logo

పరీక్షలు 6.79 లక్షలు.. లబ్ధి రూ.22.65 కోట్లు!

తెలంగాణ డయాగ్నస్టిక్‌ కేంద్రాలు పేద రోగుల పాలిట వరమవుతున్నాయి.. వచ్చిన రోగం కంటే అయ్యే ఖర్చుకే భయపడాల్సిన పరిస్థితుల్లో టీహబ్‌ ద్వారా అందుతున్న సేవలు ఉపశమనంగా నిలుస్తున్నాయి.. ఏడాదిన్నర వ్యవధిలో ఉమ్మడి జిల్లాలో 6.79 లక్షల నమూనాలకు పరీక్షలు

Updated : 19 Aug 2022 05:54 IST

తెలంగాణ డయాగ్నస్టిక్స్‌తో పేదలకు మేలు


నమూనాల ఫలితాలను పరిశీలిస్తున్న టీ హబ్‌ నోడల్‌ అధికారి డా.సృజన

న్యూస్‌టుడే, పాలమూరు: తెలంగాణ డయాగ్నస్టిక్‌ కేంద్రాలు పేద రోగుల పాలిట వరమవుతున్నాయి.. వచ్చిన రోగం కంటే అయ్యే ఖర్చుకే భయపడాల్సిన పరిస్థితుల్లో టీహబ్‌ ద్వారా అందుతున్న సేవలు ఉపశమనంగా నిలుస్తున్నాయి.. ఏడాదిన్నర వ్యవధిలో ఉమ్మడి జిల్లాలో 6.79 లక్షల నమూనాలకు పరీక్షలు నిర్వహించిన తీరు ఈ కేంద్రాల సద్వినియోగాన్ని తెలియజేస్తున్నాయి.. ఈ పరీక్షల ద్వారా రూ.22.65 కోట్ల మేర పేదలకు లబ్ధి చేకూరినట్లు అంచనా.

ఆస్పత్రులకు వచ్చే రోగులకు రోగ నిర్ధారణ కోసం రక్త పరీక్షలు తప్పనిసరి అవుతున్నాయి. ప్రైవేటు ల్యాబ్‌లలో రూ.200ల నుంచి రూ.2 వేల వరకు ఈ పరీక్షలకు వ్యయమవుతుంది. టీ హబ్‌ ద్వారా ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్స్‌ కేంద్రాల్లో పైసా ఖర్చు లేకుండా పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తుండటం రోగులకు వెసులుబాటుగా ఉంటుంది. ప్రస్తుతం గద్వాల, మహబూబ్‌నగర్‌లలో మాత్రమే ఈ కేంద్రాలు ఉండగా త్వరలోనే నారాయణపేటలో కేంద్రం ప్రారంభం కానుంది. నాగర్‌కర్నూల్‌, వనపర్తిలకూ మంజూరవుతాయని తెలుస్తోంది.

* జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని ప్రతి పీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో సేకరించిన నమూనాలను అదే రోజు ఆయా టీ హబ్‌ కేంద్రాలకు పంపిస్తారు.

* 24 గంటల్లోనే ఫలితాలు వస్తాయి. మరుసటి రోజు ఆస్పత్రులకు నివేదికలు పంపిస్తారు.

* నివేదికలు వైద్యులకు చూపించి రోగులు సేవలు పొందవచ్చు

రాష్ట్రంలోనే గద్వాల కేంద్రానికి మొదటిస్థానం

గద్వాలలో జనవరి 9, 2021న తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ కేంద్రం ప్రారంభించారు. ఆ సమయంలో ప్రారంభించిన ఇతర జిల్లాల కేంద్రాలతో పోలిస్తే ఈ కేంద్రంలో ఎక్కువ పరీక్షలు నిర్వహించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 1,34,638 మంది రోగుల నుంచి 2,90,854 రక్త నమూనాలను సేకరించగా, ఈ కేంద్రంలో 5,11,376 రకాల పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల విలువ రూ.16.15 కోట్లు ఉంటుంది. సీబీపీ, థైరాయిడ్‌, ఎల్‌ఎఫ్‌టీ, ఆర్‌ఎఫ్‌టీ, డయాబెటిక్స్‌ తదితర పరీక్షలకు ఎక్కువ సంఖ్యలో రక్త నమూనాలు వచ్చాయి. ప్రతి నెలా 30 వేల నుంచి 35 వేల వరకు శాంపిళ్లు వస్తున్నాయి.

మహబూబ్‌నగర్‌లోనూ సద్వినియోగం

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో టీ హబ్‌ కేంద్రం జూన్‌ 9, 2021న ప్రారంభించారు. 53,319 మంది రోగులకు చెందిన 89,745 రక్త నమూనాలకు 1,67,985 పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల విలువ రూ.6.50 కోట్ల వరకు ఉంటుంది. ప్రతి రోజు పీహెచ్‌సీల నుంచి 1,000 నుంచి 1,500ల వరకు శాంపిళ్లు వస్తున్నాయి.

కొత్తగా రేడియాలజీ విభాగం

మహబూబ్‌నగర్‌లో టీ హబ్‌కు రేడియాలజీ విభాగం మంజూరు అయింది. ప్రస్తుతం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి వెనుక భాగంలో భవనాన్ని నిర్మిస్తున్నారు. అందులోనే అన్నిరకాల పరికరాలు, యంత్రాలను సమకూర్చనున్నారు. ఇప్పటికే చెస్ట్‌ ఎక్స్‌రే, గుండెకు సంబంధించిన ఈసీజీ, 2డీ ఇకో తదితర యంత్రాలు వచ్చాయి. వాటిని ఆసుపత్రిలో ఉంచి రోగులకు సేవలను అందిస్తున్నారు. ఎంఆర్‌ఐ సేవలు కూడా త్వరలోనే జిల్లాకు రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ నోడల్‌ అధికారి డా.సృజన మాట్లాడుతూ ఉచిత పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రోగులు తమ పీహెచ్‌సీలకు వెళ్లి నమూనాలు ఇస్తే సరి అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని