logo

బస్‌పాస్‌ అంటే.. వద్దంటున్నారు..

విద్యార్థులకు ప్రభుత్వం సబ్సిడీపై జారీచేస్తున్న బస్సుపాస్‌లను కొన్ని బస్సుల్లో అనుమతించడం లేదు. ఈ కారణంగా విద్యార్థులు సకాలంలో విద్యా సంస్థలకు చేరుకోలేకపోతున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడానికి ప్రభుత్వం ఆర్టీసీ తరఫున తగ్గింపు ధరల్లో బస్సుపాసులు అందిస్తుంటే క్షేత్రస్థాయిలో పాస్‌లున్న

Published : 28 Sep 2022 01:44 IST

రోజూ గంట ఆలస్యంగా పాలిటెక్నిక్‌ విద్యార్థినుల హాజరు

బస్టాండ్‌లో వేచి ఉన్న పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థినులు

పెబ్బేరు, న్యూస్‌టుడే : విద్యార్థులకు ప్రభుత్వం సబ్సిడీపై జారీచేస్తున్న బస్సుపాస్‌లను కొన్ని బస్సుల్లో అనుమతించడం లేదు. ఈ కారణంగా విద్యార్థులు సకాలంలో విద్యా సంస్థలకు చేరుకోలేకపోతున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడానికి ప్రభుత్వం ఆర్టీసీ తరఫున తగ్గింపు ధరల్లో బస్సుపాసులు అందిస్తుంటే క్షేత్రస్థాయిలో పాస్‌లున్న విద్యార్థులను కండక్టర్లు బస్సుల్లోకి అనుమతించడం లేదు. పెబ్బేరు మహిళా పాల్‌టెక్నిక్‌ కళాశాలలో జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన 214 మంది విద్యార్థినులు చదువుతున్నారు. కళాశాల వసతిగృహం ఇంకా ప్రారంభంకాకపోవడంతో విద్యార్థినులు పెబ్బేరులోని ప్రయివేట్‌ వసతిగృహాల్లో ఉంటూ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. కళాశాలకు వెళ్లేందుకు బస్సులు ఎక్కాలని బస్టాండులో వేచి ఉంటూ ఆ రూట్లో వెళ్లే బస్సు రాగానే ఎక్కే ప్రయత్నం చేస్తుంటే కండక్టర్లు అనుమతించడం లేదని విద్యార్థినులు వాపోతున్నారు. రోజూ ఉదయం 9.30 గంటలకు తరగతులు ప్రారంభమవుతుంటే కళాశాలకు చేరుకోవడానికి నిత్యం గంట వరకు ఆలస్యమవుతోందని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పెబ్బేరు బస్టాండ్‌లో 9.30 గంటలు దాటినా ఎక్కువ మంది కళాశాల ఏకరూప దుస్తుల్లో ఉన్నవారు కనిపించారు. వీరిని బస్సుల్లోకి అనుమతించని విషయంపై కళాశాల ప్రిన్సిపల్‌ రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థినులు రోజూ ఆలస్యంగా తరగతులకు వస్తున్న విషయంపై వనపర్తి డిపో ఆర్టీసీ అధికారులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. వనపర్తి డీఎం పరమేశ్వరితో ‘న్యూస్‌టుడే’ మాట్లాడగా ఏ డిపోనకు చెందిన బస్సుల్లో విద్యార్థినులను ఎక్కించుకోవడం లేదో గుర్తించి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆయా డిపో సిబ్బందిపై చర్యలకు సిఫారసు చేస్తామని, వనపర్తి డిపో బస్సుల్లో విద్యార్థినులను అనుమతించాలని సిబ్బందిని ఆదేశిస్తామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని