logo

కాళన్న బాటలో కదిలిండ్రు కవులు

నా భాషలో నేను మాట్లాడుతుంటే అమ్మపాలు తాగినట్టుంటుంది పరభాషలో మాట్లాడుతుంటే గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుంటుంది నా భాషలో నేను రచనలు చేస్తుంటే పండుగ పూట పరమాన్నం తిన్నట్టుంటుంది కాళోజీ కవిత్వాన్ని చదువుతుంటే

Updated : 09 Sep 2022 06:07 IST

 పాలమూరు వాకిట్ల మాండలికంలో పుస్తకాలు  
 ఇయ్యాల తెలంగాణ భాష పండుగ రోజు

- న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ సాంస్కృతికం

ఎల్లూరి శివారెడ్డిచే సన్మానం అందుకుంటున్న యువకవి బోల యాదయ్య

నా భాషలో నేను మాట్లాడుతుంటే అమ్మపాలు తాగినట్టుంటుంది పరభాషలో మాట్లాడుతుంటే గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుంటుంది నా భాషలో నేను రచనలు చేస్తుంటే పండుగ పూట పరమాన్నం తిన్నట్టుంటుంది కాళోజీ కవిత్వాన్ని చదువుతుంటే మధురమైన మామిడిపండ్ల రసాన్ని కడుపారా తాగినట్టుంటుంది
ప్రజల గోడును ‘నా గొడవ’ అనుకుని అక్షరాలే ఆయుధంగా పోరాడిన ప్రజాకవి కాళోజీ. తెలంగాణ భాష గొప్పతనం చాటి ప్రత్యేక ఉద్యమానికి ఊపిరిలూదిన తొలిపొద్దు ఆయన. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కాళోజీ పుట్టిన దినాన్ని తెలంగాణ భాషా పండుగగా తీర్మానించిన రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఘనంగా జరుపుతున్నది. కాళోజీకి పాలమూరు జిల్లాతో ప్రత్యేక అనుబంధమున్నది. 1953లో అలంపూర్‌లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్‌ సప్తమ వార్షికోత్సవ మహాసభల్లో ‘నా గొడవ’ కవితా సంపుటిని కవులు, రచయితలు ఆవిష్కరించిండ్రు. తెలంగాణ భాషను బతికించుకునేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా కవులు కాళోజీ అడుగుజాడల్లో సాగుతున్నరు. అలాంటి వాళ్లపై ‘న్యూస్‌టుడే’ కథనం.

మనసును కదిలించే మట్టికవి
తెలంగాణ మాండలికం గొప్పతనం తన కవితలతో జెప్పే ప్రయత్నం జేస్తున్నరు యువకవి బోల యాదయ్య. మహబూబ్‌నగర్‌ మండలం ధర్మాపూర్‌కు చెందిన ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎన్టీఆర్‌ డిగ్రీ కళాశాలలో తెలుగు బోధిస్తున్నరు. ఆకలి, పేదోళ్ల కష్టాల నుంచి పుట్టే ఆయన కవితలు మనసును కదిలించేలా ఉంటయి. వాటిని చదివితే పల్లెల్లో మట్టి మనుషులతో మాట్లాడినట్లే ఉంటది. తెలంగాణ ఆకలికేక, జై తెలంగాణ, తొలిపొద్దు, కన్నీటి కట్ట, ప్రేమకావ్యం, మట్టిమొగ్గలు, శిథిల స్వప్నం, పసిమొగ్గలు, నా బీఈడీ అనుభవాలు పేరిట ఆయన పుస్తకాలు అచ్చనయి. ‘గూడశాట’ వచన కవిత్వం ఇంకొన్ని రోజుల్లో రానున్నది. పాలమూరు యువకవుల వేదికకు పెద్దగా కొనసాగుతున్న ఆయన చానా మంది అక్షర యోధులను సాహితీలోకానికి పరిచయం చేసిండ్రు. అధికార భాషగా వాడితేనే తెలంగాణ మాండలికాన్ని బతికించుకోవచ్చని అంటున్నరు బోల యాదయ్య.
మాండలికంలో పద్యాల రచన
మహబూబ్‌నగర్‌ పట్టణం హౌసింగ్‌ బోర్డులో ఉండే రంగస్థల నాటకోపాధ్యాయుడు వరకవుల నరహరిరాజు తన రచనలతో తెలంగాణ భాషను కాపాడుకునుటకు పాటుపడుతుండ్రు. ఆయన తర్ఫీదులో అనేక మంది రంగస్థల కళాకారులుగా తయారైండ్రు. గ్రామీణ భాషలోనే రాయాలన్న తలంపుతో ‘జర్ర ఇనుకోండ్రీ మా నాయ్న’ అనే పద్య కావ్యాన్ని తీసుకొచ్చిండ్రు. ఇందులో 200 దాక పద్యాలు ఉన్నయి. దీని ద్వారా చాలా మంచి పేరు వచ్చింది. ‘కసిరెడ్డి కలలో సరస్వతి’ పేరుతో కావ్యభాషలో ఓ పుస్తకం రాసిండ్రు. ఇది కొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తది. తెలంగాణ భాషలో గేయం, వచనమే గాదు.. పద్యాలు గూడా రాయాలని, అప్పుడే మన మాండలికాన్ని బతికించుకోగలమని చెబుతున్నరు వరకవుల నరహరిరాజు. అందుకోసమే ‘జర్ర ఇనుకోండ్రీ మా నాయ్న’ పేరుతో పద్యకావ్యం రాసిన్నని, మరింత మంది ఇట్లనే రాయాలని ఆయన కొత్త కవులకు సూచించిండ్రు.  
చిరకాలం నిలిచే ప్రయత్నం
వాడుకలో లేక ఇప్పటికే చాలా పదాలు కనుమరుగైనయి. అలాంటి పదాలను కాపాడుకునే గొప్ప పనిని తన విద్యార్థులతో జేప్పిచ్చిండ్రు తెలుగు పండితుడు పల్లెర్ల రామ్మోహన్‌రావు. తాను పనిచేసే మూసాపేట మండలం వేములలోని సర్కారు బడి విద్యార్థులతోనే పల్లెల్లో మాట్లాడుకునే పదాలన్నీ సేకరించిండ్రు. ఆయనే సంపాదకుడిగా మారి ‘పల్లెబాస’ పేరుతో పుస్తకం తీసుకొచ్చిండ్రు. దీన్ని ప్రముఖ కవి దేశ్‌పతి శ్రీనివాస్‌ చేతుల మీదుగా విడుదల జేసిండ్రు. ఇందులో సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, జంటపదాలు, ధ్వన్యనుకరణ పదాలు, వృత్తి సంబంధ పదాలు, ఆభరణాల పేర్లు, వ్యక్తులు, ఇండ్ల పేర్లు, ఆటపాటలు, భోజన పదాలు, చుట్టరికాలు, సమయాలు, శాపెనలు, ఉర్దూ ప్రభావంతో వచ్చిన పదాలు వంటివి అనేకం ఉన్నయి. ఇంతవరకు నింఘంటువుల్లోకి ఎక్కని పదాలు గూడా ఉన్నయి. పల్లెర్ల రామ్మోహన్‌రావు గతంలో గూడా భాషాపరంగా చాలా ప్రయోగాలు చేసిండ్రు. తెలంగాణ బిడ్డగా, తెలుగు గురువుగా తనకు చాలా తృప్తినిచ్చిన పని ఇదని పల్లెర్ల రామ్మోహన్‌రావు అన్నరు. ఈ సంకలనం పిల్లల్లో తెలంగాణ భాషపై ప్రేమ మరింత పెరుగుతుందన్నరు.

మరచిపోయిన పదాలు యాదిజేస్తూ
మన అమరులు యాదికొస్తే, కండ్లల్ల నీళ్లు ఆగవు, వోల్ల పేరుమీన పెట్టుకోవాలే, మన యిండ్లల్ల దీపాలు, కండ్లముంగిట పోరడు, మంటల్ల పోర్లాడుతుంటే, నోట్ల్యకెళ్లి మాటెల్లక, బతికున్న శవాలైతము.. అంటూ తెలంగాణ ఉద్యమాన్ని కండ్లకు గట్టిండ్రు కవయిత్రి కేఏఎల్‌ సత్యవతి. మహబూబ్‌నగర్‌ పట్టణం పద్మావతికాలనీకి చెందిన ఈ విశ్రాంత ఉద్యోగి మాండలిక కవితలు ఎంతో భిన్నంగా ఉంటున్నయి. పల్లెభాషలో రాసే ఆమె అనేక కవితలు, కథలకు ప్రముఖులు ఎన్నోసార్ల మెచ్చుకున్నరు. ఆమె రచనల నిండా తెలంగాణ మాండలిక పదాలు, నుడికారాలు, సామెతలే ఉంటయి. మరుగునవడిపోయిన పదాలను సత్యవతి వెలికితీసే ప్రయత్నం జేస్తున్నరు. తెలంగాణ మాండలికం ప్రత్యేక భాషని, దీని ప్రత్యేకతను నిలుపుకునేందుకు కవులు, ప్రజలు ఎవరికి వారు ప్రాణంబెట్టి పనిచేయాలంటున్నారు.
పాలమూరు నెల పొడుపు
నాగలితో కొండ్రేసినట్టు, బీడు దుక్కుల్లో దుమ్ముగుంటుక కొట్టినట్లు, చేదురు బావిమీద మోట గిరకలా, పచ్చజొన్న పాలకంకులా, జమ్మిచెట్టు మీద పాలపిట్టల కిచకిచలా.. నా తెలంగాణ భాష అంటూ అక్షరాల నిండా తెలంగాణ భాష అందాన్ని నింపుతున్నరు నాగర్‌కర్నూల్‌కు చెందిన వనపట్ల సుబ్బయ్య. తెలంగాణ యాసతో అనేక కవిత సంపుటిలను ఆవిష్కరించిండ్రు. ఇప్పటిదాక ఆయన తీసుకవచ్చిన పది సంపుటాలల్లో ఒల్లెడ, మశాల్‌, జనశంకరుడు, ఊరచెరువు, కుర్చి తదితరాలు సాహిత్య రంగాన ఉన్న ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేసిండ్రు. చాలా రాష్ట్ర, జిల్లా స్థాయి సాహితీ సదస్సులల్ల పాల్గొని తన కవితలు వినిపించి పాలమూరుకు మాండలికం చాటిండ్రు. నెల పొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక తోటి నెలనెలా కవి సమ్మేళనాలు, సాహితీ సదస్సులు నిర్వహిస్తుండ్రు.. అచ్చమైన తెలంగాణ భాష మీద ‘తెలంగాణ తేనె పలుకులు’ అనే పుస్తకాన్ని తీసుకువచ్చిండ్రు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని