logo

బలవర్ధక బియ్యం..ఆరోగ్య భారతం

విద్యార్థులు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించి బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోషకాహార లోపాలను నివారించేందుకు కొత్తగా ప్రధాన మంత్రి పోషణ్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే పోర్టిఫైడ్‌

Published : 20 Aug 2022 03:24 IST

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం షాబజార్‌ ఉన్నత

పాఠశాలలో భోజనం చేస్తున్న విద్యార్థులు

విద్యార్థులు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించి బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోషకాహార లోపాలను నివారించేందుకు కొత్తగా ప్రధాన మంత్రి పోషణ్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే పోర్టిఫైడ్‌ బియ్యాన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేద్రాలకు సరఫరా చేస్తోంది. దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని బడులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం బలవర్ధక బియ్యాన్ని పంపిణీ చేస్తోంది.

ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషక లోపంతో బాధపడుతున్న విద్యార్థులున్నట్లు ఆయా సర్వేల్లో తేలుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజనానికి విటమిన్లు, ఖనిజాలు మిళితం చేసిన సన్నబియ్యంతో వండిన అన్నాన్ని వడ్డిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్థులకుపైగా లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం భోజనానికి సన్నబియ్యాన్ని వాడుతున్నారు. వాటి స్థానంలో బలవర్థక బియ్యం అందిస్తున్నారు. సాధారణ ప్రక్రియలో బియ్యన్ని పాలిష్‌ చేసినప్పుడు అందులో సహజంగా ఉండే ఖనిజాలు, పోషకాలు వెళ్లిపోతాయి. వాటిని పెంచేందుకు అవసరమైన ఖనిజ, లవణాలను జత చేయడాన్నే పోర్టిఫికేషన్‌ అంటారు. పోషకాహార లోపాన్ని నివారించడానికి బియ్యాన్ని పిండి చేసి అందులో ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ స్టాండర్ట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆమోదించిన మోతాదులో విటమిన్లు, ఖనిజాలను కలిపి తిరిగి బియ్యపు గింజలుగా తయారు చేస్తారు. 100 కిలోల సాధారణ బియ్యానికి కిలో ఫోషకాలున్నవి కలిపి సరఫరా చేస్తారు.

పాఠశాలలు, అంగన్‌వాడీలకు సరఫరా చేస్తున్న బలవర్ధక బియ్యం

ఎంతో ఉపయుక్తం..

సాధారణ బియ్యంలో ఐరన్‌ తక్కువగా ఉంటుంది. పోషక మిళిత బియ్యంతో వండిన ఆహారం రక్తహీతను నివారిస్తుంది. ఖనిజ లవణాలు అందుతాయి. ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బీ12తో కణాల ఎదుగుదల, కొత్తవాటి తయారీ వేగవంతమవుతాయి. పోర్టిఫైడ్‌ బియ్యంతో విద్యార్థుల్లో ఏకాగ్రత, తెలివితేటలు, సామర్థ్యం, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. - ఆచార్య డా.ఎన్‌.సురేశ్‌, చిన్నపిల్లల విభాగ అధిపతి, ప్రభుత్వ వైద్య కళాశాల, మహబూబ్‌నగర్‌

అంగన్‌వాడీలు, పాఠశాలలకు సరఫరా చేస్తున్నాం..

పోషక విలువలున్న బియ్యాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికిగాను ఈ ఏడాది మే నుంచి సరఫరా చేస్తున్నాం. అంగన్‌వాడీలకు జనవరి నుంచే ప్రారంభించాం. ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే నెలకు మధ్యాహ్న భోజనానికి 2వేల క్వింటాళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు 800 క్వింటాళ్లు సరఫరా చేస్తున్నాం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోషకాలున్న బియ్యం సరఫరా అవుతున్నాయి. - రాజేశ్‌, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజరు, మహబూబ్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని