logo

దారి దోపిడీ నిందితులకు రిమాండ్‌

జాతీయ రహదారిపై శేర్పల్లి(బి) వద్ద జనవరి 27న దారి దోపిడీకి పాల్పడిన నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ నర్సింహ తెలిపారు.

Published : 02 Feb 2023 04:41 IST

నిందితులతో ఎస్పీ నర్సింహ, డీఎస్పీ మహేశ్‌

భూత్పూర్‌ : జాతీయ రహదారిపై శేర్పల్లి(బి) వద్ద జనవరి 27న దారి దోపిడీకి పాల్పడిన నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ నర్సింహ తెలిపారు. భూత్పూర్‌ సర్కిల్‌ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. కొత్తమొల్గరకు చెందిన గొర్రెల కాపరి రాజమల్లేష్‌ జీవాల మేతకు నెలరోజుల కిందట భూపాలపల్లి జిల్లాకు వెళ్లారు. జనవరి 25న కొత్తమొల్గరకు వచ్చిన ఆయన 27న తిరిగి రాత్రి 10.30 గంటల వేళ హైదరాబాద్‌ వెళ్లేందుకు భూత్పూర్‌ కూడలిలో నిలబడ్డారు. అప్పుడే మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన వీరేందర్‌ అలియాస్‌ చిన్న, ఆయన స్నేహితులు రవికాంత్‌, సంతోష్‌, జైపాల్‌ కారులో వచ్చారు. హైదరాబాద్‌ వెళుతున్నట్లు చెప్పి అతడిని కారులో ఎక్కించుకున్నారు. శేర్పల్లి(బి) వద్దకు వెళ్లగానే కారును నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మల్లేష్‌ను స్క్రూడ్రైవర్‌తో బెదిరించి అతడి వద్దనున్న రూ.1,500, చరవాణి లాక్కుని అక్కడే వదిలేసి వెళ్లారు. మల్లేశ్‌ అదే రాత్రి కొత్తమొల్గరకు కాలినడక వెళ్లి విషయాన్ని భార్యకు వివరించారు. మర్నాడు తిరిగి భూపాలపల్లికి వెళ్లిపోయారు. బాధితుడి భార్య అదేనెల 30న భూత్పూర్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు నిర్వహించారు. జిల్లా కేంద్రానికి చెందిన అబీద్‌ నుంచి వీరేందర్‌ రూ.2వేలకు కారును అద్దెకు తీసుకున్నట్లు తేలడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరేందర్‌, రవికాంత్‌, సంతోష్‌, జైపాల్‌ నేరం అంగీకరించారు. నగదు, చరవాణి, కారును రికవరీ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. కేసును త్వరగా ఛేదించిన ఎస్సై భాస్కర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు వెంకటేశ్‌, నవీన్‌కు రివార్డు అందిస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు. డీఎస్పీ మహేశ్‌, సీఐ రజితారెడ్డి పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని