీడీఎంఏ కమిషనర్‌ సత్యనారాయణ సభ్యులుగా ఉండనున్నారు. ముడా పరిధిలోకి మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, దేవరకద్ర, పరిగి నియోజకవర్గాలకు వచ్చాయి. పరిగి నియోజకవర్గంలోని మహమ్మదాబాద్‌, సంగాయపల్లి గ్రామాలను కూడా ఈ సంస్థలో కలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు ముడా పరిధిలోకి వచ్చాయి.

కార్పొరేషన్‌ కాకుండానే.. : తెలంగాణలోని ప్రస్తుతం ఉన్న నగరాభివృద్ధి సంస్థల కేంద్రాలకు కార్పొరేషన్లు ఉన్నాయి. సాధారణంగా కార్పొరేషన్‌ ఉన్న నగరాలకే నగరాభివృద్ధి ప్రాధికార సంస్థలు ఏర్పాటు చేస్తారు. కానీ మహబూబ్‌నగర్‌ ఇప్పటికీ పురపాలికనే. కార్పొరేషన్‌ ఏర్పాటు కాకుండానే మహబూబ్‌నగర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు కావడం విశేషం. మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, భూత్పూరు పురపాలికలు ప్రస్తుతం ఉన్నవిధంగానే ఉంటాయి. పాలకవర్గాలు అలానే ఉంటాయి. గ్రామాలు అలానే ఉంటాయి. సర్పంచులు, వార్డు సభ్యులు అలానే ఉంటారు. అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపులు, లేఅవుట్లు, వెంచర్ల అనుమతులు మాత్రం ముడా పరిధిలోకి వస్తాయి.

నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పడితే..

* ఆ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్‌ ప్లాన్‌ ఉంటుంది.
* 40 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లానును రూపొందిస్తారు.
* నగరాభివృద్ధి ప్రాధికార సంస్థలకు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులుంటాయి.
* కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్మార్ట్‌ సిటీ, హృదయ్‌, అమృత్‌ పథకం ద్వారా నిధులు భారీగా వస్తాయి.
* ఈ సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాలకు రహదారుల సౌకర్యం కలుగుతుంది.
* పురపాలికలతోపాటు గ్రామాల్లోనూ ఉద్యానవనాలు, చిన్నారుల ఆట స్థలాలు ఏర్పాటు చేస్తారు.
* కూడళ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తారు.
* పురపాలికలకే పరిమితమైన అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ గ్రామాల్లోనూ పకడ్బందీగా అమలవుతుంది.
* హైమాస్టు లైట్లు, వీధి దీపాలు ఈ ప్రాంతం రహదారుల వెంట ఉంటాయి.
* సుందరీకరణలో భాగంగా రెండు వరసల రహదారులు నిర్మిస్తారు.
* ఇంటి నిర్మాణం చేపట్టాలంటే సెట్‌ బ్యాక్‌ నిబంధన అమలు తప్పనిసరి.
* లేఅవుట్లు, వెంచర్లు చేయాలంటే ప్రాధికార సంస్థ నుంచి అనుమతి తప్పనిసరి. అక్రమ లేఅవుట్లకు ఆస్కారం ఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని